మొత్తానికి, కెటిఆర్ లేఖతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజక్టుకు ప్రాణం

తెలంగాణాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (ITIR) ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు కేంద్రానికి లేఖ రాసి  సంచలనం సృష్టించారు. ఎందుకంటే,ఐటిఐఆర్ అనేది పూర్తిగా చివరి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కోసం అందునా హైదరాబాద్ కోసం ప్రతిపాదించిన భారీ  ప్రాజక్టు. తెలంగాణ ఉద్యమం సాగుతున్నరోజులలో  పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేయాలనే  లక్ష్యంతో ఈ ప్రాజక్టు ను ప్రతిపాదించారు. 2008 నాటి ప్రాజక్టు అయినా,దీనికి సంబంధించిన డిపిఆర్ అప్ డేట్ చేసింది  2012లో.  అపుడు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఐటి మినిష్టర్ పొన్నాల లక్ష్మయ్య.  హైదరాబాద్ ఐటిఐఆర్ ప్రాజక్టుకు ఆమోదం పొందాకా నాటి ప్రభుత్వం తిరుపతి, విశాఖ పట్టణాలకు కూడా ఇలాంటి ప్రాజక్టులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసింది. వీటికి సంబంధించి కూడా  కేంద్రం తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు.  2014లో యుపిఎ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ  ప్రాజక్టులు కార్యరూపం దాల్చేవే. యుపిఏ ప్రాజక్టులు కావడంతో మోదీ ప్రభుత్వం వీటిని పక్కన పడేసింది. ఆంధ్రప్రభుత్వం కోరుతున్న విశాఖపట్నం ఐటిఐఆర్ ను కూడా కేంద్రం  మంజూరు చేయలేదు.

నాటి ప్రణాళిక ప్రకారం హైదరాబాద్ ఐటి ఐఆర్ ని రెండు దశలలో  25 సంవత్సరాల కాలంలో అమలు చేస్తారు. దీనికి అవసరమయిన భూమి 50వేల ఎకరాలు.  15లక్షల ఉద్యోగ కల్పన ప్రాజక్టు లక్ష్యం. అపుడు అంచనా వేసిన ప్రాజక్టు వ్యయం. రు. 2300 కోట్లు.

ఇపుడు కిరణ్ కుమార్ రెడ్డి ని అంతా మర్చిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాల్లోనే లేకుండా కనుమరుగయ్యారు. ఎక్కడున్నారో తెలియదు. టిడిపిలోకి వస్తారని,బిజెపి లోకి వస్తారని ఆ మధ్య వినిపించింది, రెండూ జరగలేదు. ఏదో పుస్తకం రాస్తున్నారని కూడా చెప్పారు. అదీ జరగలేదు. హైదరాబాద్ లో ఉండటం లేదు, బెంగుళూరు లో ఉంటున్నారని అన్నారు.  అయితే, ఇంతగా కనుమరుగవుతారని ఎవరూ వూహించలేదు. అయితే, ఇపుడు తెలంగాణ ప్రభుత్వం ఐటిఐఆర్  ప్రాజక్టు దుమ్ము దులపడంతో ఆయనపేరు మళ్లీ ఒక వార్తల కెక్కింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా నాటి కాంగ్రెస్ పథకాలేవీ కనిపించేకుండా చేసేందుకు పేర్లు మార్చడమో లేదా వాటిని రద్దుచేయడమో చేసింది.ప్రాణిహిత-చెేవెళ్ల ప్రాజక్టు దీనికి ఉదాహరణ. అలాంటిది ఇపుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో  కేంద్రం మంజూరు చేసిన ఐటిఐఆర్ ను ఏర్పాటుచేయాలని కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు కెటిఆర్ లేఖ రాశారు.

“The Project such as ITIR provide a huge boost PM Narendra Modi’s initiatives such as Make in India. The youth of Telangana will benefit immensely from the employment opportunities that will be created due to ITIR,అని కెటిఆర్ లేఖ లోరాశారు.

అంతేకాదు,  గత ఆరేళ్లలో తాను, ముఖ్యమంత్రి కెసిఆర్ ఐటిఐఆర్ గురించి కేంద్రానికి చాలా లేఖలు రాశామని,కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు.

2008లో ఈ ప్రాజక్టు ను నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించి మొదటి విడత హైదరాబాద్ , బెంగుళూరులను ఎంపికచేసింది. తర్వాత మరిన్ని నగరాలను జోడించింది. ఈ విషయాలను గుర్తు చేస్తూ ఈ ప్రాజక్టుకు అవసరమయిన 49,000 ఎకరాల భూమిని హైదరాబాద్ లో  మూడు చోట్ల గుర్తించడం జరిగిందని కూడా కెటిఆర్ లేఖలోరాశారు.

ఇప్పుడైనా గుర్తొచ్చింది, సంతోషం: మాజీ ఎమ్మెల్యే సంతోష్ కుమార్


ఐ.టి.ఐ.ఆర్  ప్రాజక్టు  ఆలస్యానికి బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్షమే కారణం మని సంపత్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్యెల్యే వ్యాఖ్యానించారు. ఈ మేరకు  ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

2008 లోనే కాంగ్రెస్ ప్రతిపాదించి అన్ని సాంకేతిక పనులు పూర్తి చేసి మంజూరు చేయించింది.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్య ఐ.టి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ లో ఐ టి పరిశ్రమలను అన్ని ఒకవైపు కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది.

అంతే కాకుండా తెలంగాణ విభజన చట్టంలో ఐటీఐఆర్ ను వెంటనే ఏర్పాటు చేయాలనే నిబంధన కూడా ఉంది. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు లేఖల పేరుతో కాలయాపన చేయడం ఏమిటి..మొన్న కేసీఆర్ డిల్లీకి వెళ్ళినపుడు ఈ అంశాల గురించి ఎందుకు మోడీ, అమిత్ షా లతో మాట్లాడలేదు.

2014 నుంచి దాదాపు ఏడేళ్లు ఎందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఐటీఐఆర్ విషయంలో నిర్లక్ష్యం చేసింది.. రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు, 50 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే ఒక అద్భుతమైన పథకాన్ని ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదు.

ఈ విషయంలో తాను ఎమ్యెల్యే గా ఉన్న సమయంలో సమగ్ర సమాచారంతో 4 సార్లు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది.

2014 లోనే ఐటీఐఆర్ పథకం వచ్చి ఉంటే నేడు తెలంగాణ లో నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. తెలంగాణలో ప్రధానమైన నిరుద్యోగం సమస్య పరిష్కారం దొరికేది. తెలంగాణ పెద్దఎత్తున అభివృద్ధి సాదించేది..

హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు వచ్చి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించేది. కానీ బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఇంతకాలం చేసిన నిర్లక్ష్యం వల్ల తెలంగాణ నష్టపోయింది. ఇప్పటికైనా కేటీఆర్ చిత్తశుద్ధి తో పనిచేసి కేంద్రంపైన నిజమైన పోరాటం చేసి ఐటీఐఆర్ ను సాధించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *