టార్గెట్ బిజెపి: ఇది అహ్మదాబాద్ కాదు, హైదరాబాద్ : కెటిఆర్ హెచ్చరిక

కెటిఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం: హైలైట్స్
 * కుత్భుల్లాపూర్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో రోడ్ షోలు  
* నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి 
* హైదరాబాద్ నగరంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి 
* బీజేపీ నాయకులు ఏం చెప్పినా వినడానికి ఇది అమాయకాపు అహ్మదాబాద్ కాదు, హుషార్ హైదరాబాద్  
* ఆరేళ్లల్లో అన్ని రంగాల్లో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది 
* ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో విద్వేషాలు సృష్టించే కుట్రలు  
* హైదరాబాద్ నగరానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ సవాల్ 
హైదరాబాద్ నగరం టీఆర్ఎస్ పాలనలో ముందెన్నడూ లేని విధంగా అభివృద్ధిలో దూసుకువెళ్తోందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కూకట్ పల్లి నుండి జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేటీఆర్ కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్ లలో నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ ఆరేళ్లలో హైదరాబాద్ నగరం ఎంతో ప్రశాంతతో ఉందని, ఈ ప్రశాంతతను కాపాడుకోవాల్సిన భాద్యత మన అందరిమీద ఉందన్నారు. కులం, మతం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా నగర ప్రజలందరం కలిసి మెలిసి ఉంటున్నామన్నారు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మొన్న కరోనా వచ్చినా, నిన్న వరదలు వచ్చినా ప్రజల వెంట ఉన్నది టీఆర్ఎస్ పార్టీ అన్న విషయం ప్రజలకు తెలుసన్నారు. వరద బాధితులను ఆదుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.
వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న వరదసాయాన్ని ఆపింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఎన్నికల్లో గెలిస్తే 25 వేల రూపాయలు ఇస్తామని కొంతమంది ప్రజల్ని మభ్య పెడుతున్నారని,  అంతేకాదు చలాన్లు కడతాం, అదిస్తాం, ఇదిస్తాం అంటూ తలా తోక లేకుండా మాట్లాడుతున్నారన్నారు.  మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వరద సాయం 10 వేల రూపాయలను ఆపినోళ్లు ఇయ్యాల 25 వేల రూపాయలు ఇస్తామనడం అమ్మకు అన్నం పెట్టనోళ్లు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాం అన్నట్టుగా ఉందన్నారు. మీరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మడానికి ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు, హుషారు హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఈసారి జీచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు .   హైదరాబాద్ నగరం అభివృద్ధిలో మరింత ముందుకు పోవాలంటే ప్రజలందరూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మద్దతు తెలపాలన్నారు.  హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *