తాను తెచ్చిన తెలంగాణలో ఇంత ధిక్కారాన్ని కెసిఆర్ వూహించలేదా?

ప్రగతి భవన్ లో గంభీర క్షణాలు…
ప్రగతి భవన్… శత్రు దుర్భేద్యమైన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రానికి పరిపాలనా కేంద్రం. సచివాలయం కేంద్రంగా సాగాల్సిన పాలన ప్రగతి భవన్ కు మారిపోయింది. మరోవైపు సచివాలయం అడ్రస్ గల్లంతయింది.
ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చినవేళ ప్రగతి భవన్ లో నవంబర్ 2వ తేదీన కీలక మంత్రివర్గ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఈ మంత్రివర్గ భేటీలో సుమారు 50 అంశాలు చర్చకు వొచ్చాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కేబినెట్ మీటింగ్ వివరాలను కేసీఆరే స్వయంగా మీడియాకు వివరించారు.
ప్రగతి భవన్ నిర్మించిన తర్వాత అనేక మీడియా సమావేశాలు అక్కడ జరిగాయి. కానీ అన్నింటికి భిన్నంగా 2వ తేది ప్రెస్ మీట్ సాగింది. ప్రగతి భవన్ మీడియా సమావేశ మందిరంలో గంభీర వాతావరణం నెలకొంది. గతంలో ప్రెస్ మీట్లలో మాదిరిగా జోయల్ గా లేదు. సీఎం కేసీఆర్ సహా వేదిక మీద కుసున్న మంత్రుల మోహల్లో నెత్తురు చుక్క లేదు. మీడియా రిపోర్టర్ల సరదా సంభాషణలు లేవు. ప్రెస్ మీట్ మొత్తం సీరియస్ గా సాగింది. గతంలో మాదిరిగా కేసీఆర్ జోకులు లేవు… రిపోర్టర్ల ఇక ఇకలు పకపకలు లేవు. ఎందుకు ఇలా జరిగింది.
ఎందుకంటే నిజాం కాలంలో రూపుదిద్దుకున్న ఆర్టీసీ పీక పిసికే నిర్ణయం అప్పుడే కాబినెట్ భేటీలో తీసుకోవడం జరిగింది. ఆర్టీసీ కి మరణ శాసనం లిఖించిన సందర్భం కాబట్టి. దశాబ్దాల కాలంగా కోట్లాది మందికి సేవలందించిన ఆర్టీసీని కొందరు పెద్ద మనుషులకు కట్టబెట్టే వ్యవహారం అక్కడే, అప్పుడే జరిగిపోయింది కాబట్టి.
ప్రజల సేవలో ఇంతకాలం తరించిన ఆర్టీసీ సగం గొంతు పిసికేసిన నిర్ణయం జరిగిన వేళా కలకళడాల్సిన ప్రగతి భవన్ గంభీరంగా మారిపోయింది. ప్రెస్ మీట్ కు వొచిన జర్నలిస్టుల్లో కూడా నిశబ్దం ఆవహించింది. సమాజగతిని మార్చే ఎన్నో నిర్ణయాలకు మీడియా జర్నలిస్టులు ప్రత్యక్ష సాక్ష్యులుగా ఉంటారు. కానీ తెలంగాణ ఆర్టీసీ కి మరణశాసనం రాసిన ఘటనలో ప్రత్యక్ష సాక్షులుగా అయ్యామన్న అపరాధ భావం ప్రెస్ మీట్ కు వెళ్లిన జర్నలిస్టుల్లో నెలకొంది. అనేక సంచలన నిర్ణయాలు జరిగిన సమయాల్లో జర్నలిస్టులు హుషారుగా స్పందించేవారు. కానీ ఈ మంత్రివర్గ, మీడియా సమావేశం తర్వాత మాత్రం మునుపటి వాతావరణం మాత్రం కనిపించలేదు.
ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారు అని గతంలో ప్రకటించిన సీఎం ఒక మెట్టు దిగి 5వ తేదీ అర్ధరాత్రిలోగా విధుల్లో చేరితే ఉద్యోగం ఉంటుందని ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. 51 రూట్లను ప్రయివేట్ కు ఇస్తున్నట్లు చెప్పారు. 5వ తేదీలోగా చేరకపోతే మొత్తానికి మొత్తం ప్రవేట్ పరం చేస్తామని హూంకరించారు. కానీ కార్మికులు కేసీఆర్ బెదిరింపులను పెద్దగా లెక్క చేయలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇక గతంలో మాదిరిగానే కొందరు జర్నలిస్టుల మీద కేసీఆర్ కోపాన్ని, అసహనాన్ని మళ్ళీ ప్రదర్శించారు.
ఏది ఏమైనా తెలంగాణ పాలనా కేంద్రం ప్రగతి భవన్లో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో…