నేడు దేశవ్యాప్త కార్మికవర్గ సార్వత్రిక సమ్మె కారణాలు – కర్తవ్యాలు

(పి. ప్రసాద్ (పీపీ),కే. పొలారి)
రేపు సార్వత్రిక సమ్మెలోకి భారత కార్మికవర్గం వెళ్తోంది. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ఉద్యమస్ఫూర్తి నిచ్చే ఓ ముఖ్య రాజకీయ పరిణామాన్ని తెలియజేయాల్సి ఉంది.
గత చరిత్రలో ఏనాడు లేని విధంగా రేపు మొదటిసారిగా ఒకవైపు కార్మికవర్గం, మరోవైపు రైతాంగం మోడీ షా ప్రభుత్వ నిరంకుశ విధానాలపై ఏక కాలంలో పోరాడుతున్నారు. ఇదొక కొత్త పరిణామంగా భావించవచ్చు.
సమాజంలో ఎన్ని తరగతుల ప్రజలు వున్నా, భౌతిక వస్తు సంపదల్ని సృష్టించే వాళ్ళు ఇద్దరు మాత్రమే. ఒకరు రైతు, రెండో వాడు కార్మికుడు. ఈ ఇద్దరిలో ఉత్పత్తి శక్తుల పరంగా రైతు కంటే కార్మికుడు ఉన్నత స్థానంలో వుంటాడు. రైతాంగం కంటే సాధారణంగా కార్మికవర్గం లో ఎక్కువ ఐక్యత, చలన శీలత, సమరశీలత వుంటాయి. అవి వర్గపరమైన గుణగణాలు తప్ప వ్యక్తిగత లేదా నాయకత్వ పరమైన అంశాల వల్ల కాదు.
పై నేపథ్యం వల్ల సహజంగా కార్మిక వర్గ పోరాటాల నుండి రైతాంగం ఉద్యమ స్ఫూర్తిని పొందుతుంది. అయితే ఈసారి మోడీ ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకం గా ఒక విలక్షణమైన ఐక్యతను రైతాంగం ప్రదర్శించటం ఆసక్తిని కలిగిస్తుంది.
రైతాంగ పోరాట పిలుపు పేరుకు అది దేశవ్యాప్త పిలుపు కావచ్చు. కానీ దానికి దేశవ్యాప్త స్వభావం లేదు. ప్రధానంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు పరిమితం. దీనికి గల నేపథ్య కారణాల్ని మరో సందర్భంలో పరిశీలించాల్సి ఉంది. ఇప్పుడు వాటిలోకి వెళ్లడంలేదు. అయితే కార్మిక వర్గం రేపు 26న దేశ వ్యాపిత సమ్మెకు కు వెళ్తున్న సమయంలోనే మరోవైపు 26, 27 తేదీలు రెండు రోజులలో రైతాంగం “చలో ఢిల్లీ” కి సిద్దం అవుతోంది. దేశంలోని దాదాపు 500 రైతు సంఘాలతో ఏర్పడ్డ ఐక్య వేదిక (ALL INDIA KISAN SANGHARSH COORDINATION COMMITTEE- AIKSCC) ఈ పిలుపు ఇచ్చింది. ఫలితంగా చరిత్రలో మొదటిసారి కార్మిక, కర్షక రంగాల జమిలి పోరాట పిలుపులు ఏకకాలంలో జరగ బోతుండటం విశేషం.
.
కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లు ఎలాగైతే నేడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో, రైతాంగానికి వ్యతిరేకంగా కూడా మూడు వ్యవసాయ చట్టాలను ఇదే కరోనా కాలంలో తెచ్చింది. ఇప్పటివరకు రైతాంగం పక్షాన కొన్ని కంటి తుడుపు సంక్షేమ చట్టాలు, పథకాలు, సబ్సిడీలు వగైరా కొనసాగుతూ వచ్చాయి. అవి ఈ వ్యవసాయ చట్టాలతో రద్దు అవుతాయి. మార్కెటింగ్ శాఖ చేపట్టే రైతు అనుకూల విధానం రద్దు అవుతుంది. గిట్టుబాటు ధర ఎలాగూ రావడం లేదు. ఇక ప్రభుత్వం ప్రకటించే అరకొర “మద్దతు ధర” కూడా లేకుండా పోతుంది. నేడు దేశ వార్షిక బడ్జెట్ సుమారు 30 లక్షల కోట్ల రూపాయల విలువ గలిగి వుంది. అంతకంటే రెట్టింపు విలువ గల వ్యసాయ మార్కెట్ ఉత్పత్తుల లావాదేవీల మీద కూడా కార్పోరేట్ వ్యవస్థ కన్ను పడింది. వీటిలోకి కార్పొరేట్ల చొరబాటుకి వీలుగా మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చింది ఇవి పంజాబ్ హరియానా ల రైతాంగ పై అత్యధిక ప్రభావం కలిగించాయి. ఎక్కడైతే మార్కెట్ పంటలు ఉన్నత స్థాయికి చేరతాయో అక్కడ ఇదో తీవ్ర సమస్యగా తలెత్తు తుంది. ఈ కారణంగానే గత రెండు నెలలుగా పంజాబ్ ఒక అగ్నిగుండంగా మారింది.
సెప్టెంబర్ 21 నుంచి పంజాబ్ లో రైల్వే రాకపోకల్ని లక్షలాది రైతాంగం దిగ్బంధనం చేస్తోంది. వారు రాష్ట్ర రవాణా రంగం జోలికి వెళ్ళలేదు. వారి రాజకీయలక్ష్యం ఢిల్లీ ప్రభుత్వం మాత్రమే. అందుకే వారు రైల్వే వ్యవస్థని టార్గెట్ చేస్తున్నారు. నేడు ప్రతిఊరు పోరాటంలో కదిలింది. వారు రిలయన్స్ బహిష్కరణకి కూడా పిలుపు ఇచ్చారు. అది కూడా పెద్ద ప్రభావం కలిగించింది. ఆ బహిష్కరణ ఎంతకాలం కొనసాగుతుందనేది మరో సంగతి. కానీ కార్పొరేట్ వ్యవస్థ కీ, రైతాంగానికీ మధ్య వైరుధ్యం నేడు దేశ రాజకీయ యవనికపై రచ్చకు ఎక్కడం ముఖ్యమైనది.
పంజాబ్ రైతాంగం సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు నెల రోజుల పాటు పాసింజర్ & గూడ్స్ రైళ్లు రెండింటిని నిలిపి వేసింది. తమ రైల్వే దిగ్బంధనం నుండి గూడ్స్ రైళ్లను ఆక్టాబర్ 21 నుండి మినహాయించింది. ప్యాసింజర్ రైళ్ల వరకు తమ దిగ్బంధనం కొనసాగుతుందని ఆరోజు రైతు ఉద్యమ సంస్థల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఆ తర్వాత గూడ్స్ రైళ్లను నడిపించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కానీ ఆ విరమణ జరిగి నెల రోజులు దాటినా పంజాబ్ రాష్ట్రానికి గూడ్స్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం నడిపించడం లేదు. ఇరాక్ మీద అమెరికా ఆహార, ఆయిల్ ఆంక్షలు విధించడం తెలిసిందే. పంజాబ్ మరో దేశం కాదు. పైగా సరిహద్దు రాష్ట్రం. సున్నితమైన ప్రాంతం. పంజాబ్ రైతాంగం పై మోడీ ప్రభుత్వం కక్ష కట్టి “మీరు ప్యాసింజర్ రైళ్లను దిగ్బంధనం నుండి విరమిస్తేనే మేము మీ పంజాబ్ కు సరుకుల రైళ్ళను నడిపిస్తాం” అని అప్రకటిత షరతు విధించింది. ఇప్పుడు గోధుమ రెండో పంట సీజన్ ప్రారంభం అవుతోంది. పంజాబ్ రైతాంగానికి నేడు ఎరువులు క్రిమిసంహారక మందులు కావాలి. సరుకుల రైళ్ల రవాణా కేంద్రం నిలిపివేయడంతో వాటి కొరత ఏర్పడింది. ఆ రైతాంగం నేడు విల విల లాడుతోంది. అంతేకాకుండా పంజాబ్ కు నేడు నిత్యవసర వస్తువుల రవాణా కూడా ఆగింది. అసలే అధిక ధరలకు తోడు ఇప్పుడు మరింత ధరలు పెరిగాయి. అయినా పంజాబ్ హర్యానా రైతాంగం లొంగుబాటు వైపు ఆలోచించడం లేదు. కేంద్రం చేసే బెదిరింపులకు బెదరడం లేదు. రేపు చలో ఢిల్లీ పిలుపుకి సిద్ధమవుతోంది.
