నాలుగు మేటి పత్రికలను మూసేసిన ఈనాడు గ్రూప్… ఇక ‘విపుల’ ’చతుర’ రావు

‘ఈనాడు’ రామోజీరావు  నాయకత్వంలోని రామోజీ ఫౌండేషన్  నాలుగు పత్రికలను మూసేయాలని  నిర్ణయించింది. ఏప్రిల్ నెల నుంచి విపుల,చతుర, బాలభారతం, తెలుగు వెలుగు పత్రికల ప్రచురణ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

మంచి పత్రికలు లేని కొరతని ఇంతకాలం ఈ పత్రికలు తీరుస్తూ వచ్చాయి.  నిజానికి చాలా మంది కథల, నవలల అభిమానులు విపుల, చతుర పత్రికలకు అలవాటుపడ్డారు. మంచి కథలకు నవలకు ‘విపుల’ ’చతుర’ చిరునామా అయ్యాయి. ఇవి మూతబడటం కథాభిమానులకు దుర్వార్తే.

వీటి నిర్వహణ భారం పెరిగిపోవడంతో అనివార్యంగా వీటి ప్రచురణ నిలిపివేస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ స్వయంగా ప్రకటించారు.

తెలుగేతర భాషలలోని  జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ కథలను తెలుగులోకి  అనువదిస్తూ విపుల అందిస్తూ వచ్చింది.  అలాగే చతుర  ప్రతి నెలా ఒక నవలను అతి తక్కువ ధరకు అందించింది. ఈ  పత్రికలు 1978  ఫిబ్రవరి నుంచి విడుదలవుతూ వచ్చాయి.

‘ఈ నలభై మూడేళ్లలో విపులలో 8000 వేలవరకూ కథలు ప్రచురితం అయ్యాయి. ఇప్పటి వరకూ 518కి పైగా నవలలను అందించింది చతుర. వీటిలో కొన్ని సినిమాలుగానూ వచ్చి భేష్‌ అనిపించుకున్నాయి. ఈ పత్రికల మీద పరిశోధనలు చేసి ఎం.ఫిల్, పి.హెచ్‌.డి. పట్టాలందుకున్న వారూ ఉన్నారు,’ అని  ఈ పత్రికల మూసివేస్తూ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

మిగతా వాటికి  సంబంధించి  2012 సెప్టెంబరులో తెలుగువెలుగు పత్రిక ప్రారంభమైతే 2013 జూన్‌లో  బాలభారతం మొదలైంది.

“ఈ నాలుగు పత్రికలూ అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నష్టాలను ఖాతరు చేయకుండా నామమాత్రపు ధరకే అందిస్తూ వచ్చాము. అంతర్జాల విస్తృతితో పాఠకుల అభిరుచులు ఊహించనంత వేగంగా మారిపోతున్నాయి. దానికి తోడు కరోనా సృష్టించిన కల్లోలం అన్ని రంగాలతోపాటు పత్రికా రంగాన్నీ తీవ్రంగా దెబ్బతీసింది. 2020 జూన్‌ నుంచి చతుర, విపులలను, ఆగస్టు నుంచి తెలుగువెలుగు, బాలభారతంలను ఈ-మ్యాగజైన్స్‌ రూపంలో ఈనాడు.నెట్‌లో అందుబాటులో ఉంచాము. ఇన్నాళ్లుగా సేవాదృక్పథంతో సాగిస్తూ వచ్చిన ఈ నాలుగు పత్రికల నిర్వహణ కష్టతరంగా మారినందువల్ల వచ్చే నెల (ఏప్రిల్‌) నుంచి నిలిపివేస్తున్నాము,”అని ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *