రాయలసీమ ‘ప్రాంతీయ’ వాదులకు జగన్ టోపీ…

కృష్ణా నది యాజమాన్య బోర్డు (Krishna River Managemeng Board) కార్యాయలాన్ని కర్నూలు పెట్టడం కుదరదని ముఖ్యమంత్రి  పబ్లిక్ వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యాలయాన్ని విశాఖ పట్టణంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు  బోర్డును కోరారు. ఈ ఏర్పాటు ఖాయమయింది. రాాజధాని విశాఖకు తరలించే విషయంలో జరుగుతున్న జాప్యం వల్ల ఈ కార్యాలయం ఏర్పాటుకూడా జాప్యం అవుతున్నది.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయలసీమ నేతలు చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఒక అఖిల పక్ష రౌండ్ టేబుల్ కూడా ఏర్పాటు చేశారు.  రాయలసీమ నేతలను, వారి ఆందోళనను  రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఖాతరుచేయడం లేదని అనిపిస్తుంది. అసలు వారిని పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదని ఈరోజు సజ్జల రామకృష్ణా రెడ్డి చెేసిన వ్యాఖ్యల వల్ల  అర్థమవుతుంది. ప్రాంతాల పరంగా కాకుండా కులాల వారీగా, మతాల వారీగా అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేషన్లు, పదవులు, నగదు బదిలీ పథకాలు అమలుచేసి ప్రజలనుమచ్చిక చేసుకోవడం జగన్ ధోరణిలా ఉంది. అందుకే  ప్రాంతాల పేరు అంటే రాయలసీమ,ఉత్తరాంధ్ర వంటి మాటలు ప్రస్తావించడం చాలా అరుదు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలుగుదేశం అధినేత  చంద్రబాబు ధోరణి కూడా ఇదే. ఆయన కూడా తెలంగాణ అనే మాట ఉచ్ఛరించే వాడే కాదు.

సజ్జల రామకృష్ణారెడ్డి

కృష్ణానది కర్నూలు దగ్గిర పారుతుంటే విశాఖలో కెఆర్ ఎంబి కార్యాలయం ఏర్పాటుచేస్తారా అన్నది రాయలసీమ వారి ప్రశ్న.

అయితే,  దీనితో సజ్జల ఏకీభవించలేదు.

“అడ్మినిస్ట్రేటివ్ రాజధాని  ఎక్కడ ఉంటుందో ముఖ్యమయిన కార్యాలయాలు అన్నీ అక్కడకు వస్తాయి. ఏ నది దగ్గర ఉంటే అక్కడ దాని కార్యాలయాలు ఉండవు.  ప్రభుత్వం అంతా విశాఖలో ఉంటుంది కాబట్టి కృష్ణానది యాజమాన్య బోర్డు (KRMB)ని  అక్కడకు తరలించమని కోరటం జరిగింది,” అని ఈ రోజు అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ సజ్జల తెలిపారు

మూడు రాజధానుల విషయం ఉగాది నాటికి అయిపోతుందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ…

“అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. కోర్టుల్లో కేసుల వల్ల రాజధాని తరలింపు ఆలస్యం అవుతోంది. ఒక నెలా, అటో ఇటో విశాఖ తరలి వెళ్లటం ఖాయం. వచ్చే మూడు సంవత్సరాల్లో వికేంద్రీకరణ ఫలాలు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం చూపించాలి. ఆమేరకు కోర్టులో ఆర్గ్యుమెంట్ నిలబడేలా చూస్తాం. వచ్చే నాలుగైదు నెలల్లో వెళదామని అనుకుంటున్నాము,” అని సజ్జల తెలిపారు.

రాయలసీమ నేతల ఏ డిమాండ్ ను జగన్ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. ఇలాంటిదే నంద్యాలలో ఏర్పాటుచేయాలనుకుంటున్న మెడికల్ కాలేజీ భూముల వ్యవహారం కూడా. ఈ మెడికల్  కాలేజీ ఏర్పాటుకు అక్కడి ప్రాంతీయ వ్యవసాయపరిశోధనా కేంద్రానికి చెందిన పచ్చని పొలాలను తీసుకుంటున్నారు. నగరం చుట్టూ ప్రభుత్వ భుూములున్నా,  వందేళ్లుగా వ్యవసాయ పరిశోధనలకు ఉపయోగపడుతున్న భూములను తీసుకోవడం సబబు కాదని ప్రాంతీయనాయకులు చేస్తున్న నిరసను ప్రభుత్వం లెక్కలోకి తీసుకురావడం లేదు.

ఇలాంటిదే కెఆర్ ఎంబి కార్యాలయం ఏర్పాటు కూడా.

తమాషా ఏమంటే, రాయలసీమలో ఏ డిమాండ్ నాలుగు జిల్లాల  నాయకులు కలసి గొంతెత్తున్నట్లు కనిపించదు.ఏ జిల్లా వాళ్ల డిమాండ్ వాళ్లది అన్నట్లు వ్యవహారముంటుంది. రాయలసీమ వాదులొకవైపు ఉంటే, ప్రజాప్రతినిధులు మరొక వైపు ఉన్నారు. అందుకే రాయలసీమలో  ఐక్యగానం వినిపించదు. దానికితోడు జగన్ ప్రభుత్వాన్నిపూర్తిగా సమర్థించలేరు, వ్యతిరేకించలేరు. ఈ సందిగ్ధం రాయలసీమ నేతల వాదనల్ల కనిపిస్తుంది. విమర్శించలేరు, ప్రశంపించలేరు. రాయలసీమ నేతల బలహీనత చంద్రబాబులాగానే జగన్ కీ బాగా తెలుసు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *