కొరియాకు తరలిపోతున్నస్టైరీన్ గ్యాస్, ప్రజలు ఊళ్లకి రావచ్చు

ఎల్ జి పాలిమర్స్ నుంచి లీకయిన స్టైరీన్ విషవాయువును విశాఖ పట్నం నుంచి నౌకల్లో దక్షిణ కొరియాకు తరలిస్తున్నారు. అదే విధంగా వూర్లను శానిటైజ్ చేసినందున ప్రజలను అనుమతించేందుకు చర్యలు మొదలయ్యాయి.
విషవాయువు ప్రభావంతో  ఖాళీ చేయించిన ఊళ్లలోకి  ప్రజలను ఈ సాయంత్రం 4 గంటల తర్వాత  అనుమతిస్తున్నారు. బాధితులు చాలామంది ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. వాళ్లకుపరిహారం చెల్లిండం, ఇళ్లకు చేర్చడం మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
 కొద్ది సేపటి కిందట ఈ ప్రమాదం పై జరిగిన వీడియో కాన్ఫరెన్స్  సమీక్షలో ముఖ్యమంత్రి  అధికారులతో సహాయక చర్యల గురించి  తెలుసుకున్నారు.
గ్రామాల్లో, ఇళ్లల్లో శానిటేషన్‌ పనులు ప్రారంభమయ్యాయని, సాయంత్రం 4 గంటలకల్లా ఇవి ముగుస్తాయని,అవి పూర్తికాగానే గ్రామస్థులను ఇళ్లలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
ఎల్ జి పాలిమర్స్ నుంచి  స్టైరీన్ ‌ తరలింపు ప్రక్రియ ప్రారంభమయిందని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్  వెల్లడించారు.
స్టైరీన్ లీకేజి  సంభవించిన ట్యాంకులో ప్రస్తుతం 73 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉందని, సురక్షిత స్థాయిలో ఉందని కలెక్టర్ తెలిపారు.   ట్యాంకులోని స్టైరీ న్‌ కూడా దాదాపు 100శాతం పాలిమరైజ్‌ అయ్యిందని వెల్లడించారు. ఇదికాక ఇంకో ఐదు ట్యాంకుల్లో 13వేల టన్నుల స్టైరీన్‌ ఉందని, సీఎం ఆదేశాల ప్రకారం దీన్ని కొరియాకు తరలిస్తున్నామని వెల్లడించారు.
8వేల టన్నులను ఒక ఓడ‌ ద్వారా  తరలిస్తున్నామని,  మరొక వెసల్‌కూడా అందుబాటులోఉందని దీనిద్వారా మిగిలిన 5 వేలటన్నులను తిరిగి కొరియాకు పంపిస్తున్నామని  కలెక్టర్‌ వివరించారు. రానున్న 4–5 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని,  అత్యున్నత స్థాయి బృందం కంపెనీలో నిశిత పరిశీలన చేసిందని  కలెక్టర్‌ తెలిపారు.
 గ్యాస్‌ లీక్‌ ఘటన అనంతరం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రికి  మంత్రులు, అధికారులు  వివరాలు అందించారు.  గ్యాస్ ప్రభావం వల్ల  మరణించిన వారి కుటుంబాల్లో వారసులకు ఖరారయిన 8 మందిలో 5 గురికి పరిహారం ఇచ్చామని  మిగిలిన వారు నగరానికి దూరంగా ఉన్నందున అందించలేకపోయామని,  వారికి కూడా అందిస్తామన్న మంత్రులు చెప్పారు.
మూడురోజుల్లో మిగతావారికీ ఆర్థిక సహాయం సీఎం ఆదేశాలు:
– మంత్రులంతా ఆ 5 గ్రామాల్లో ఈ రాత్రికి బసచేయాలి.
– శానిటేషన్‌ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఈ రాత్రికి ఊళ్లోకి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలి.
– గ్యాస్‌లీక్‌ ప్రభావిత గ్రామాల్లో ప్రతి మనిషికీ రూ.10వేలు ఇవ్వాలి.
–పిల్లలైనా, పెద్దలైనా అందరికీ పదివేల చొప్పున ఇవ్వాలి. అందర్నీ లెక్కలోకి తీసుకోవాలి.
– రేపు ఉదయం బాధితులకు వాలంటీర్లతో బ్యాంకు ఖాతాలు సేకరించాలి
– అన్‌ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో డబ్బు వేసేలా బ్యాంకర్లతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలి.
– పారదర్శకంగా, ఫిర్యాదులు లేకుండా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలు కొనసాగాలి.
– ఆర్థిక సహాయం పొందేవారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని, ఎవరిపేరైనా కనిపించకపోతే వారు ఎలా పేరు నమోదుచేసుకోవాలో వారి వివరాలను అందులో ఉంచాలి.
– గ్యాస్‌లీక్‌ ప్రభావిత గ్రామాల ప్రజలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం మూడు రోజుల్లో పూర్తికావాలన్న సీఎం
– డబ్బు ఖాతాల్లో జమచేసిన తర్వాత వాలంటీర్ల ద్వారా వారికి స్లిప్‌ అందించి వారినుంచి రశీదు తీసుకోవాలి.
– అలాగే ఆస్పత్రిపాలైన వారికీ కూడా వీలైనంత ఆర్థిక సహాయం అందించాలి.
– గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల ప్రజలకు వైద్యపరమైన సేవలకోసం క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేయాలి
రాష్ట్రమంతటా తనిఖీలు : సీఎం ఆదేశం
 ఒక్క విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోని మిగతా పరిశ్రమల్లో కూడా తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించేలా చేయాలని, ప్రమాదకర పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలించే అంశంపైన కూడా ఆలోచనలు చేయాలని ఆయన సూచనలిచ్చారు. విశాఖపట్నం గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల అభిప్రాయాలనుకూడా పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు.
ముఖ్యమంత్రి సమీక్షలో  అమరావతి నుంచి  డిప్యూటీసీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ విశాఖపట్నం మంత్రులు కన్నబాబు, బొత్స సత్యన్నారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ దాస్, కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా తదితరులు పాల్గొన్నారు.