గవర్నర్ తో ముగిసిన భేటీ: జగన్ బహిరంగ హెచ్చరిక ఇదే

హైద్రాబాదులో గవర్నర్ నరసింహన్ తో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ అధికార పార్టీ, ప్రభుత్వ అధికారులపై ఆయన నిప్పులు చెరిగారు. ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.

గవర్నర్ గారిని కలిసి నిన్న అత్యంత దారుణంగా వైయస్ వివేకానంద రెడ్డి గారి హత్యపైన తెలియజేశాం. ఈ ఘటనలో సీబీఐ దర్యాప్తు ద్వారా న్యాయం జరుగుతుందని గవర్నర్ గారికి చెప్పటం జరిగింది. ఎస్పీతో మాట్లాడుతున్నప్పుడు పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. నేను అక్కడ ఉన్నప్పుడే ఏడీజీ నుంచి ఫోన్స్ వచ్చాయి. ఈ విషయంలో ఏడీజీ ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు లోతుగా దిగి మానిటర్ చేస్తున్నారనటానికి నిదర్శనం.

ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ను టీడీపీకి వాచ్ మెన్ డిపార్ట్మెంట్ గా ఏబీ వెంకటేశ్వరరావు మార్చేశారు. గ్రామాల్లో వైయస్సార్ సీపీ నాయకులు ఎవరెవరు ఉన్నారు. వారిని ఏ విధంగా ప్రలోభపెట్టాలో చంద్రబాబుకు రిపోర్ట్ ఇస్తున్నాడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చూడాల్సిన డిపార్ట్ మెంట్ ను తన వాచ్ మెన్ కన్నా దారుణంగా వాడుకుంటున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు 23 మంది ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడిన తర్వాత చంద్రబాబు కొనుగోలు చేశారు. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా మాట్లాడిన తర్వాత చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు టీడీపీ కండువాలు వేశారు.

నిన్న ఎస్పీతో నేను మాట్లాడుతుంటే వీళ్లు ఎంతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి సామాన్య వ్యక్తా? 4సార్లు ఎంపీగా చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు చనిపోయారు. ఇలాంటి వ్యక్తి చనిపోతే లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఉందా? జమ్మలమడుగు నియోజకవర్గానికి ఆయన ఇంఛార్జిగా వ్యవహరించటం తప్పా? అంతకుముందు మా పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అమ్ముడుపోవటం, చంద్రబాబు ప్రలోభాలు ఇచ్చి తీసుకోవటం, మంత్రి పదవులు ఇచ్చి పెట్టుకున్నారు.

వీరిని ఢీకొనటానికి కొత్త అభ్యర్థి సుధీర్ రెడ్డిని బలపర్చటానికి చిన్నాన్న వివేకానంద రెడ్డి బాధ్యత తీసుకున్నారు. వారు చేసిన పనల్లా… జమ్మలమడుగులో అత్యధికంగా తిరగటం. దీంతో, మనిషిని లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ధర్మమేనా? నిజంగా న్యాయం ఉంటే… ఎందుకు సీబీఐ ఎంక్వైరీ ఇవ్వటానికి చంద్రబాబు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎన్నికల బాధ్యతల నుంచి డీజీపీ, ఏడీజీపీలను తప్పించాలి. అప్పుడే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయి.

ఇవాళ మా చిన్నాన్నకు జరిగింది రేపు ఎంత మందికైనా జరగొచ్చని గవర్నర్ గారికి ఫిర్యాదు చేశాను. రెండు, మూడు రోజుల్లో ఈ కేసు విషయమై కోర్టుకు పోయి సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తాము. ఇంత పెద్ద వ్యక్తి చనిపోతే… ఇలానా వ్యవహరించేది? ఇక్కడ పోలీసులు చంద్రబాబుకు రిపోర్ట్ చేయని వ్యవస్థతో రిపోర్ట్ చేయమని కోరుతున్నాను. వివేకానంద రెడ్డి గారికి సెక్యూరిటీ లేదు. ఆయన చాలా సౌమ్యుడు. ఎవ్వరితోనూ గొడవలు లేవు. ఏ కలెక్టర్ ఆఫీసు, ఎమ్మార్వో ఆఫీసుకు అయినా వెళ్తారు. అంత మంచి వ్యక్తికి ఇలాంటి సంఘటన జరగటం చాలా బాధాకరం.

దొంగే దొంగతనం చేసి దొంగ…దొంగ అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి ఉంది. టీడీపీ వాళ్లే హత్య చేసి వేరేవాళ్లపై బురదచల్లుతున్నారు. గతంలో మా తాతను వైయస్ రాజారెడ్డిని చంపారు. నాన్నను కట్టడి చేసేందుకు రిటైర్డ్ అయిపోయి ఉన్న ముసలాయనను చంపారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ప్రతిపక్ష నేత తండ్రిని చంపారు. ముఖ్మమంత్రి ఎవరు? చంద్రబాబు. తర్వాత మా నాన్నను. అసెంబ్లీలో నాన్న చనిపోక ముందు రెండు రోజుల ముందు చంద్రబాబు నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు థ్రెట్ చేశారు. తర్వాత రెండు రోజులకే హెలికాప్టర్ క్రాష్. ఈ రోజుకీ మాకు అనుమానాలు ఉన్నాయ్. ఆరోపణలు ఉన్న వ్యక్తి చంద్రబాబు.

నామీద కూడా హత్యాయత్నం జరిగింది. మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ ఎయిర్ పోర్టు. అక్కడకు కత్తి రాగలిగింది. టీడీపీ నేతల రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తి కత్తి తీసుకొని నా మీదకు రాగలిగాడు. కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇంతగా దిగజారారు. ప్రతి వేలు చంద్రబాబు వైపు చూపిస్తుంటే ఎంక్వైరీ తనే చేస్తానని చంద్రబాబు చెప్పటం ఏంటి? అలాంటప్పుడు న్యాయం జరుగుతుందా? చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్.

సహజంగా చిన్నాన్న లాంటి లీడర్లకు సెక్యూరిటీ ఇవ్వాలి. అయితే ఎందుకు ఇవ్వలేదు. సహజంగా ఎస్పీలు నియమించాక రెండు ఏళ్లు ఉంచాలి. 40 రోజుల క్రితం ఉన్న ఎస్పీని బదలాయించి ఈ ఎస్పీని తెచ్చారు. ఎస్పీ నిన్న ఓ లేఖ చూపించారు. అందులో చిన్నాన్న తన డ్రైవర్ చంపారని ఫ్యాబ్రికేటెడ్ లేఖ సృష్టించారు. ఆయన గుండెపోటు వచ్చి కమోడ్ కు తగిలి చనిపోయినట్లు ఆయన బాడీని పెట్టారు. ఇంట్లో ఎవ్వరూలేరు. ఆయన ఒక్కరే ఉన్నారు. వీరు చంపుతా ఉన్నా.. చిన్నాన్న లేఖ రాస్తారా? డీఐజీ, ఎస్పీ ఓ లేఖ చూపిస్తున్నారు.

వాస్తవాలు కప్పిపుచ్చేందుకు సినిమా కథలు చెబుతున్నారు. చనిపోయింది ఎవరు? చనిపోయింది మా చిన్నాన్న. ఎలా చనిపోయారు? దీంట్లో చంద్రబాబు ప్రమేయం లేకపోతే సీబీఐకి ఎందుకు ఇవ్వటం లేదు. సిబిఐ విచారణకు ఆదేశించకపోతే హై కోర్టును ఆశ్రయిస్తామంటూ హెచ్చరించారు వైఎస్ జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *