బాధ్యతలు చేపట్టాను, ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నా : నిమ్మగడ్డ

 గవర్నర్ నోటిఫికేషన్ మేరకు తాను శుక్రవారమే హైదరాబాద్ లోనే బాధ్యతలు చేపట్టానని  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు.
తాను బాధ్యతలను చేపట్టిన  ఈ విషయాన్ని ఎన్నికల సంఘం కార్యదర్శి వాణి మోహన్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించానని కూడా ఆయన చెప్పారు.
సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, కోర్టుధిక్కారం మలుపు తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా పునర్నియమిస్తూ వైఎస్ ఆర్ సి  ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.  ఈ నియామకం కొనసాగింపు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిని స్పెషల్ లీవ్ పిటిషన్ మీద వచ్చే తీర్పును బట్టి ఉంటుందని చెబుతూ ప్రభుత్వం గత గురువారంనాడు పునర్నియామకం జివొను ఉత్తర్వులిచ్చింది.
దీనితో ఆయన సోమవారం నాడు బాధ్యతలు స్వీకరిస్తారని అనుకున్నారు. అయితే, ఒక వివరణ ఇస్తూ తాను శుక్రవారం నాడే హైదరాబాద్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించానని ప్రకటించారు.
‘రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ద, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది. తమ విధుల నిర్వహణలో ఎస్ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాను.  గతంలో లాగే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను,’ అని పేర్కొన్నారు.