సిపిఐ(ఎంఎల్) కేంద్ర కమిటీనేత డాక్టర్ జస్వంత్ రావు మృతి

సిపిఐ ఎంఎల్ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు, తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ జస్వంత రావు రాత్రి 8 గంటలకు అంతిమ శ్వాస విడిచారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించారు.
డాక్టర్ పోలవరపు జశ్వంతరావు కామ్రేడ్ కానూసన్యాల్ పునర్నిర్మించిన సిపిఐ ఎమ్మెల్ కేంద్ర కమిటీ సభ్యులు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు . తెలుగు ఇంగ్లీషు భాషలలో వెలువడుతున్న ఆ పార్టీ పత్రికలు జనశక్తి & క్లాస్ స్త్ర గు ల్ లకు ఆయన సంపాదకులు. 50 ఏళ్లకు పైగా విప్లవోద్యమ కార్యకలాపాలకు అంకితమై తన యావత్తు జీవితాన్ని నిబద్ధతతో పీడిత ప్రజల విముక్తికై అలుపెరగని కృషి సలిపిన విప్లవ కమ్యూనిస్టు ఉద్యమ కార్యకర్త.
సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి విశ్వంతో సుదీర్ఘకాలంపాటు తోడుగా నిలిచిన అత్యంత సన్నిహిత సహచరుడు .
వైద్యశాస్త్రంలో పట్టా పొందిన డాక్టర్ జస్వంత్ రావు ఆర్థిక శాస్త్ర నిపుణుడిగా కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి భావధారను కొనసాగించిన వానిగా పేరు తెచ్చుకున్నారు. ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకం లోని నిర్ధారణలను సూత్రీకరణలను వర్తమాన పరిస్థితులకు అన్వయించి నాగిరెడ్డిగారి తదనంతర కాలపు ఆర్థిక పరిణామాలను విశ్లేషించి చెప్పిన మార్క్సిస్టు – లెనినిస్టు మేధావి .