ముఖ్యమంత్రి జగన్ కు రాయలసీమ మేధావి విజ్ఞప్తి

రాయలసీమ డిమాండ్ల మీద ప్రముఖ రచయిత, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ పూర్తి పాఠం.
శ్రీయుత గౌరవనీయులైన వై.యస్ జగన్ మోహనరెడ్డి గారికి,
ఆర్యా…నమస్తే…
జి.ఎన్ రావు , బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికల ఆధారంగా ఈ నెల 27 న జరిగే మంత్రివర్గ సమావేశంలో రాజధాని తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకొంటారని తెలుస్తుంది.  ఈనేపథ్యంలో రాయలసీమ ప్రజల ఆకాంక్షల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కింది అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం.
*ఉత్తరాంధ్రలో ప్రధాన సచివాలయం, హైకోర్టు బెంచ్, వేసవికాల అసెంబ్లీ, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉన్నవిధంగానే,
*ఆంధ్రలో ప్రధాన అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, కీలక పాలన కార్యాలయాలు  ఉన్నవిధంగానే,*
*రాయలసీమలోను ప్రధాన హైకోర్టు తోపాటు,… వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, మినీ సెక్రటేరియట్ నెలకొల్పాలి. విశాఖపట్నం, విజయవాడలకు దీటుగా ఒక ముఖ్యపట్టణం రాయలసీమలో అభివృద్ధి అయ్యేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.*
*రెండు వేరు వేరు హైకోర్టు బెంచిలను, వేరు వేరు ట్రిబ్యునల్ లను ఇతర ప్రాంతాలలో నెలకొల్పి కేవలం నాలుగు జిల్లాలకు పరిమితమైన హైకోర్టుతో సీమ ప్రాంతానికి న్యాయం జరగదు. రాజధాని , హైకోర్టు విషయంగా శ్రీ భాగ్ ఒప్పందం స్ఫూర్తి పూర్తిగా సీమకు నెరవేరదు. ఇన్నాళ్ళు నష్టపోయిన సీమకు మరో సారి నష్టం కలగరాదని తెలియచేస్తున్నాం.*
*మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవం కోసం మూడు ప్రాంతాలలో సమాన అభివృద్ధి ప్రాతిపాదికగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. వచ్చే రోజులలో ఆయా ప్రాంతాల అవకాశాలు, సహజవనరులు, సంస్థలు, పారిశ్రామిక కేంద్రాలు, సాగునీటి వసతి తదితర అంశాలలో వికేంద్రీకరణకు అడుగులు వేయాలని కోరుతున్నాం.
(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం, అనంతపురము. ఫోన్: 99639 17187)