దేవానంద్ ను అనుకరించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం

(CS Saleem Basha)
ప్రత్యేకమైన హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ లను కలిపి రొమాన్స్ నీ, భగ్నప్రేమ నీ ఒక స్థాయికి తీసుకెళ్ళిన ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్.
88 ఏళ్ల వయసులో కూడా తన చివరి సినిమాలో నటించి (Charge Sheet, 2011) బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన శకాన్ని సృష్టించినవాడు.
భగ్న ప్రేమికుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన దేవానంద్, నిజజీవితంలో కూడా భగ్న ప్రేమికుడు. నటి సురైయ్య తో ప్రేమ విఫలమై, నిజజీవితంలో కూడా భగ్నప్రేమికుడే అయ్యాడు.
ఈ రోజు దేవానంద్ జయంతి (26.09.1923) తనకే ప్రత్యేకమైన ఒక హెయిర్ స్టైల్ దేవానంద్ సొంతం. నుదుటిపైన వెంట్రుకలను ఒక కుప్పగా కుదించి దువ్వుకోవడం దేవానంద్ స్టైల్.
ఆ కాలపు యువత చాలా కష్టపడి అలా దువ్వుకునే వారు. ఈ మధ్యనే స్వర్గస్తుడైన గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా దేవానంద్ లా వెంట్రుకలకు కందెన పూసి మరీ కుప్పగా దువ్వుకునే వాడట.
1961 వచ్చిన జబ్ ప్యార్ కిసీసే హొతా హై సినిమాలో ” జియా హో జియా హో జియా కుచ్” పాట పాడుకుంటూ ఆ హెయిర్ స్టైల్ ని కొంతకాలం అనుకరించాడట. ఈ విషయాన్ని” ఝుమ్మంది నాదం” అనే ఈ టీవీ ప్రోగ్రాంలో స్వయంగా చెప్పాడు.

బాలీవుడ్ స్వర్ణయుగంలో అందమైన నటుడిగా పేరు తెచ్చుకున్న దేవానంద్ తన స్టైల్ తో బాలీవుడ్ కు కొత్త భాష్యం నేర్పించాడు.
అప్పటిదాకా దిలీప్ కుమార్ లాంటి మెథడ్ యాక్టర్, రాజ్ కపూర్ లాంటి షో మ్యాన్ ల సీరియస్ యాక్టింగ్ నడుస్తున్న కాలంలో దేవానంద్ తన స్టైల్ తో ప్రేక్షకులకు కొత్త ఉత్సాహం ఇచ్చాడు.. దేవానంద్ సినిమాల్లో పాటల కు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది.
ఆ కాలంలో అమ్మాయిలు దేవానంద్ అంటే పడి చచ్చే వారు. ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. కొంత మంది సన్నిహితులు దేవానంద్ ను బహిరంగంగా బ్లాక్ సూట్ ధరించవద్దని సలహా ఇచ్చారట! ఎందుకంటే అతన్ని నల్లని దుస్తు ల్లో చూసి అమ్మాయిలు భవనాల నుండి దూకుతారు అని అలా చెప్పారట. ఆ కాలంలో ఒక అందమైన నటుడైన దేవానంద్ గురించి ఇలాంటి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి.
ముంబైలో కష్టపడుతున్న రోజుల్లో, దేవ్ ఆనంద్ అకౌంటెన్సీ సంస్థలో గుమస్తాగా 85 రూపాయల తక్కువ జీతం కోసం పనిచేశాడు. మిలటరీ సెన్సార్ ఆఫీసులో పని చేసి నెలకు నూట 60 రూపాయలు సంపాదించినది కూడా అతని జీవితంలో ఒక విశేషం
దేవానంద్ నటుడు కావలనుకోవడనికి స్పూర్తి “దాదముని” గా పిలవబడే అశోక్ కుమార్. అతని సినిమా “అచ్యుత్ కన్య” చూసి దేవ్ నటుడు కావాలనుకున్నాడు. విచిత్రంగా అశోక్ కుమారే దేవ్ కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఒక సినిమా సెట్స్ లో దేవానంద్ ను చూసిన అశోక్ కుమార్ తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా హిట్ కావడంతో దేవానంద్ తారాపథం లోకి దూసుకెళ్ళాడు. దేవానంద్ చాలా సినిమాలకు ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి. మొదట్లో హిందీ పేర్లు ఉన్నా రాను రాను ఇంగ్లీష్ పేర్లు ఎక్కువయ్యాయి. 1954 లో వచ్చిన టాక్సీ డ్రైవర్ తో ఆ ప్రక్రియ మొదలైంది. దాదాపు పాతిక పైన సినిమాలు ఇంగ్లీష్ పేర్లతో ఉంటాయి. అందులో ముఖ్యమైనవి, బాగా హిట్ అయినవి C.I.D, Jewel thief, Guide, Gambler, Paying Guest, Love marriage, Warrant వంటివి ఉన్నాయి. చివరి నాలుగు సినిమా లకు కూడా (Censor, Love at Times Square, Mr.Prime Minister, Charge Sheet) ఇంగ్లీష్ పేర్లే ఉండడం విశేషం! దేవానంద్ ఇంగ్లీష్ లిటరేచర్ లో పట్టభద్రుడు కావడం వల్లనే ఇదంతా జరిగిందో లేక యాదృచ్ఛికమో చెప్పలేం.

