నో వర్క్ నో పే అంటూన్న నారాయణ, శ్రీ చైతన్య, జీతాల్లేని సిబ్బంది

ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ కు యాజమాన్యాలు జీతాలు చెల్లించాలి
నో వర్క్ నో పే అంటూ సిబ్బందిని వేదిస్తున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ఫీజు కట్టిన విద్యార్థులకు తిరిగి ఇవ్వాలి
ప్రైవేట్ విద్యా సంస్థల్లో బోధన బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కింద నాలుగు వేల కోట్లు విడుదల చేసిన ప్రైవేట్ విద్యా సంస్థల యాజమన్యాలు బోధన బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్, రాయలసీమ యూనైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు.
స్థానిక కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు ఉన్న ఆర్.యు.ఎస్.ఎఫ్ జిల్లా కార్యాలయంలో ఈ మేరకు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలు బోధన బోధనేతర సిబ్బంది వేతనాలు వెంటనే చెల్లించాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
కోవిడ్-19 లాక్ డోన్ సమయంలో వేతనాలు చెల్లించకపోతే సిబ్బంది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని యాజమాన్యాలు వెంటనే చెల్లించాలని లేని పక్షంలో ఆ విద్యా సంస్థల పై సిబ్బందితో కలిసి పోరాటం చేస్తామన్నారు.
ప్రత్యేకించి విద్యార్థుల నుంచి లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ గాయత్రి విద్యా సంస్థల యాజమన్యాలు అధ్యాపకులకు ఏప్రిల్, మే జీతాలు చెల్లించక పోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఏడాది పాటు సిబ్బందితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న యాజమాన్యాలు కష్ట కాలంలో “నో వర్క్ నో పే” అనడం సరైనది కాదన్నారు.
అదే విధంగా ఫీజు కట్టిన ప్రతి విద్యార్థికి తిరిగి డబ్బు వాపస్ ఇవ్వాలని ప్రభుత్వం చెప్పిన కూడా ఇంత వరకు తిరిగి ఇవ్వని కాలేజీ యాజమాన్యాలు పై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకోవాలని కోరారు.
కొన్ని కాలేజీలు వేతనాలు చెల్లించ పోవడమే కాకుండా సిబ్బందిని అర్ధాంతరంగా ఏదో ఒక సాకు చూపి ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని వారి పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు.
ప్రైవేట్ విద్యా సంస్థల్లో బోధన బోధనేతర సిబ్బందికి ఐదు వేలు చొప్పున ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ బి భాస్కర్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రవి తదితరులు పాల్గోన్నారు.