చలో ఢిల్లీ కి రావడానికి రైతాంగానికి కేంద్రం అనుమతి నిరాకరించింది. కానీ మూడు వ్యవసాయ చట్టాల తక్షణ ఉపసంహరణ డిమాండ్ తో రైతాంగం భారీగా కదులుతోంది. రైతులు వారం రోజుల పాటు వంట సామాగ్రితో దొరికిన వాహనాలతో ముఖ్యంగా ట్రాక్టర్లతో బయలుదేరుతున్న వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వారిని ఎక్కడ నిలిపివేస్తే అక్కడే రోడ్డు రోకో చేస్తామని అంటున్నది. ఇక్కడ కూడా కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య వైరుధ్యం తలెత్తింది. అది చలో ఢిల్లీ ప్రదర్శన పై పెద్ద ప్రభావం కలిగించ బోతోంది.
పంజాబ్ రాష్ట్ర సరిహద్దు దాటే వరకు పంజాబ్ ప్రభుత్వం పంజాబ్ రైతాంగ ప్రదర్శనలకు అనుమతి ఇవ్వ బోతుంది. (ఈ అర్ధ రాత్రి కి పంజాబ్ సరిహద్దు దాట బోతోంది) హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై తీవ్ర ఇరకాట స్థితిలో పడింది. (ఈ వ్యాసం రాసే సమయానికి కేంద్రం వత్తిడితో హర్యానా ప్రభుత్వం నిన్న 24వ తేదీ అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకూ 31 మంది నాయకుల్ని అరెస్టు చేసింది, ఈరోజు ఢిల్లీ లో AIKSCC ప్రెస్ మీట్ లో తమ “చలో ఢిల్లీ” కార్యక్రమం ఆగేది లేదని ప్రకటించింది) అందుకే రేపటి చలో ఢిల్లీ పిలుపు ఆషామాషీ కార్యక్రమం కాకపోవచ్చు. ఏం జరుగుతుందో మరో 24 గంటల్లో తేలుతుంది.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతాంగ పోరాటాలు నేడు ఒక కొత్త చర్చను రంగం మీదికి తెస్తోంది. పంజాబ్ రైతాంగ దిగ్బంధనం మధ్య నిలిచిపోయిన రైళ్ళను కేంద్రం ఎందుకు నడిపించ లేక చతికిల పడింది?
ఫాసిస్టు రాజకీయ స్వభావం గల మోడీ షా ప్రభుత్వం ఫాసిస్టు నిర్బంధ కాండతో గత రెండు నెలలుగా పంజాబ్ రైతాంగ ముట్టడి ని ఎందుకు చేదించలేక పోతుంది? రైళ్ళను నడిపించటకు ఎందుకు అది సాహసించడం లేదు? ఒక నెల తర్వాత రైతాంగం స్వయంగా ముట్టడి నుండి గూడ్స్ రైళ్ల కి మినహాయింపు ఇచ్చాక కూడా వాటిని ఎందుకు నడిపించడం లేదు? ఆసక్తికరమైన ప్రశ్నలివి.
