కర్నల్ సంతోష్ కు కన్నీటి వీడ్కోలు

లదాక్ లోని గాల్వాన్ లోయలో భారత చైనా సరిహద్దులో చైనా సైనికులుజరిపిన దాడిలో వీరమరణం పొందిన సూర్యాపేటకు చెంది కర్నల్‌ బి సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి.
సూర్యాపేట పట్టణం శివారులోని కాసారాబాద్ లో సంతోష్ బాబు కుచెందిన ఫార్మ్ హౌస్ లో అంత్యక్రియలు జరిగాయి.
ఇందులో 16 బీహార్‌ రెజిమెంట్‌ బృందం కూడా పాల్గొని నివాళులర్పించింది. కోవిడ్ విస్తరిస్తున్న కారణంగా విధించిన ఆంక్షల వల్ల పరిమిత సంఖ్యలో ప్రజలను అంత్యక్రియలకు అనుమతించారు.
సంతోష్ భౌతిక కాయంపై సైనికాధికారలు జాతీయ జెండా కప్పి నివాళులర్పించిన తుది వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి జగదీష్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు.

కర్నల్ సంతోష్ అంతిమ యాత్ర విద్యానగర్‌లోని స్వగృహం నుంచి ప్రారంభమయి ఎంజీ రోడ్డు, శంకర్‌ విలాస్‌ సెంటర్‌, రైతు బజార్‌, పాత బస్టాండ్‌, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా 5కిలోమీటర్ల సాగి కాసరాబాద్ ఫామ్ హౌస్ కు చేరుకుంది.
సంతోష్ బాబు అమర్‌ రహే, వందే మాతరం అంటూ ప్రజలు నినాదాలు చేశారు. సూర్యాపేట పట్టణంలో లో వ్యాపారులు స్వచ్ఛందంగా ఆయనకు గౌరవ సూచకంగా బంద్‌ పాటించారు.
నల్గొండ లోక్ సభ సభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి   కూడా ఆయనకు నివాళులర్పించి అంతిమాయాత్రలో పాల్గొన్నారు.
తెలంగాణా పిసిసి అధ్యక్షుకు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంత్యక్రియలకు వచ్చి కర్నల్ సంతోష్ కు నివాళులర్పించారు.