లోట‌స్‌పాండ్‌లో జ‌గ‌న్‌తో చంద్ర‌బాబు బంధువు భేటీ

ఏపీ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా మారడాన్ని చూస్తున్నాం. కుటుంబపరమైన విబేధాలు కొత్త రాజకీయ బంధాలను ఏర్పరుచుకోవడానికి బాటలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు బంధువు.. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత జగన్ ను లోటస్ పాండ్ లో కలిశారు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై మరింత సమాచారం కింద ఉంది చదవండి.

ఆదివారం లోటస్ పాండ్ లో జగన్ ను చంద్రబాబు తోడల్లుడు, సీనియర్ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కొడుకు హితేష్ తో కలిశారు. గత కొంతకాలంగా దగ్గుబాటి హితేష్ వైసీపీలో చేరతాడంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు జగన్ కలవడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సుమారు గంటసేపు జరిగిన ఈ భేటీలో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.

దగ్గుబాటి హితేష్ చెంచురామ్ పర్చూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరపు నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇదే విషయాన్నీ వారు జగన్ కి విన్నవించి త్వరలో పార్టీలో చేరాలి అనుకుంటున్నట్టు వివరించారని సమాచారం. అంతేకాదు తనయుడితోపాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా వైసీపీలో చేరి తన థర్డ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నారు అనే అంశంపై ఈ భేటీతో తెరపైకి వచ్చింది.

కాగా హితేష్ అమెరికాలో జన్మించడంతో అక్కడ సిటిజెన్ గా గుర్తింపు ఉంది. అయితే త్వరలో సిటిజెన్ షిప్ ను కూడా ఇక్కడికి మార్చుకుంటున్నారని, కొద్ది రోజుల్లోనే ఆ పని పూర్తి అవుతుందని జగన్ కి దగ్గుబాటి వారు తెలిపినట్టు సమాచారం. అయితే దగ్గుబాటి పురంధేశ్వరిని కూడా వైసీపీలో చేరవలసిందిగా జగన్ వారిని కోరినట్టు తెలుస్తోంది. కాగా పురంధేశ్వరి గతంలో… ఉంటే బీజేపీలో లేదా రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. మరి కొడుకు రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని పార్టీలో చేరతారేమో వేచి చూడాలి. ఒకవేళ పురంధేశ్వరి పార్టీలో చేరితే ఆమెను విజయవాడ ఎంపీ స్థానం లేదా విశాఖ ఎంపీ బరిలో నిలబెట్టాలనే ఆలోచనలో పార్టీ హై కమాండ్ ఉన్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *