లాక్ డౌన్ వల్ల పేదల ఉపాధి పొకుండా చూడండి, ఇలా : జగన్ కు డాక్టర్ ఇఎఎస్ శర్మ లేఖ

(Dr EAS Sarma)
ప్రభుత్వం అమలుచేస్తున్న గృహనిర్బంధన ప్రస్తుత పరిస్థితులలో మంచి నిర్ణయమే, కాని అందువలన పేదలకు అపారమైన నష్టం కలిగింది. రోజు కూలీలు, చిల్లర వ్యాపారులు, ఆటో డ్రైవర్లు వారి వారి ఉపాధులను కోల్పోయారు. వారికి ప్రభుత్వం రేషన్లు, మరియు నగదు సహాయం చేసినా, వారి ఉపాధులు దెబ్బతిన్నాయి. వారి జీవితాల గురించి ప్రభుత్వం ఆలోచించ వలసి ఉంది. 
మీ ప్రభుత్వం ఆక్వా ఫార్మింగ్ చేస్తున్న పెద్ద రైతుల కార్యకలాపాలకు, ఆక్వా పరిశ్రమను నడుపుతున్న ధనికుల వ్యాపారాలకు, గృహ నిర్బంధం నేపథ్యంలో నష్టం కలుగకుండా ఉండడానికి కొన్ని నిర్ణయాలను గత రెండుమూడు రోజులుగా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అటువంటప్పుడు, అదే పరిస్థితులలో ఉపాధులను కోల్పోతున్న రోజు కూలీల, చిల్లర వ్యాపారుల, ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి కూడా,  అటువంటి నిర్ణయాలను తీసుకోవాలని అనుకుంటున్నాను.
నా ఉద్దేశంలో, ఆక్వా ఫార్మింగ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా, వ్యవసాయ యోగ్యమైన భూములు కాలుష్యానికి గురిఅవుతున్నాయి. అందువలన, రాష్ట్ర ఆహార భద్రతకు నష్టం కలుగుతున్నది. అటువంటి కార్యక్రమాలను, పరిశ్రమలను ప్రోత్సహించడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు మంచిది కాదు. అందుకు బదులుగా, ప్రభుత్వం సాంప్రదాయక వ్యవసాయదారులకు సహాయం చేయడం మంచిది. వారుకూడా ప్రస్తుత పరిస్థితులలో నష్టపడ్డారు.
గృహ నిర్బంధన కారణంగా నష్టపడ్డ చిన్నకారు వ్యాపారులను కరోనా నియంత్రణ కార్యక్రమంలో భాగస్వాములు గా చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు,  ప్రతి నగరంలో వందలాది ఆటోరిక్షా డ్రైవర్లు పనిలేక పస్తు ఉంటున్నారు. కరోనా వ్యాధి గురించి ప్రజలలో అవగాహన తెచ్చే ప్రభుత్వ కార్యక్రమాలలో ఆటో డ్రైవర్లు పాల్గొనగలరు. అందువలన వారికి ఎంతోకొంత ఆదాయం వస్తుంది. అలాగే వీధి వ్యాపారులు ప్రజలకు సరుకులను అందించే కార్యక్రమంలో సహాయపడగలరు. అందువలన వారికి ఉపాధి పోకుండా ఉంటుంది. తలుచుకుంటే ప్రభుత్వం ఎన్నోవిధాలుగా  అటువంటి ప్రజానీకానికి ప్రస్తుత పరిస్థితులలో పని, ఉపాధులను కలిగించగలరు.
ఈ సలహాను మీ ప్రభుత్వం త్వరగా పరిశీలించి తగిన పథకాలను అమలుచేస్తారని ఆశిస్తున్నాను.
(ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్ ఇఎఎస్ శర్మ రాసిన లేఖ)