91మంది టిటిడి ఉద్యోగులకు కరోనా, భక్తులంతా క్లీన్

 తిరుమ‌ల‌ తిరుపతి దేవస్థానం (టిటిడి)ట్రస్టులో మొత్తం 91 మంది టీటీడీ ఉద్యోగుల‌కి  క‌రోనా వైర‌స్ సోకింద‌ని ఈవో అనిల్ కుమార్ సింఘల్  తెలిపారు.
అయితే, తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనానికి  వ‌చ్చిన భక్తులెవరిలో కరోనా కనిపించలేదని ఆయన వెల్లడించానరు. తిరుమలకు వచ్చే భక్తులను టిటిడి ప‌రీక్ష చేస్తూ ఉందని,  ఏ ఒక్క భ‌క్తునిలో కోవిడ్ ఛాయలు కనిపించలేదని ఆయన చెప్పారు.
కల్యాణ కట్టలో  ఎవరికీ కరోనా సోకలేదని, దీనిమీద వినవస్తున్నందంతా తప్పు సమాచారమని కూడా  ఇవొ చెప్పారు.
టిటిడి ఉద్యోగులకు సంబంధించి అలిపిరి వ‌ద్ద 1,704, తిరుమ‌ల‌లో 1,865 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 631 మంది యాత్రికులకు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వహించారు. లాక్ డౌన్ అనంత‌రం 82,563 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌ర్పించారు.  త‌ల‌నీలాల విలువ పెర‌గ‌డంతో రూ.7 కోట్ల ఆదాయం అద‌నంగా స‌మ‌కూరింది,’ అని సింఘాల్ తెలిపారు.
టీటీడీ ఆస్తుల‌ను విక్రయించాలని ఆ మధ్యటిటిడి తీసుకున్న నిర్ణయం బాగా వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే.  తమిళనాడులో ఉన్న ఆస్తులను టిటిడి విక్రయించాలనుకున్నపుడు దానిని వ్యతిరేకిస్తూ మొదట టిటిడి ఆస్తులెక్కడెక్కడ ఉన్నాయో ఒక శ్వేత పత్రం విడుదలచేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి.
దీనిమీద టిటిడి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానాల  ఆస్తుల‌కు సంబంధించి  శ్వేత ప‌త్రం విడుద‌ల‌కు నిర్ణ‌యించినట్లు ఇవొ తెలిపారు.
ఇక ముందు వివాదాల‌కు తావు లేకుండా, పూర్తిస్థాయి ప‌రిశీల‌న త‌ర్వా‌త టిటిడి ఆస్తుల మీద శ్వేత ప‌త్రం విడుద‌ల చేయడంజరుగుతుందని సింఘాల్ చెప్పారు.
తిరుప‌తిలోని టీటీడీ అడ్మినిస్ట్రేష‌న్ భ‌వ‌నం నుంచి తొలిసారి జరిగిన ‘డ‌య‌ల్ యూవ‌ర్ ఈవో’ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ  ఆయ‌న మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.
 శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌ గురించి చెబుతూ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.  అప్ప‌టి ప‌రిస్థితులను బ‌ట్టి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై నిర్ణ‌యం తీసుకుంటామని అన్నారు. బ్రహ్మోత్సాలను నిర్వహించాలంటే ఆలయం బయటపెద్దగా జనం గుమికూడతారు.అందువల్ల టిటిడి బ్రహ్మోత్సాల గురించి యోచిస్తూ ఉంది.
తిరుమల సందర్శించిన భక్తుల వివరాలు:  జూన్ 11 నుంచి జూలై పదకొండుదాకా ఆన్ లైన్ బుకింగ్ ద్వారా 1, 64,742 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కంరెటుబుక్తింగ్ ద్వారా దర్శనం చేసుకున్నవారు 85,434.  నెలలో మొత్తంగా 2,50,176 మంది దర్శనానికి వచ్చారు.  ఆన్ లైన్ బుక్ చేసుకున్నవారిలో  55,669 మంది దర్శనానికి రాలేదు. నెలలో శ్రీవారి రాబడి 16.73కోట్లు.
దేవుడికి కానుకలు సమర్పించాలన్న  భక్తి భావం కరోనా వల్ల తగ్గలేదని కూడా ఆయన చెప్పారు.గత ఏడాది సగటున ప్రతిభక్తుడు రు. 420 సమర్పింస్తే, ఇపుడు కరోనా ఆర్థిక కష్టాలలోల కూడా సగటున రు. 620 సమర్పించారని ఆయన చెప్పారు. ఒక భక్తుడు వందగ్రాముల బంగారు బిస్కెట్లను 20 దాకా సమర్పించినట్లు సింఘల్ వెల్లడించారు