ఇది రైతాంగ సమరశీల సమైక్య ప్రతిఘటన ఎదుట కేంద్రం తలవంచే చర్య తప్ప మరొకటి కాదు. నేడు పంజాబ్ రైతాంగ పోరాటం ఉద్యమ సంస్థల కార్యకర్తలతో జరిగేది కాదు. అది ప్రజా పోరాటంగా మారింది. రైలు పట్టాల మీద నుండి జనాన్ని తొలగించుటకు ఎంత మందిని తుపాకులతో కాల్చి చంపాలి? ఇదో ప్రశ్న. ఇది మోడీ షా ప్రభుత్వం ఎదుట ప్రశ్నార్థకం అవుతోంది. అందుకే తూటాలతో రైలు పట్టాల మీద నుండి జనాన్ని తొలగించే దుస్సాహసం చేయలేక చేతులు ఎత్తేసింది. అందుకు బదులు, “మీరు ప్యాసింజర్ రైళ్లు అనుమతిస్తే, మేం గూడ్స్ రైళ్లు నడిపిస్తాం” అని ముడి పెట్టింది. అంటే “మిమ్మల్ని తూటాలతో తొలగించే సామర్ధ్యం మాకు లేదు. మీకు యూరియా నుండి నిత్యావసర సరుకుల వరకు సరపరాల్ని లేకుండా చేసి, మీతోనే రైళ్లు ని నడిపించే ఎత్తుగడలు వేస్తున్నాం” అని చెప్పకనే చెబుతోంది. దీన్ని ఏ విధంగా పరిశీలించినా మనకు అర్ధమయ్యేది ఒకటే. పంజాబ్, హర్యానా రైతాంగ ప్రతిఘటన ఎదుట మోడీ ప్రభుత్వం తల వంచిందని అర్థమవుతుంది.
నేడు మోడీ షా ప్రభుత్వం ఎదురు లేని నిరంకుశ బలశాలి గా పేరొందింది. మినీ హిట్లర్ ప్రభుత్వం గా పేరొందింది. ఐనా ఎందుకు పంజాబ్, హర్యానా రైతాంగ ప్రతిఘటన ఎదుట తల వంచింది? అది ఎదురు లేనిది అవుతుందా? దానికి అడ్డుకట్ట లు లేవా? ఉన్నాయని నేడు పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతాంగ ప్రతిఘటన నిరూపించింది. 28 రాష్ట్రాలలో రెండు రాష్ట్రాల రైతాంగం కన్నెర్ర చేస్తేనే, బేజారెత్తిపోతోంది. మరి దేశ రైతాంగం పోరాట రంగం మీదికి వస్తె మోడీ షా ప్రభుత్వ దుస్తితి ఎలా వుంటుంది? అసలు కోట్లాది కార్మికవర్గం కన్నెర్ర చేస్తే పరిస్తితి ఏమిటి?
ఔను, కార్మికవర్గం కన్నెర్ర చేస్తే, ఫాసిస్టు ప్రభుత్వాలు సైతం దాని దర్మాగ్రహం ఎదుట నిలబడ లేవు. కార్మిక వర్గంలో దాగిన నిద్రాణమైన విస్పోటన శక్తిని రగిల్చి, జ్వలింప జేయడం నేటి చారిత్రిక కర్తవ్యం. కార్మిక వర్గానికి అట్టి చారిత్రిక విప్లవ కర పాత్రని పోషించే మహత్తర శక్తి వుంది. దానికి పదును పెట్టడమే అసలు విషయం.
(పి. ప్రసాద్ (పీపీ)
అధ్యక్షులు; కే. పొలారి
ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర కమిటీ, ఆంధ్ర ప్రదేశ్ భారత కార్మిక సంఘాల సమాఖ్య)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *