‘ఒక రోజు కలెక్టర్’ శ్రావణిని ఉన్నత చదువులు చదివించండి: కలెక్టర్ గంధం చంద్రుడు

(చందమూరి నరసింహారెడ్డి)
అంతర్జాతీయ బాలికా దినోత్సవంనాడు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు జిల్లా లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులుగా ఒకరోజు అధికారులు గా విద్యార్థినులతో విన్నూతన ప్రయోగం చేశారు.
అక్కడితో ఆగిపోలేదు. అధికారులు గా పనిచేసిన బాలికలకు భవిష్యత్తులో మెంటార్స్ గా వ్యవహరిస్తామని అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆరోజు వివరించారు.ఆమేరకు కార్యచరణ ప్రారంభించారు.
ఒక రోజు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని ఎం.శ్రావణిని ఉన్నత చదువులు చదివించాలని, అందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని వారి తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హామీ ఇచ్చారు.
గురువారం సాయంత్రం గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నాడు ఒక రోజు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రావణి ఇంటిని సందర్శించి, శ్రావణి,ఆమె తల్లిదండ్రులు పాములేటి, రత్నమ్మ లతో మాట్లాడి వారి బాగోగులను ఆర్థిక పరిస్థితిని జిల్లా కలెక్టర్అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థిని శ్రావణి కి వచ్చిన అవకాశం కొద్ది మందికి మాత్రమే వస్తుందని, విద్యార్థిని బాగా చదివించాలన్నారు. విద్యార్థిని చదువుకు ఏ సహాయం కావాలన్నా చేస్తామని, అమ్మాయి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కొంత కొంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు.
ఆ డబ్బును అమ్మాయి చదువు కోసం ఉయోగించాలని సూచించారు. ఆడపిల్లకు చదువు ఎందుకు అనే ఆలోచన వద్దని, మంచిగా చదివించాలన్నారు. మీకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
బాలికా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఒకరోజు జిల్లా కలెక్టర్ గా చేసిన విద్యార్థిని శ్రావణిని కేంద్ర మంత్రి కూడా అభినందించారని, అమ్మాయి బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలషించారు. ఈ సందర్భంగా విద్యార్థి శ్రావణికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కలెక్టర్ కావాలని బాగా చదువుకోవాలని విద్యార్థినికి జిల్లా కలెక్టర్ ఆల్ ద బెస్ట్ చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థిని కి చదువు చెప్పిన ఆమె టీచర్ నాగవేణి తో కలెక్టర్ ఫోన్ లో మాట్లాడుతూ బాగా చదివే వారిని ప్రోత్సహించాలని, భవిష్యత్తులో వారు ఏదైనా సాధిస్తారని, మంచిగా చదువు చెప్పినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇదే విధంగా మిగిలిన విధులు నిర్వహించిన విద్యార్థినుల మోంటార్స్ కూడ ప్రోత్సాహం అందిస్తే మరింత సంపూర్ణత చేకూరుతుంది.
బాలిక తల్లిదండ్రులు తో మాట్లాడడానికి వచ్చిన కలెక్టర్ కు కనంపల్లి గ్రామ చెరువుకు నీటి సరఫరా చేసేందుకు కాలువ కావాలని, తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరగా, జిల్లా కలెక్టర్ గ్రామస్తుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)