హిందూపూర్ టీడీపీ ఎంపీ టికెట్ ఈయనకిస్తే, మాధవ్ పరిస్థితి ఏంటి?

అనంతపురం కదిరి మాజీ సిఐ గోరంట్ల మాధవ్ పొలిటికల్ ఎంట్రీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అనంతపురంలో దశాబ్దాలుగా తమ హవా కొనసాగిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి వంటి రాజకీయ నేతకి మీసం మెలేసి వార్నింగ్ ఇవ్వడంతో సినిమాలో చూపించినట్టు మాధవ్ యువతలో హీరో అయిపోయారు. ఆయన ఇప్పటివరకు పని చేసిన ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

అటువంటి పోలీసు అధికారి వైసీపీ లో చేరి హిందూపూర్ పార్లమెంటు సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టడంతో అనంతపురం వైసీపీలో మరింత జోష్ పెరిగింది. అనంతపురంకి బీసీల జిల్లాగా పేరుంది. గోరంట్ల మాధవ్ బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో… ఇటు బీసీల ఓట్లు, యూత్ లో ఫాలోయింగ్ ఉంది కాబట్టి యువత ఓటింగ్, ఇక డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి హిందూపూర్ ఎంపీగా ఆయన తప్పక గెలుస్తారని వైసీపీ బలంగా నమ్ముతోంది.

మాధవ్ కు చెక్ పెట్టేందుకు స్థానిక టీడీపీ నేతలు, అధిష్టానం కూడా గట్టిగ కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు హిందూపూర్ టీడీపీ నేతలు రాష్ట్ర వాల్మీకి సేవాదళ్ అధ్యక్షుడు అంబికా లక్ష్మీనారాయణకు హిందూపూర్ పార్లమెంటు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానానికి సూచిస్తున్నారు. టీడీపీ బలోపేతం కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారని, అంబికా ఫౌండేషన్ ద్వారా వివిధ సేవ కార్యక్రమాలతో టీడీపీకి ప్రజాదరణ వచ్చేలా చేశారని చెబుతున్నారు. అందుకే అంబికాకు హిందూపూర్ పార్లమెంటు టికెట్ లేదా ఎమ్మెల్సీ ఇవ్వాలని స్థానిక టీడీపీ నేతలు, కౌన్సిలర్లు అధిష్టానాన్ని కోరుతున్నారు.

హిందూపూర్ ఎంపీ టికెట్ అంబికా లక్ష్మి నారాయణకు కేటాయిస్తే టీడీపీకి, వైసీపీకి మధ్య పోరు ఎలా ఉండనుంది?

గోరంట్ల మాధవ్ హిందూపూర్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే గెలుపు ఖాయం అని తమ బలాన్ని అంచనా వేసుకుని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అనంతపూర్ లో బీసీ బోయ సామాజికవర్గం కూడా అధికం. జిల్లాలో గెలుపోటములు ప్రభావం చేసే సామాజికవర్గాల్లో బోయ సామాజిక వర్గం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలో రాయదుర్గం నుండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన కాల్వ శ్రీనివాసులు బోయ సామాజిక వర్గానికి చెందిన నేత.

శ్రీనివాసులు గెలుపులో ప్రధాన పాత్ర బోయ కమ్యూనిటీదే. తమ సామాజిక వర్గానికి చెందిన నేతకి మంత్రి పదవి కూడా దక్కడంతో అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా బోయ కమ్యూనిటీలో టీడీపీకి ఆదరణ పెరిగింది. ఈ ప్రభావం హిందూపూర్ పార్లమెంటులో సెగ్మెంట్ లో కూడా బలంగా ఉండొచ్చు.

అంతేకాకుండా బీసీలు అందరూ వైసీపీకి ఓట్లు వేస్తారు అనుకోవడం పొరబాటే. పైగా అంబికా లక్ష్మి నారాయణ అంబికా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, శుద్ధజల ప్లాంట్లు ఏర్పాటు చేయటం, ఉద్యోగ మేళాలు నిర్వహిస్తే ప్రజల్లో తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

సో అంబికా రంగంలోకి దిగితే గోరంట్ల మాధవ్ ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పలేము. ఇద్దరికీ మధ్య టఫ్ ఫైట్ జరగొచ్చు. పైగా మాధవ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది కూడా ఈమధ్యనే. ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది ఎన్నికల గడువు. ఇంత తక్కువ కాలంలో ఆయన తన సామర్ధ్యాన్ని నిరూపించుకొని నెగ్గాలంటే చాలా స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *