ముషర్రాఫ్ కు మరణ శిక్ష, పాక్ సైన్యానికి కళ్లెమవుతుందా?

దేశ ద్రోహ నేరం కింద ఒక పాకిస్తానీ స్పెషల్ కోర్టు మాజీ మిలిటరీ డిక్టేటర్ జనరల్ పర్వేజ్ ముషర్రాఫ్ కు ఆయన పరోక్షంలో మరణ శిక్ష విధించింది. 2007 నవంబర్ 3న రాజ్యాంగాన్నిరద్దు చేసి ఎమర్జన్సీ విధించినందుకు ఆయన మీద దేశ ద్రోహ (High Treason) నేరం మోపి విచారణ చేశారు. ఆయన 1999 అక్టోబర్ 12న ముషర్రాఫ్ నేతృత్వంలో మిలిటరీ తిరుగుబాటు చేసింది. అపుడే ఆయన మిలిటరీ రూలర్ అయ్యారు. అపుడు అంతా దీనిని సై అన్నారు.
పాకిస్తాన్ రాజ్యాంగంలోని 6వ అధికరణం ప్రకారం కోర్టు ముషర్రాఫ్ కు మరణ శిక్ష విధించింది. అధికరణం ప్రకారం రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఏవిధంగా కూడా చెల్లదు. అది దేశద్రోహం (High Treason) అవుతుంది.దేశద్రోహ శిక్షా చట్టం 1973 ప్రకారం ఈ నేరానికి శిక్ష- మరణ శిక్ష లేదా జీవిత ఖైదు,
ప్రత్యేక కోర్టులో పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేత్ (హెడ్ ), జస్టిస్ నజర్ అక్బర్ (సింధ్ హైకోర్టు), జస్టిస్ షాహిద్ కరీం (లాహోర్ హైకోర్టు) సభ్యలుగా ఉన్నారు. తీర్పు పూర్తి పాఠం రెండురోజుల్లో వెలువడుతుంది.
ముషర్రాఫ్ ఇపుడు దుబాయ్ లో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. గతంలో ఆసుపత్రి నుంచి వీడియో ప్రకటన చేస్తూ దేశద్రోహ నేరం పూర్తిగా నిరాధారమయిందని, తాను దేశం కోసం పోరాడానని,పదేళ్ల పాటు దేశానికి సేవలందించానని పేర్కొన్నారు. ఇపుడు ఆయన నుంచి ఎలాంటి స్పందన ఇంకా రాలేదు.
పాకిస్తాన్ సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక కోర్టు ఈ మరణ శిక్ష విధించింది. అయితే, ఏకాభిప్రాయం తీర్పుకాదు. ముగ్గురిలో ఒకరు వ్యతిరేకించారు. ఇపుడు ముషర్రాఫ్ సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం ప్రతినిధులు ప్రకటించారు. చివర రాజ్యాంగంలోని 45 వ అధికరణం ప్రకారం, దేశాధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టవచ్చు.
అయితే, ఈ తీర్పు అనేక విధాల ప్రత్యేక మయింది.దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. ముషర్రాఫ్ కు మరణశిక్ష విధించడం ఎందుకు ప్రత్యేకమయిందంటే…
1. దేశ చరిత్రలో ఒక మిలిటరీ అధినేత మీద ఇలా దేశ ద్రోహం నేరం మోసి విచారణ చేసి మరణశిక్ష విధించడం ఇదే ప్రథమం.
2. ఇది మైలురాయి అవుతుందని డాన్ ప్రతిక ఇస్లామాబాద్ రెసిడెంట్ ఎడిటర్ పహాద్ హుసేన్ పేర్కొన్నారు. ఎందుకంటే, భవిష్యత్తులో మిలటరీతిరుగుబాట్లు జరగకుండా కోర్టు కొరడచూపించిందని ఆయన పేర్నొన్నారు. ఎందుకంటే, మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకుంటూనే చేసే పని రాజ్యంగాన్ని సస్పెండ్ చేయడం. అందువల్ల మిలిటరీకి ఒక హెచ్చరిక చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఈ తీర్పు బలోపేతం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
2. పాకిస్తాన్ లో న్యాయవ్యవస్థ బలపడుతూ ఉందనేందుకు ఇదొక సూచన
3. సూచన ప్రాయంగానైనా ఇది ప్రజా స్వామ్య ప్రభుత్వానిది పై చేయి చేసింది.
4. ముషర్రాఫ్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. పైనల్ అప్పీల్ విచారణ పూర్తయ్యేదాకా మరణశిక్ష మీద స్టే ఇవ్వవచ్చు.
5.పాకిస్తాన్ లో మిలిటరీదే పైచేయి అనుకుంటున్న సమయంలో ఇలా ఒక మిలిటరీ అధినేతకు రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు మరణ శిక్ష విధించడమంటే చాలా గొప్ప. ఎందుకంటే మూడుదశబ్దాలుగా పాకిస్తాన్ రాజకీయాలలో పెత్తనమంతా మిలిటరీదే.
6. శిక్ష అమలవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పిటిఐ ప్రభుత్వం ఈ కేసు మీద అంత సీరియస్ గా లేదు.
7. మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు దేశమంతా  నీరాజనాలు పడుతున్నారు. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ప్రభుత్వం ఉదాశీనంగా ఉన్నా కోర్టు మరణ శిక్ష విధించడం చాలా సాహసోపేతమయిన నిర్ణయమని చెబుతున్నారు.
8. ఇక ముందు మిలిటరీ తిరుగుబాటు సాహసం చేయదని సీనియర్ జర్నలిస్టు ముబాషిర్ జైదీ అభిప్రాయపడ్డారు.

9. డాన్ మాజీ ఎడిటర్ అబ్బాస్ నజీర్ మరణశిక్షతో విబేధించారు. అయితే, ఈ తీర్పు సూచన ప్రాయంగానైనా రూల్ ఆఫ్ లా (Rule of Law)కి జై కొట్టిందని ట్వీట్టర్ లో వ్యాఖ్యానించారు.

(Feature Photo source Dawn.com)