హైకోర్టు తీర్పు ఎపిలో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోసింది : పవన్ కల్యాణ్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఆర్గినెన్స్ కోట్టివేయడాన్ని జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఉపిరిపోసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదే పవన్ కల్యాణ్ ప్రకటన: 
“ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోసింది.
Nimmagadda Rameshkumar
ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసాన్ని ఇనుమడింపచేసింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థలను ప్రభుత్వాలు తమకు నచ్చిన విధంగా మార్చుకోవాలని చూస్తే న్యాయ విభాగాలు రక్షిస్తాయి అనే విషయాన్ని రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా మరోమారు అవగతమైంది.
రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా శ్రీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి కొనసాగించాలనే తీర్పును తక్షణమే అంగీకరించి- రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభీష్టానికి భిన్నంగా వెళ్లారనే కారణంతోనే శ్రీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ రోజు ఆయన ఎన్నికల కమిషనర్ హోదాలో కరోనా విపత్తు ఎంత ప్రమాదకరమైనదో గ్రహించి ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి స్పందించిన తీరుని ప్రజాస్వామ్యవాదులెవరూ హర్షించలేదు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికారిపై ముఖ్యమంత్రితోపాటు, అధికార పక్షంవాళ్లు చేసిన వ్యాఖ్యలు వారి ధోరణిని వెల్లడించాయి. కరోనాతో అందరూ ఆందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం ఎన్నికల కమిషనర్ ను తప్పించే ప్రక్రియపై దృష్టిపెట్టి రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్స్ ను కూడా పరిగణనలోకి తీసుకోలేదు.
రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేయడం, నిర్ణయాలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం ఈ తీర్పు ద్వారా తెలుసుకోవాలి. ఏకస్వామ్య ప్రభుత్వంగానో, నియంతృత్వ ధోరణితోనో పాలన సాగిస్తే న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యానికి రక్షణ లభిస్తుందని గ్రహించాలి. అధికార యంత్రాంగం కూడా పాలకులకు రాజ్యాంగం గురించీ, చట్టం గురించీ అవగాహన కల్పించాలి. లేదంటే న్యాయ స్థానాల ముందు జవాబు చెప్పుకోవాల్సింది అధికార యంత్రాంగమే.
ఇట్లు
పవన్ కళ్యాణ్
అధ్యక్షులు, జనసేన పార్టీ