Home Breaking ఢిల్లీ ముట్టడి నాడు-నేడు… ఉద్యమ స్వరూపంలో వస్తున్న మార్పు

ఢిల్లీ ముట్టడి నాడు-నేడు… ఉద్యమ స్వరూపంలో వస్తున్న మార్పు

163
0

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

ఢిల్లీ సరిహద్దు సింఘు బార్డర్ నుంచి: ఢిల్లీ కేంద్రంగా కొనసాగే రైతాంగ ప్రతిఘటనను డెబ్బై రోజుల క్రితం చూసా. తిరిగి ఇప్పుడు కూడా చూస్తున్నా. రెండు సార్లు చూసిన నాకు కొన్ని తేడాలు కనిపించాయి. నా దృష్టిలో కొట్టొచ్చినట్లు కనిపించే కొన్ని ముఖ్యమైన తేడాలు వున్నాయి. అందులో ఒక మార్పును మిత్రుల దృష్టికి తేవడం సందర్భోచితంగా వుంటుందేమో!

సింగు, టెక్రి, ఘజీపూర్ వంటి రైతు ముట్టడి ప్రాంతాల్లో సభా వేదికల, టెంట్ల నిర్మాణాల్ని నిశితంగా పరిశీలిస్తే, ఉద్యమ స్వభావంలో వచ్చిన మార్పును గ్రహించవచ్చు. నిర్మాణాలలో నాడు తాత్కాలిక స్వభావం వుండేది. నేడు వాటి రూపంలో మార్పులు వచ్చాయి. వాటిలో శాశ్వత (దీర్ఘకాలిక) స్వభావం కనిపిస్తుంది. నాడు కూడా హైవేల మీద రైతులు తమ ట్రక్కులు, ట్రాక్టర్లని నిలిపి వుంచారు. వాటి పై టెంట్లు కూడా వేశారు. నాడు కూడా రోడ్లను ఆవాసాలుగా రైతాంగం మార్చుకున్నది. కానీ పర్మినెంట్ నిర్మాణాలకు ఉపయోగించే గునపాలు, పలుగులు, పారల వంటి పరికరాలను నాడు రైతాంగం ఉపయోగించ లేదు. ఇప్పుడు పరిస్తితి మారింది.

ఒకవేళ సమస్యకు పరిష్కారం జరిగి ఏరోజైనా ముట్టడి విరమణ జరిగితే, హైవేలు వెంటనే యధావిధిగా వినియోగంలోకి వచ్చే పరిస్తితి నాడు వుండేది. ఇప్పుడు అట్టి పరిస్థితి లేదు. హైవేల్ని తిరిగి యథాతథ స్థాయికి తేవడానికి కొంత వ్యవధి తీసుకోవచ్చు.

ముఖ్యంగా హైవే లపై సభా వేదికలను ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. నాడు తాత్కాలిక నిర్మాణాలు (make shift constructions) వున్నాయి. నేడు ఇనుప కమ్మీలు, మేకులు, స్తంభాలు, రాడ్లు, చువ్వలు, కడ్డీలతో సభా వేదికల్ని నిర్మించిన స్థితి కనిపిస్తుంది. అవి భారీ వివాహ మందిరాల (Function halls) ను గుర్తు చేస్తాయి. వాటి కింద వేలాది మంది శ్రోతలు ఆసీనులై వక్తల ప్రసంగాల్ని వినవచ్చు. అవి మహా సభామందిర నిర్మాణాల్ని తలపిస్తున్నాయి. అదే విధంగా రోడ్లపై రైతుల టెంట్లు కూడా ఎంతోకొంత నేడు పర్మినెంట్ నిర్మాణాలుగా మారాయి. నాడు రైతులు తమ ట్రాక్టర్లు, ట్రక్కుల పై ప్రధానంగా టెంట్ల నిర్మాణాలు చేశారు. ఐతే నేడు వాటితో పాటు, వాటిపక్కన కూడా రోడ్ల మీద కొత్త టెంట్లు నిర్మించిన దృశ్యాల్ని చూడొచ్చు. ఈ తేడా దీనిని సూచిస్తుంది?

“ఊరు మనదిరా ఈ వాడ మనదిరా” అనే పాట తెలుగు సీమలో తెలిసిందే. నేడు దేశ రైతాంగం, ముఖ్యంగా దర్నాలో పాల్గొనే రైతు ఉద్యమకారులు “ఈ రోడ్డు మాదిరా, ఈ రోడ్డు మీద హక్కు మాదిరా” అని చాటుతున్నట్లుగా వుంది.

పై మార్పును కొత్తచూపుతో పరిశీలిస్తే, కొత్త వాస్తవాన్ని చూడొచ్చు. జనవరి 26న ఎర్రకోట కేంద్రంగా రాజ్య కుట్రల వైఫల్యం తెలిసిందే. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం హైవే మార్గాల పై ధర్నా శిబిరాల్ని దిగ్బంధిస్తూ రోడ్ల మీద ఇనుప మేకులు, సిమెంట్ దిమ్మెలతో కాంక్రీట్ బారికేడ్ల నిర్మాణానికి దిగింది. దానికి కౌంటర్ గా రైతు ఉద్యమ శక్తులు కూడా అదే రోడ్ల మీద తమ నివాసాలను, తమ సభా వేదికల నిర్మాణాలను కాంక్రీట్ పునాదులతో నిర్మిస్తున్నట్లు అర్థమవుతుంది.

జనవరి 26 తర్వాత “కాంక్రీట్ ముళ్ళ కంచెలు” నిర్మాణంతో రాజ్య అణిచివేత ప్రక్రియలో వచ్చిన గుణాత్మక మార్పు గూర్చి దేశ ప్రజలలో భారీ ప్రచారం జరిగింది. కానీ, దానికి కౌంటర్ గా రైతాంగ ప్రతిఘటన స్వభావంలో కూడా వచ్చిన “కాంక్రీట్ నివాస నిర్మాణ ప్రక్రియ” గూర్చి ప్రచారం సరిగ్గా జరగలేదని అనిపిస్తుంది. దీన్ని ప్రచారం చేయడం ప్రగతిశీల శక్తుల కర్తవ్యమేమో!

ఇప్పటి వరకూ మనం వింటోన్న మాట ఏమంటే, రోడ్ల విస్తరణలో భాగంగా ప్రజలను తమ నివాసాల నుండి రాజ్యం బయటకి వెళ్ళగొట్టడం గూర్చి! ఇప్పటి కొత్త మాట ఏమంటే, రాజ్యాన్ని హైవే మార్గాల నుండి బయటకి వెళ్లగొట్టి, వాటిని రైతాంగం తమ నివాసాలుగా మార్చుకోవడం గూర్చి! రోడ్ల విస్తరణ కోసం ఇళ్లను కూల్చి వేస్తే, అట్టి నిర్వాసితులు ప్రభుత్వాల మీద పోరాడటాన్ని ఇప్పటి వరకూ మనం చూసాం. కానీ బడా కార్పొరేట్ల కోసం తమను భూముల నుండి మున్ముందు బేదకల్ చేసే ప్రభుత్వ విధానంపై పోరాటానికి నేడు రైతాంగం హైవే రోడ్లను తమ పర్మినెంట్ నివాసాలు గా మార్చుకున్న ది. ఇదో కొత్త ధోరణిని వెల్లడిస్తుంది.

అణచివేత ఎంత తీవ్ర రూపం ధరిస్తే, ప్రతిఘటన కూడా అంతే తీవ్రతరం అవుతోందనే సూత్రం ఇక్కడ అమలు జరుగుతోంది. ఔను, ఒకవైపు హైవే రోడ్ల పై కాంక్రీట్ బారికేడ్లను నిరంకుశ ప్రభుత్వం నిర్మిస్తే, అదే రోడ్లను తమ రేపటి దీర్ఘకాలిక ప్రతిఘటనా ప్రక్రియకి అవసరమైన కాంక్రీట్ నివాసాల నిలయంగా భారత రైతాంగం మార్చుకుంటోంది. వర్తమాన భారత దేశ రైతాంగ ఉద్యమ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం అవుతుందేమో!

ఒక వారం లేదా ఒక నెల పాటు ధర్నాకు మానసికంగా సిద్ధపడి ఢిల్లీ వచ్చిన రైతు నేడు ఏడాది సైతం పోరుకు సిద్దం అవుతున్నాడు. రోడ్ల మీద నేటి కాంక్రీట్ నిర్మాణాలు అలాంటి దీర్ఘకాలిక మానసిక సంసిద్ధత కి నిదర్శనంగా భావించవచ్చా?

గమనిక :– నాలుగు దక్షిణాది రాష్ట్రాల కు చెందిన 130 మందితో కూడిన సౌత్ ఇండియా ప్రతినిధి వర్గం నిన్న ఘజీపూర్ సందర్శించి, నేటి మధ్యాహ్నం సింగు బోర్డర్ కి చేరింది. ఈ రాత్రి ఇక్కడే వుండి, రేపు ఉదయం 10 గంటలకు జరిగే సభలో పాల్గొంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here