తెలంగాణలో జనతా కర్ఫ్యూ 24 గంటలు : ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపు

కరోనాను జయిద్దాం.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్ధం సాగిద్దాం

కరోనాను జయించడం లో ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దాం
రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎళ్లుండి ఆరింటి వరకు ఇంటిలోనే గడుపుదాం
రేపు ఇంటిలో ఉండమే….సమాజానికి మనం చేసే సేవ
విదేశాల నుంచి వచ్చే వారి సమాచారం ప్రభుత్వానికి అందించండి
రేపటి జనతా కర్ఫ్యూను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిచ్చిన రీతిలో 24 గంటలు పాటించి విజయవంతం చేద్దామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమం లో ఎలా పాల్గొన్నామో అదే స్ఫూర్తితో కరోనాను ఎదుర్కొందామన్నారు. కరోనా పై ఈ యుద్దంలో విజయం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చని చెప్పారు.
రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎళ్లుండి ఆరు గంటల వరకు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. ఈ 24 గంటలకు అవసరమైన ఆహార పదర్ధాలు, మందులు, ఇతర అత్యవసర వస్తువులు ముందే సమకూర్చుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను రోడ్డు మీదకు రాకుండా ఈ ఇరవై నాలుగంటలు ఉండి మరో మారు ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలన్నారు.  సరైన స్వీయ నియంత్రణ లేకపోడం వల్లే కొన్ని దేశాల్లో కరోనా వైరస్ విజృభించి ప్రజల ప్రాణాలను కబళిస్తోందన్నారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ నిరంతరం కరోనా పరిస్థితులను సమీక్షిస్తూ అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యంతోనే ఈ వైరస్ ను అరికట్టగలమన్నారు. స్వీయ నియంత్రణతో పాటు సబ్బుతోను, శానిటైజర్స్ తో చేతులు శుభ్రపర్చుకోవాలని సూచించారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనబడితే అలక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్నారు. సమాజ సేవ అందరి బాధ్యత , రేపు ఇంటిలో ఉండటమే మనం సమాజానికి చేసే సేవ అని హరీశ్ రావు చెప్పారు.
విదేశాల నుంచి వచ్చే వారి సమాచారం అందివ్వండి

కరోనా వైరస్ విదేశాల నుంచి వచ్చే వారి నుంచే వస్తోందని…. ఇలా విదేశాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు చేసి కరోనా బాధితులను గుర్తించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. విదేశాల నుంచి ఎవరు వచ్చినా… వారు స్వచ్ఛంధంగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు, సర్పంచ్ లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు సైతం తమ పరిధిలో విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి ప్రభుత్వానికి సమాచారం అందించాలని సూచించారు.