దేవానంద్ సినిమాల్లో చాలా వరకు హిట్ పాటలే ఉంటాయి. సినిమా బాగా ఆడకపోయినా పాటలు బాగుండటం, కేవలం పాటల వల్లనే సినిమాలు బాగా ఆడటం, దేవానంద్ సినిమాల విశిష్టత. దేవానంద్ తన సొంత నిర్మాణ సంస్థ నవకేతన్ ద్వారా విభిన్నమైన సినిమాలు తీశాడు. హరే రామ హరే కృష్ణ అందులో ఒకటి. ఆర్.కె.నారాయణ్ పుస్తకం ఆధారంగా తీసిన గైడ్ సినిమా అలాంటిదే.
దేవానంద్ తన జీవిత కాలంలో అనేక హిట్ సినిమాలను నిరాకరించాడు. అందులో జంగ్లీ, తీస్రీ మంజిల్ లాంటి సినిమాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ ను తారాపథంలో కి తీసుకెళ్లిన జంజీర్ సినిమా కూడా మొదట దేవానంద్ కే ఆఫర్ చేయబడింది. దేవానంద్ చిత్రమైన మనస్తత్వం ఉన్నవాడు. అందుకే ఆ సినిమా దర్శకులతో విభేదాలు వచ్చినందువల్ల ఆ సినిమాలు చేయలేదు.
60 సంవత్సరాల సినీ జీవితం లో రొమాన్స్ కు కొత్త భాష్యం చెప్పిన దేవానంద్ ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా చేశాడు, హిట్ సినిమాలు తీశాడు, ఎంతోమందిని (జీనత్ అమన్ అందులో ఒకరు) వెండితెరకు పరిచయం చేశాడు. దేవానంద్ సినిమాల్లో వందలకొద్దీ హిట్ పాటలు ఉన్నాయి.
జెవెల్ థీఫ్ లోని “దిల్ పుకారే ఆరె అరె అరె”, కాలా బజార్ లోని “ఖొయా ఖొయా చాంద్”, సీ.ఐ.డీ లోని “ఆంఖో హి ఆంఖో మె ఇషారా”, గైడ్ సినిమాలోని “గాతా రహే మెరా దిల్”, ప్రేం పూజారి లోని “ఫూలొంకే రంగ్ సే”, డార్లీంగ్ డార్లింగ్ సినిమా లోని “ఐసే న ముఝే తుం దేఖో”, తెరే ఘర్ కే సామ్నే లోని “దిల్ క భన్వర్ కరే పుకార్”, జానీ మేరా నాం లోని “పల్ భర్ కే లియే కోయి హమే ప్యార్”, హం దోనో లోని “అభి నా జావో చోడ్ కర్” హరే రామ హరే కృష్ణ లోని “ఫూలోంకా తారోంకా సబ్ కా కహెనా” వంటివి అందులో కొన్ని మాత్రమే
చివరి వరకు సినిమాలు చేస్తూ, ఎవర్ గ్రీన్ హీరో అనిపించుకున్న దేవానంద్, ఆరోగ్య పరీక్షల కోసం లండన్ వెళ్లి అక్కడే డిసెంబర్ 3, 2011 న ఒక హోటల్ రూమ్ లో కన్నుమూశాడు.