Home Breaking విశాఖ స్టీల్ ను కేంద్రం ముంచేయబోతున్నది, జగన్ కు సిపిఎం లేఖ

విశాఖ స్టీల్ ను కేంద్రం ముంచేయబోతున్నది, జగన్ కు సిపిఎం లేఖ

71
0
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భూములను పోస్కో కంపెనీకి కేటాయించకుండా, విశాఖ స్టీల్‌ ప్లాందుట్‌ ప్రైయివేటీకరించకుండా చూడాలని సిపిఎం  ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి పి మధు ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. కేంద్రం చర్యలను నిలిపివేసేలా వత్తిడి తీసుకువచ్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కోరారు. లేఖ సారాంశం …
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో పోస్కో కంపెనీకి సుమారు 4000 ఎకరాల భూమిని కేటాయించినట్లుగా డిజైన్స్‌ డిపార్టుమెంటు గుర్తించింది. నలుగురు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అధికార్లతో ఎడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసులో ఒక సెల్‌ పోస్కో కంపెనీ కోసం ఏర్పాటు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంటును పోస్కో కంపెనీకి కట్టబెట్టడంలో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయి. పోస్కో కంపెనీ మన రాష్ట్రంలో కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేయడానికి కావలసిన వనరులు అన్నీ వున్నాయి. కడపలో పోస్కో కంపెనీ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మిస్తే రాష్ట్రలో మరో ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది.
ప్లాంట్‌ను పోస్కో కంపెనీకి కారుచౌకగా కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే ఈ జాయింట్‌ వెంచర్‌ కేంద్రం ప్రతిపాదిస్తుంది. పోస్కోతో జాయింట్‌ వెంచర్‌లో  4 మి.ట ప్లాంట్‌ కట్టడానికి రూ.28వేల కోట్లు పెట్టాదలి. 1:2 వాటాలతో జాయింట్‌ వెంచర్‌ ప్లాంట్‌ పెట్టడానికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 10వేల కోట్లు అప్పులు చేయాలి. అప్పులకు వడ్డీలు చెల్లించలేక పూర్తి నష్టాల్లో నెడతారు. నష్టాలు వచ్చాయనే పేరుతో వాటాలు అమ్మి పూర్తిగా పోస్కోకు అప్పగించాలనే కుట్ర చేస్తున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వాస్తవ విలువ రూ.2లక్షల కోట్లు ఉంటుంది. కాని కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యాల్యూయేషన్‌ కమిటీ లెక్కల ప్రకారం రూ.4,889 కోట్లుగా చూపించారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రాష్ట్రంలో అత్యంత భారీ ప్రాజెక్టు. రూ.20వేల కోట్లు టర్నోవర్‌ ఉంది. 100శాతం కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమగా కొనసాగుతుంది. 33 వేల మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి రూ.5 వేల కోట్లుకు లోపే. కాని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు చెల్లించిన పన్నులు, డివిడెండ్లు రూ. 29,807.65 కోట్లు. 1966లో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంతో పోరాటం జరిపి 32మంది ప్రాణాల బలిదానం జరిపి సాధించిన భారీ ప్రాజెక్టు ఇది. విశాఖ జిల్లాలో 68 గ్రామాల ప్రజలు 22వేల ఎకరాల భూములు ప్రభుత్వానికి అతి చౌకగా ఇచ్చారు. 16,600 కుటుంబాలు తమ ఇళ్లు, వాకిళ్లు వదిలి నిర్వాసిత కాలనీల్లో వుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అశేష త్యాగాలు చేసి సాధించుకున్న స్టీల్‌ ప్లాంటును విదేశీ ప్రయివేటు కంపెనీకి అప్పగించడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.
రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ స్థలాలు పోస్కోకు అప్పగించకుండా కాపాడాలి. పోస్కోకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో స్థలం ఇవ్వకుండా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. ఆమేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతున్నాము.