Home Breaking హైదరాబాద్ చుట్టూర రీజినల్ రింగ్ రోడ్డు ఎవరి కోరిక? ఎవరి కల?

హైదరాబాద్ చుట్టూర రీజినల్ రింగ్ రోడ్డు ఎవరి కోరిక? ఎవరి కల?

272
0
N Venugopal (fb timeline picture)

(ఎన్ వేణుగోపాల్ )

హైదరాబాద్‌ నగరం చుట్టూ మరో మహా కొండచిలువ చుట్టుకోనున్నదని, అది తెలంగాణ జనాభాలో నలభై శాతాన్ని తన పడగనీడలో పెట్టుకోనున్నదని ప్రమాదకర వార్తలు వెలువడుతున్నాయి. ఈ మహా కొండచిలువ పేరు రీజినల్‌ రింగ్‌ రోడ్‌ – ఆర్‌ఆర్‌ఆర్‌. ఇది అసలు అవసరమేనా అన్న ప్రశ్నే రాకుండా, దానితో ఎంత అభివృద్ధి జరగనున్నదో అంకెల గారడీ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. అన్ని ప్రభుత్వ పథకాలలాగే ఈ ప్రగల్భాలన్నీ నీటి మూటలుగా, పేక మేడలుగా తేలిపోయి చివరికి తెలంగాణ ప్రజా జీవనానికీ, ఆర్థిక వ్యవస్థకూ, ప్రధానంగా వ్యవసాయానికీ, తద్వారా ఆహారభద్రతకూ ప్రమాదం ఏర్పడుతుంది. లక్షలాది ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా, రియల్‌ ఎస్టేట్‌గా మారి లక్షలాది మంది వ్యవసాయదారులు, వ్యవసాయం మీద ఆధారపడినవారు నిరాశ్రితులు కావలసివస్తుంది. ఈ మహాపథకానికి కేంద్ర ప్రభుత్వ సూత్రప్రాయ అనుమతి లభించిందని బీజేపీ నాయకులు సోమవారం నాడు ఢిల్లీలో ప్రకటించారు. అయితే ఈ పథకాన్ని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వమే గనుక ఈ దుర్మార్గంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భాగం ఉంది.

మహాఘనత వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తెలంగాణ అభివృద్ధి ఎలా సాగుతున్నదంటే గతంలో చేసిన విమర్శలే మళ్లీ మళ్లీ పునరుక్తం చేయకతప్పడం లేదు. మూడు సంవత్సరాల వెనుక ఇదే శీర్షికలో ‘ఎవరికోసమీ మహా మహమ్మారి రహదారి?’ అని 2018 జనవరి 1న రాసిన వ్యాసం ఇవాళ్టికీ, కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించిందనే ప్రకటన వెలువడినతర్వాత, అక్షరాలా ప్రాసంగికంగా కనబడుతున్నది.

అంతేకాదు, ఆ పాత విమర్శలకు అదనంగా కొత్త విమర్శలు చేర్చవలసిన అవసరం కలుగుతున్నది.హైదరాబాద్‌ చుట్టూ ఒక రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కింద ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలను అంగీకరిస్తూ, దానికి అవసరమైన భూసేకరణకు అనుమతిస్తూ కేంద్రప్రభుత్వ రహదారుల మంత్రిత్వశాఖ 2017 చివరిలో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత వెనుకడుగు వేసింది.

ముఖ్యంగా 2019 ఎన్నికల్లో తిరిగి ఎన్నికైన తర్వాత గత పథకాలను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం ఇంత భారీవ్యయంతో నిర్మించే రహదారి వల్ల తగినంత ఆదాయం వచ్చే అవకాశం లేదని తేల్చింది. టోల్‌ వసూలు చేసినప్పటికీ ఆ ఆదాయం పెట్టుబడి వ్యయం మీద వడ్డీకి కూడా సరిపోదని అభిప్రాయ పడింది. ఇప్పుడు మళ్లీ ఏ రాజకీయ, ఆర్థిక సమీకరణాలు అనుకూలించాయోగాని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపాదించిన ఈ పథకాన్ని బీజేపీ సమర్థించడం ప్రారంభించింది. రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వాలూ పోటాపోటీగా చేసిన పైరవీలతో కేంద్ర ప్రభుత్వం భూసేకరణ వ్యయంలో సగాన్ని రాష్ట్రప్రభుత్వం భరించాలనే షరతుతో సూత్రప్రాయ అనుమతిని ఇచ్చింది.

అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్లు, విమానాశ్రయాలు వంటి ఆడంబరాలనే తప్పుడు నిర్వచనం ఇచ్చుకునే అమాయకులకు, రోడ్ల కంట్రాక్టర్లకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు, భవననిర్మాణ కంపెనీలకు, రాజకీయ నాయకులకు ఈ వార్తలు సంతోషాన్ని కలిగించి ఉండవచ్చుగాని వాస్తవంగా ఈ ప్రతిపాదనలు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థమీద భూకంపం లాంటి ప్రమాద హెచ్చరికలు.


ఈ మహా మహమ్మారి రోడ్డు రాజకీయ నాయకులకు, రోడ్డు నిర్మాణ సంస్థలకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలకు నిస్సందేహంగా ప్రయోజనకరమైనదే.


కానీ అదే స్థాయిలో, బహుశా అంతకన్న ఎక్కువ స్థాయిలో తెలంగాణ వ్యవసాయాన్ని దెబ్బ తీస్తుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా, రియల్‌ ఎస్టేట్‌గా మారుస్తుంది. వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు ఎంతో కొంత తాత్కాలిక తాయిలం చేతిలో పెట్టి శాశ్వత వనరును పోగొడుతుంది. వ్యవసాయం మీద ఆధారపడిన లక్షలాది ప్రజానీకపు ఉపాధి పోగొట్టి బిచ్చగాళ్లుగా, వలస కార్మికులుగా మారుస్తుంది.

హైదరాబాద్‌కు యాభై, అరవై కిలోమీటర్ల దూరంలో సర్పంలా చుట్టుకునే ఈ తారు కొండచిలువ పొడవు 338 కిలోమీటర్లు. మూడు సంవత్సరాల కింద ప్రతిపాదించినప్పుడు ప్రాథమిక వ్యయ అంచనా పదకొండు వేల కోట్ల రూపాయలు కాగా, అది ఇప్పుడు పదిహేడు వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. నిజానికి దేశంలో ద్రవ్యోల్బణాన్ని ఎంత ఎక్కువగా లెక్కగట్టినా ఈ అంచనా వ్యయం మూడు సంవత్సరాలలో పదిహేను వందల కోట్ల రూపాయల కన్న ఎక్కువ పెరగడానికి వీలులేదు. కాని ఆరు వేల కోట్ల రూపాయలు పెరిగిందంటే, అది మధ్యవర్తులలో ఎవరెవరి జేబుల్లోకి ఎంత పోనున్నదో ఊహించవచ్చు. ఇప్పుడు చెపుతున్న వ్యయ అంచనా కూడ ఈ రహదారి నిర్మాణం ముగిసేసరికి మరెంత పెరుగుతుందో, ఎంత ప్రజాధనాన్ని మింగేస్తుందో చెప్పలేం.

అలా నిర్మాణమవుతున్న ఈ కొండచిలువ చివరికి ఏ ప్రయోజనాలు నెరవేరుస్తుందో చెప్పలేం గాని, ఇప్పటికిప్పుడు మాత్రం 4,922 హెక్టార్ల (12,163 ఎకరాల) భూమిని ఆ భూమి యజమానుల నుంచి లాగేసి, మింగేస్తుంది. అలా పన్నెండు వేల ఎకరాలు రహదారి నిర్మాణానికే అవసరం కాగా, ఈ రహదారి దాదాపుగా తెలంగాణ మొత్తాన్నీ చక్రబంధంలో చుట్టివేస్తుంది గనుక తెలంగాణలో అత్యధిక భాగం, కొన్ని లక్షల ఎకరాల విస్తీర్ణం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అక్రమ క్రీడాస్థలిగా మారిపోతుంది.

సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌ పూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌, ఆమన్‌ గల్‌, యాచారం, కందుకూరు, షాద్‌నగర్‌, చేవెళ్ల, కంది పట్టణాల మీదుగా పరచుకునే ఈ కొండచిలువతో 24మండలాలు ప్రభావితమవుతాయి. ఈ రహదారికి ఆనుకుని ఉండే గ్రామాలు, పట్టణాలు మాత్రమే కాక రహదారి నుంచి అటూ ఇటూ రెండు మూడు కిలోమీటర్ల మేరనో, ఇంకా ఎక్కువగానో ఈ కొండచిలువ నీడలోకి వస్తాయి. ఇక అక్కడి వ్యవసాయ భూములు వ్యవసాయానికి మిగలవు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అక్కడ గద్దల లాగ వాలి, ఆ గ్రామాల్లో ఎకరమో రెండెకరాలో ఉన్న రైతులను నయానో భయానో, కోట్లు వస్తాయనే ఆశచూపో, చుట్టూ ఉన్నవారు అమ్మేశారని బెదిరించో ఆక్రమించి ఆ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ జండాలు ఎగరేస్తారు. ఆ భూముల్లో వెంచర్లు ప్రారంభించి, రాతి కణీలు పాతి, ”రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు ఒక కిమీ దూరంలో, రెండు కిమీ దూరంలో” అని ఆకర్షణీయమైన బ్రోచర్లు తయారు చేస్తారు.అంటే ఇది కొన్ని వందల గ్రామాల రైతులకు, వ్యవసాయాధారిత జనాభాకు ప్రమాదకరం. ఆ మేరకు వ్యవసాయం, ముఖ్యంగా నగరానికి సమీప గ్రామలైనందువల్ల సాగిస్తున్న కూరగాయల వ్యవసాయం నష్టపోయి, ఆహారభద్రత మీద తీవ్రమైన దుష్ప్రభావానికి దారితీస్తుంది.

ఇప్పటికే ఆహారభద్రతలో ప్రమాదకర స్థితిలో ఉన్న రాష్ట్రం మరింత దిగజారే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం వ్యవసాయం అంతగా గిట్టుబాటు కాని స్థితి ఉంది గనుక చిన్న, సన్నకారు రైతులు రియల్‌ ఎస్టేట్‌ ఒత్తిడికి లొంగిపోయి తమ భూములు వదులుకోవచ్చు. వారిలో కొందరికి ఊహించినదాని కన్న ఎక్కువ ప్రతిఫలమే దక్కవచ్చు. కాని ప్రస్తుతం ఉన్న వినియోగదారీ వాతావరణంలో అత్యధికులకు ఆ నడమంతరపు సిరి త్వరలోనే పప్పు పుట్నాలు అయిపోయే అవకాశమే ఉంది. తరతరాలుగా ఆదుకున్న శాశ్వత జీవనోపాధి వనరుగా, గ్రామంలో గౌరవ హేతువుగా ఉండిన భూమి మాత్రం శాశ్వతంగా చేజారిపోతుంది. అలా ఈ రహదారి కొండచిలువ తెలంగాణ సమాజంలో గణనీయమైన భాగాన్ని ఆస్తికీ, ఉపాధికీ, ఆత్మగౌరవానికీ దూరం చేస్తుంది. వారికిక పొట్ట చేత పట్టుకుని ఆ రింగ్‌ రోడ్డు పట్టుకుని దేశదేశాలు వలస వెళ్లడమే మిగులుతుంది.

భూఆస్తి ఉన్నవారి స్థితి అది కాగా, వ్యవసాయం మీద ఆధారపడిన, భూమిలేని కూలీలు, వృత్తి పనివారు ఈ గ్రామాల్లో వ్యవసాయం విధ్వంసం కావడంతో నిర్వాసితులైపోతారు. రోడ్డు నిర్మాణ పనిలో ఉన్న ఊళ్లోనే కొన్నాళ్లు కూలి పని దొరకవచ్చు గాని, రోడ్డు పని అయిపోయాక అది కూడ కరవై వారు పట్నాల్లో కూలీ అడ్డాల్లో పడిగాపులు పడవలసి వస్తుంది. రహదారి కొండచిలువ తమ గ్రామాల్లో ఉన్నవారిని మింగి పట్నపు బిచ్చగాళ్లుగా, పనికోసం వెతుకులాడే కూలీలుగా జారవిడుస్తుంది.
ఇది ఒక రహదారి సమస్యో, ఒక ప్రభుత్వ పథకం సమస్యో, కొన్ని గ్రామాల సమస్యో, కొందరు మనుషుల సమస్యో కాదు. ఇది ఒక అభివృద్ధి నమూనా సమస్య,ఇది ఒక దృక్పథం సమస్య. మనిషే ప్రమాణంగా, మనిషి మనుగడకు ఆధారాలుగా ఉండేవే ప్రమాణంగా ఉండవలసిన చోట ఆ ప్రమాణాలు మారుతున్నాయి. భావజాలం, ప్రచారసాధనాలు, మార్కెట్‌ మప్పుతున్న ఇతరేతర అంశాలే మన ప్రమాణాలను నిర్ణయిస్తున్నాయి.

మనిషి అభివృద్ధి ప్రధానంగా ఉండవలసిన చోట సరుకుల అభివృద్ధి, సరుకుల రవాణా అభివృద్ధి, సరుకుల వినియోగంలో అభివృద్ధి ప్రధానమైపోతున్నాయి. రోడ్లు, భవనాలు, వంతెనలు, విమానాశ్రయాలు అభివృద్ధికి చిహ్నాలు అవుతున్నాయి. రోడ్ల అభివృద్ధినే మనుషుల అభివృద్ధిగా కుదించిన నిర్వచనం చలామణీ అవుతున్నది. మనుషులకు ఆహారభద్రత, ఆశ్రయం, ఉపాధి అవకాశాలు, ఆత్మగౌరవం లేకపోయినా సరే, రోడ్లు ఉంటే చాలు అని పాలకులు కొత్త అభివృద్ధి పాఠాలు చెపుతున్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో బలమైన వ్యతిరేకతను ఎదుర్కొన్న ఈ అభివృద్ధి భావజాలం తెలంగాణ పాలనలోనూ యథాతథంగా అమలులోకి వచ్చింది. ఈ భావజాలం ప్రకారం, అవసరం ఉన్నా లేకపోయినా, అవసరాన్ని పెద్దది చేసి చూపి, అదే అవసరం అని ప్రజల్లో భ్రమలు కల్పించి కొన్ని పనులు చేస్తున్నారు. అందులో రోడ్ల నిర్మాణం ఒకటి.
రోడ్లే అభివృద్ధి అనే మంత్ర జపంతో అమాయకులను మోసం చేసి, తమకు నిత్యజీవితావసరాలుఅందకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, ఆత్మగౌరవం లేకపోయినా రోడ్డును చూసి మురిసిపోయే ఒక అమాయక సమూహాన్ని తయారు చేయవచ్చు. ఆ అమాయకత్వాన్ని వోట్లుగా మార్చుకోవచ్చు. అంటే రోడ్ల నిర్మాణం వల్ల తయారయ్యేది రోడ్లు కాదు, నాయకుల ఎదుగుదలకు ఉపయోగపడే సోపానాలు.

రోడ్ల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆశ్రితులైన కాంట్రాక్టర్లకు అప్పనంగా ధారపోయవచ్చు. అందులోంచి గణనీయమైన భాగాన్ని ప్రతిఫలంగా పొందవచ్చు. అంటే రోడ్ల నిర్మాణం వల్ల రూపొందేది రోడ్లు కాదు, కాంట్రాక్టర్ల, రాజకీయ నాయకుల బొక్కసాలు.

రోడ్డు పడిన చోటల్లా రోడ్డుకు అటూ ఇటూ మాత్రమే కాదు, అటూ ఇటూ ఆమడ దూరం వ్యవసాయ భూమి రియల్‌ ఎస్టేట్‌ గా మారిపోయి, పంట పొలాల స్థానంలో సరిహద్దు రాళ్లూ రియల్‌ ఎస్టేట్‌ జెండాలూ లేచి నిలుస్తాయి. అంటే రోడ్ల నిర్మాణ పథకం వల్ల వచ్చేది రోడ్లు కాదు, పాలకుల ఆశ్రితులూ బంధువులూ అయిన రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, కాంట్రాక్టర్లు, బ్రోకర్లతో కూడిన ఒక మాఫియా రాజ్యం.

ఈ కొండ చిలువను మన ఇంట్లోకి ఎవరు పిలుస్తున్నారు? ఎందుకు పిలుస్తున్నారు? మనం ఎందుకు రానిస్తున్నాం?

(సోషల్ మీడియాలో వైరలవుతున్న పోస్టు)

 

(ఎన్‌. వేణుగోపాల్‌, రాజకీయార్థిక విశ్లేషకుడు, హైదరాబాద్ సెల్‌: 9848577028)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here