ఆంధ్ర పాలకులు మరిచిన చారిత్రక దినం ‘అక్టోబర్ 1: ఆంధ్రరాష్ట్ర అవతరణ దినం

 

చారిత్రక వారసత్వాన్ని కొనసాగిద్దాం నాటి హామీల అమలు సాధన కోసం పోరాడుదాం..

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)

అక్టోబర్ 1 – 1953 రాయలసీమ ప్రజలు మరిచిపోలేని రోజు. అంతే కాదు నాడు చేసుకున్న ఒప్పందాలు అమలు చేయకపోడం కారణంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోయిన చారిత్రక వాస్తవం కూడా. చారిత్రక నేపథ్యం గుర్తుచేసుకుంటు నాటి హామీలు అమలు చేయాలని అందుకు రాజకీయ అనుబంధాలు పక్కన పెట్టి సీమ ప్రజలు ముందుకు సాగాలని గుర్తు చేస్తూ రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక కార్యాచరణ రూపొందించినది. ఆ కార్యాచరణలో భాగస్వామ్యం కావాలని మనవి.

అక్టోబర్ 1 ప్రాధాన్యత…
1953 అక్టోబర్ 1 కి పూర్వం నేటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడులో భాగంగా ఉన్నది. 1913 లో ఏర్పడిన ఆంధ్రమహాసభ తమిళనాడు నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు పోరాటం చేసింది. 200 సంవత్సరాలు ముందే ఆంగ్లేయుల ఎలుబడిలోకి మధ్య కోస్తా ఆంధ్రప్రాంతం వెళ్లడం వారు నేటి కాటన్ బ్యారేజి , ప్రకాశం బ్యారేజి ని నిర్మించడం , విద్యారంగానికి తగు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాయలసీమ ప్రాంతానికన్నా అభివృద్ధి చెందినది. ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించిన సీమ పెద్దలు కోస్తా ఆంధ్రతో కలిసి రాష్ట్రంగా ఏర్పాటుకు సుముఖంగా లేరు. సీమతో సంబందం లేకుండా ఆంధ్ర రాష్ట్ర సాధన సాధ్యం కాదని భావించి రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్దికి గాను కృష్ణా పెన్నారు ప్రాజెక్టు , రాజధాని హామీ ఇచ్చారు. అదే శ్రీభాగ్ అవగాహన. అలాంటి హామీ , పొట్టిశ్రీరాములు గారి ఆమరణ దీక్ష ఫలితంగా 1953 అక్టోబరు1న తొలి భాషాప్రయోక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
ఒప్పందాల ఉల్లంఘన కారణంగా తీవ్రంగా నష్టపోయిన సీమ
ఒప్పందాలను పాలకులు అమలు చేయకపోవడం వల్ల రాయలసీమ అభివృద్ధిలో వెనుకబడింది. పూర్వ ఆంద్ర రాష్ట్రంగా నేటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నాటి హామీల అమలు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా చెన్నై నుంచి విడిపోయిన రాష్ట్రం నేటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం. సహజంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 నే జరపడం సముచితంగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు నేటి ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రం తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన 1956 నవంబర్ 1 న విడిపోయిన రాష్ట్రంలో అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం చారిత్రక తప్పిదం. ఇప్పటికైనా పాలకులు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
అక్టోబర్ 1 న జరపాల్సిన అవతరణ దినోత్సవాన్ని నవంబరు1 న జరడం చారిత్రక తప్పిదం.
చారిత్రక నేపథ్యం రాయలసీమ అభివృద్ధితో ముడిపడి ఉన్న అక్టోబర్ 1ని గుర్తు చేసుకుంటూ నాటి హామీల అమలు కోసం రాయలసీమ సమాజం ముందుకు సాగాలి. అందుకుగాను సీమ ప్రజలు రాజకీయ పార్టీల అనుబంధాలు పక్కనపెట్టి అక్టోబర్1 తమకు తోచిన పద్దతిలో కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కార్యక్రమాలు నిర్వహించాలి.