బడ్జెట్ అదిరింది అల్లుడూ: హరీష్ రావుకు కెసిఆర్ ప్రశంస

 ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి సమతుల్యంగా  ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశంసించారు. బడ్జెట్ ప్రతిపాదనలు చాలా వాస్తవికంగా ఉన్నాయని, ప్రజల అవసరాలను బట్టి నిధులకేటాయింపులు ఫర్ ఫెక్ట్ గా జరిగాయని ఆయన కొనియాడారు.
కేంద్రం నుంచి నిధులు తగ్గిన దాని ప్రభావం బడ్జెట్ మీద పడకుండా జాగ్రత్తగా బడ్జెట్ ప్రతిపాదనలురూపొందించారని ఆయన అన్నారు.
కెసిఆర్ ఇంకా ఏమన్నారంటే…
 ఇది సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్ .
తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు – తెలంగాణ ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్.
అన్ని వర్గాల సంక్షేమం- అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులున్నాయి.
‘దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని రాబడులు తగ్గి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతలు పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా ఉండే విధంగా  తయారయిన బడ్జెట్.
తెలంగాణ గ్రామాలు, పట్టణాల వికాసానికి  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, సంక్షేమ పథకాల్లో మరింత మంది పేదలకు అవకాశం రావాలనే సంకల్పానికి, ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారు.