Home Breaking కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏదీ? : కేంద్రం మీద కత్తి దూసిన కెటిఆర్

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏదీ? : కేంద్రం మీద కత్తి దూసిన కెటిఆర్

161
0

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని రైల్వే శాఖ అనడం మీద కెటిఆర్ అభ్యంతరం

* సమాచార హక్కు చట్టం  కింద సమాధానం ఇచ్చిన రైల్వే శాఖ

తాజాగా ఒక సమాచార హక్కుకింది వేసిన  పిటీషన్‌కు సమాధానం ఇస్తూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఇచ్చిన సమాధానంపై మంత్రి కే. తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయిన్ మొదలైనప్పటినుంచి కెటిఆర్ కేంద్రం మీద తీవ్రంగా దాడి చేస్తున్నారు. ఇపుడు దీనికి ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తోడయింది.

’కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. పలుమార్లు లేఖలు రాశారు. మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని ప్రయత్నాలనుచేస్తూనే ఉంది.  ఇందులో భాగంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అవసరమైన స్థల సేకరణ కూడా పూర్తయింది.  రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అత్యంత విలువైన 150 ఎకరాల భూమిని ప్రత్యేక శ్రద్ధతో మరో ప్రభుత్వ శాఖ నుంచి సేకరించి కేంద్ర రైల్వే శాఖకు అప్పగించింది.  ఇపుడు కోచ్ ఫ్యాక్టరీ అసవరమే లేదంటారా?,’ అని కేటిఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్న 8 రైల్వే లైన్లు, సర్వే దశలో ఉన్న 3 లైన్ లు, 4 నూతన రైల్వే లైన్ల ప్రతిపాదనలు, రైల్వే ఖాజీపేట వ్యోగన్ ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్వే డివిజన్ , రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు వంటి డిమాండ్లకు సైతం కేంద్రం నుండి కనీస స్పందన లేదని ఆయన అన్నారు.

ప్రతిసారి బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నానే దిక్కవుతోందని మంత్రి విమర్శించారు.

‘తాజాగా ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో  తెలంగాణ రాష్ట్రంలోని రైల్వేలైన్ లకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ వివక్ష . కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న బుల్లెట్ ట్రైన్,  హై స్పీడ్ రైల్వేలైన్ కేటాయింపులో కూడా  తెలంగాణకి బిజెపి తీవ్ర అన్యాయం చేసింది., హైదరాబాద్ వంటి మహానగరానికి కూడా ఈ బుల్లెట్/స్పీడ్ ట్రైన్లు కేటాయించకపోవడం ఈ వివక్షకు తార్కాణం,’  అని  కేటీఆర్ అన్నారు.

ఖాజీపేట రైల్వే ప్రాజెక్టు అవసరం లేదని స్పష్టం చేయడం వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినట్టయిందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకుని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా విస్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రైల్వేల ప్రవేటీకరణ భావితరాలకు ద్రోహం

తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తూ భవిష్యత్ తరాలకు బిజెపి ద్రోహం చేస్తోందని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. భారతదేశ రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి రైల్వే వ్యవస్థను సంపూర్ణంగా ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం కుటిల యత్నాలు చేస్తుందన్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యంత రద్దీ కలిగిన 12 క్లస్టర్ లను గుర్తించి 109 ప్రధాన రైలు మార్గాలను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, ఈ ప్రైవేటీకరణ నిర్ణయం ద్వారా రైల్వేలకు సుమారు 63 వేల కోట్ల రూపాయల వార్షిక ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు.

లాభాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కంపెనీలను చవకగా అమ్మేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాల్లో రైల్వేను కూడా భాగం చేయడం అత్యంత బాధాకరమని కేటీఆర్ అన్నారు.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న ఏడు రైల్వే ప్రొడక్షన్ యూనిట్లను అత్యంత చవకగా ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైల్వే లైన్ లతో పాటు రైల్వే స్టేషన్ లను సైతం ప్రైవేట్ పరం చేస్తూ.. సాధారణ ప్రజలకి రైల్వేస్టేషన్ లోకి ప్రవేశం లేకుండా రైల్వే స్టేషన్ల పైన ఆధారపడిన లక్షలాది మంది ఉద్యోగుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుంది.

రైల్వేలనుప్రైవేట్ పరం చేసేందుకు అత్యంత ఉత్సాహంతో ముందుకు పోతున్న కేంద్ర ప్రభుత్వం స్థానికంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ళు మరియు రోడ్డు విస్తరణ వంటి కార్యకలాపాలకు కావాల్సిన స్థలాన్ని అడిగితే మాత్రం ఎనలేని తాత్సారం చేస్తోంది, కానీ ఇదే భూములను ప్రైవేటుపరం చేసేందుకు మాత్రం అత్యంత ఉత్సాహం చూపుతుందన్నారు.

రైల్వేల ప్రైవేటీకరణ చేయడంతో దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వరంగ సంస్థ అయిన రైల్వే నుంచి నూతన ఉద్యోగ నోటిఫికేషన్ రాకుండా దేశంలోని లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉందని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం గగ్గోలు పెడుతున్న బిజెపి నాయకులు ఈ విషయంలో సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపైన కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడటం కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఏలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here