‘విశాఖ ఉక్కు’ని కారు చౌకగ్గా అమ్మేసే ప్రమాదం: EAS శర్మ హెచ్చరిక

విశాఖ ఉక్కు కర్మాగారం అతితక్కువ ధరకు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యానికి వెళ్లే అవకాశం కనిపిస్తున్నదని హెచ్చరిక చేస్తూ  విశ్రాంత ఐఎఎస్ అధికారి, కేంద్ర  ప్రభుత్వం మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ
కేంద్రం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడాన్ని రాష్ట్రప్రభుత్వం వ్యతిరేకించాలని విశాఖ నగర ప్రజలు చేసిన విజ్ఞప్తి మీద మీరు అనుకూలంగా స్పందించి, ప్రధాన మంత్రిగారికి విపులమైన లేఖ రాయడాన్ని విశాఖ ప్రజలు  హర్షిస్తున్నారు. ఈ విషయం మీద కొంతమంది ప్రముఖులు కూడా ప్రధాన మంత్రిగారికి  రాసిన లేఖను జతపరుస్తున్నాను.
 మీ పార్టీ పార్లమెంట్ మెంబర్ శ్రీ విజయ్ సాయి రెడ్డిగారి ప్రశ్నకు 10-2-2021 న కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రిగారు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు సమాధానం ఇస్తూ, విశాఖ ఉక్కు కర్మాగారం గురించి చెప్పిన మాట: దక్షిణ కొరియా కంపెనీ పాస్కో , ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వానికి ఉన్న 100% షేర్లలో, 50% కావాలని కోరడం, ఆవిషయంలో కేంద్రప్రభుత్వం ఎటువంటి వ్యతిరేకత తెలియపరచక పోవడం. అంటే విశాఖ ఉక్కు కర్మాగారంలో పాస్కోకు 50% ప్రభుత్వ  షేర్లను బదలాయించడానికి, కేంద్రం సానుకూలతతో ఉందన్నమాట.
ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర మంత్రిబృదం ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వానికి ఉన్న 100% షేర్లను ప్రైవేట్ కంపెనీలకు బదలాయిస్తామని నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అంటే ఈ కర్మాగారంలో ప్రభుత్వానికి ఉన్న 100% షేర్లను పూర్తిగా ప్రైవేట్ కంపెనీలచేతుల్లో పెట్టడమే కాకుండా,ఎటువంటి పోటీలేకుండదా  50% షేర్లను ఒకేఒక విదేశీ కంపెనీ కి ధారాదత్తం చేయడం ఈ నిర్ణయాల లక్ష్యం లాగ కనిపిస్తున్నది. ఎటువంటి పోటీ లేకుండా, పారదర్ష్యరహితంగా ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ అధీనంలో ఉన్న షేర్లను బదలాయించడం వలన విశాఖ ఉక్కు కర్మాగారం అతితక్కువ ధరకు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యానికి వెళ్లే అవకాశం కనిపిస్తున్నది. ఇటువంటి నిర్ణయం వలన ఒక విదేశీ కంపెనీకి, ఒకటో రెండో మనదేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలకు, ఈ కర్మాగారాన్ని కట్టబెట్టే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తున్నది.
4-2-2021 న మీకు  నేను రాసిన లేఖలో,  మరియు విశాఖ పౌరులు ప్రధానమంత్రిగారికి రాసిన లేఖలో, విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్ర విశాఖ ప్రజల జీవితాలతో ఎలాగ ముడిపడి ఉందో తెలియచేయడం జరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడంలో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలాను, ప్రజల ఉద్దేశాలను సేకరించకపోవడం చాలా బాధాకరంగా ఉంది.
ఎన్నో విషయాలలో కేంద్రప్రభుత్వం విశాఖ ప్రజలమీద చూపుతున్న వైఖరి ప్రజలకు నిరాశ కలిగిస్తున్నది.

విశాఖ రైల్వే జోన్ మీద కేంద్రంలో ముందున్న ప్రభుత్వం కాని, ఇప్పుడున్న ప్రభుత్వం కాని అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకోకపోవడం ఇందుకు ఇక ఉదాహరణ. అలాగే ప్రైవేట్ కంపెనీ అధీనం లోనికి వచ్చిన హిందుస్తాన్ జింక్ కంపెనీ, విశాఖలో ఉన్న స్మెల్టర్ యూనిట్ను మూసివేసి, ఆ యూనిట్ కారణంగా కలిగిన కాలుష్యాన్ని నియంత్రణ చేయకపోవడం, పైగా అక్కడ రైతులవద్దనుంచి తీసికున్న 365 ఎకరాల విలువైన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో  పెట్టే ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వ్యతిరేకత తెలియపరచకపోవడం, మరొక ఉదాహరణ. అటువంటి నిర్ణయాలవలన ప్రజలకు లాభాల కన్నా నష్టాలే అధికంగా కలుగుతాయి. కేంద్రప్రభుత్వం ఏకపాక్షికంగా తీసుకుంటున్న అటువంటి నిర్ణయాలు ప్రజాస్వామ్య విధానాలకు అనుగుణంగా లేవు. ఈ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి.నేను మీకు చేసే విజ్ఞప్తి ఏమంటే,  విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ కంపెనీలకు బదలాయించే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం  అన్నివిధాలుగా వ్యతిరేకించాలి.

 కేంద్రం ఈ కర్మాగారానికి ఒక మంచి ఇనుప గనిని త్వరిలో కేటాయించి, ఇనుప దిగుమతుల మీద సుంకాలను అధికం చేసి, కర్మాగార కార్యక్రమాలను అతిత్వరలో లాభదాయకంగా చేయాలి. రాష్త్ర ప్రభుత్వం ఈవిషయంలోను, రైల్వే జోన్ విషయం లోను, హిందూస్తాన్ జింక్ భూముల విషయంలోనూ, ప్రజల తరఫున ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
-ఇఎఎస్ శర్మ
14-40-4/1 గోఖలే రోడ్ 
మహారాణిపేట 
విశాఖపట్నం 530002
ఇది కూడా చదవండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *