Home Breaking గులాబీ దళపతి కేసిఆర్ కు తప్పని ఆ ఒక్క టెన్షన్

గులాబీ దళపతి కేసిఆర్ కు తప్పని ఆ ఒక్క టెన్షన్

271
0
గులాబీ దళపతి కేసిఆర్ ఐదేళ్లుగా ఎదురులేని రాజుగా తెలంగాణను పాలిస్తున్నారు. తెలంగాణ రాజ్యంలో ఆయన చెప్పిందే వేదం… ఆయన మాటే శాసనం. ఐదేళ్లలో ఆయనతో తలపడిన హేమాహేమీలు మట్టికరచిపోయారు. సోదిలోనే లేకుండాపోయారు. కనుసైగ చేస్తే వీర కడ్గాలు అప్పగించి దాసోహమయ్యారు ప్రత్యర్థులు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ రాజ్యానికి కేసిఆరే రాజు.
ముందస్తు ఎన్నికల వరకు కూడా ఇదే తీరు సాగింది. కానీ పార్లమెంటు ఎన్నికల వేళ రాజాది రాజా అన్నట్లుగా ఉన్న కేసిఆర్ కు ఒక విషయం మాత్రం గుబులు రేపుతున్నది. ఏంటా విషయం… గుబులు రేపేవారు ఎంతటి మొనగాళ్లా అనుకుంటున్నారు కదా? చదవండి.
2014 ఎన్నికల తర్వాత కానీ, మొన్నటి ముందస్తు ఎన్నికల తర్వాత కానీ… కేసిఆర్ కనుసైగ చేస్తే పరుగు పరుగున ప్రగతిభవన్ కు వచ్చి గులాబీ కండువా కప్పుకున్న నాయకులు కోకొల్లలు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్ లు, ఎంపిటీసిలు, జెడ్పీటిసిలు ఇలా ఒకరేమిటి ప్రతి వ్యక్తి ప్రగతి భవన్ ఆదేశం వెలువడిన క్షణాల్లో గులాబీగూటికి చేరారు. అలా చేరినవారిలో కొందరు అధికార దాహంతో వచ్చి ఉండొచ్చు… మరికొందరు కేసుల భయంతో కావొచ్చు, ఇంకొందరు అక్రమ ఆస్తులు కాపాడుకునే ప్రయత్నంలో కావొచ్చు… కొందరైతే పవర్ పార్టీలో ఉండాలన్న ఆశతో కావొచ్చు… కారణాలేమైనా క్యూ కట్టి మరీ పార్టీలో చేరిపోయారు. ఈ పార్లమెంటు ఎన్నికల సమయంలో కనుచూపుతోనే శాసించగల నాయకుడైన కేసిఆర్ కు మింగుడుపడని వారు తెరమీదకు వచ్చారు. వారే నిజామాబాద్ రైతులు.

ఎమ్మెల్యేలే కేసిఆర్ ఆదేశం పాటించి క్షణాల్లో కండువాలు మార్చివేసినవేళ మూడు సామాన్య రైతులు మాత్రం కేసిఆర్ కు ఎదురునిలిచారు. కేసిఆర్ కుమార్తె పోటీ చేసిన నిజామాబాద్ లో 178 మంది రైతులు నామినేషన్ వేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ ఎన్ని వత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోటీలో ఉన్నారు. ప్రతిపక్ష నేతలే అధికార పార్టీ వత్తిళ్లకు తల్లడిల్లిపోయినవేళ రైతులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. కడుపులో పేగులు లేని రైతులు ఏం చేస్తారనుకుంటున్నప్పటికీ వారు అధికార పార్టీని ఇప్పుడు కలవరపెడుతున్నారు.
ఏకంగా సిఎం కూడా కొంత కలవరపాటుకు గురయ్యారనడానికి ప్రత్యక్ష ఉదాహరణే మాజీ మంత్రి మండవ ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించడం. మండవ వెంకటేశ్వరరావు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడు మండవ. మొన్నటి ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా మండవ రాజకీయాలకు దూరమైతున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గానికి బలమైన పట్టు ఉంది. ఎక్కువమంది సెటిలర్లు అక్కడ ఉన్నారు.
ఎపి సిఎం చంద్రబాబుతో కేసిఆర్ వైరం నడుపుతున్నవేళ నిజామాబాద్ లో స్థిరపడిన కమ్మ సెటిలర్లు టిఆర్ఎస్ అభ్యర్థి కవితకు ఓటేస్తారో లేదో అన్న భయం పట్టుకుందనిపిస్తోంది. అందుకే మండవ ఇంటికి కేసిఆర్ స్వయంగా వెళ్లి పార్టీలోకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. కేసిఆర్ కనుసైగ చేస్తే పెద్ద పెద్ద లీడర్లే ఆయన ముందు వాలుతున్నవేళ… కేసిఆరే మండవ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఉపముఖ్యమంత్రులు, మంత్రులకే కేసిఆర్ దర్శనభాగ్యం దొరకనివేళ రాజకీయాలకు దూరంగా ఉన్న మండవ ఇంటికెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించడం నిజామాబాద్ గెలుపు కోసమే అంటున్నారు.

మండవ చేరడం ద్వారా కమ్మ సామాజికవర్గం ఓట్లు గుండుగుత్తగా వస్తాయన్న ఆశతో టిఆర్ఎస్ నేతలు ఉన్నారు. అంతేకాకుండా మండవ ఫాలోయర్లు కూడా టిఆర్ఎస్ కు ఓటేస్తారన్న ఆశిస్తున్నారు.
అంతకుముందు టిడిపిలో సుదీర్ఘ కాలం పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ని సైతం టిఆర్ఎస్ లో చేర్పించుకున్నారు. టిడిపిని వీడిన తర్వాత అరికెల కాంగ్రెస్ లో చేరారు. కానీ ఆయనను ఇప్పుడు టిఆర్ఎస్ లోకి తెచ్చుకున్నారు. ఎన్నికలు ముగియగానే ఎమ్మెల్సీ ఆకుల లలితను కూడా కారెక్కించుకున్నారు. ఎన్నికలవేళ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, విద్యార్థి నేత రాజారాం యాదవ్ ను సైతం గులాబీ గూటిలో చేర్చుకున్నారు. నిజామాబాద్ లో ప్రత్యర్థి పార్టీలో ఏ రాజకీయ నాయకుడూ లేకుండా అందరినీ గులాబీ గూటికి తీసుకొస్తున్నారు.
ఈ పరిణామాలు చూస్తుంటే సొంత కూతురు నియోజకవర్గంలోనే టిఆర్ఎస్ కు గట్టి సవాల్ ఎదురవుతున్నట్లు చర్చ జరుగుతోంది. రేపటి ఫలితాల్లో టిఆర్ఎస్ చతురత, వ్యూహరచన ద్వారా గెలపోటములు ఆధారపడి ఉండొచ్చు కానీ… ఇప్పుడు మాత్రం నిజామాబాద్ రైతులు ఆ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి…

ఎలక్షన్ కమిషన్ కు రేవంత్ రెడ్డి లేఖ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here