డాక్టర్లకు,సిబ్బందికి సెల్యూట్, పరిస్థితి అదుపులో ఉన్నట్లే : సిఎం జగన్

 మొత్తమ్మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కరోనామహమ్మారి పరిస్థితి అదుపులో ఉందనే చెప్పుకోవచ్చు, రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తాను విశ్వసిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
శుక్రవారం నాడు  ఆయన  జిల్లాకలెక్టర్లు, కోవిడ్‌ ఆస్పత్రుల వైద్యులతో పరిస్థితి సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ ను ఈ విషయంలో మిగతా రాష్ట్రాలకంటే భిన్నంగా నిలబెట్టడంలో ముందు నిలబడిన డాక్టర్ల, నర్సుల, ఇతర వైద్య, పారిశుధ్ధ సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు. వారికి సెల్యూట్ చేశారు.
 పరిస్థితి దాదాపు అదుపులోకి తెచ్చుకోవడంలో ఎలా విజయవంతమయిందో ఆయన వివరించారు.
ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా కేసులు సంఖ్య పెరిగిందని
పూర్తిగా వారందర్నీ గుర్తించి  వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను, సెకండరీ కాంటాక్ట్స్‌ను కూడా గుర్తించి క్వారంటైన్‌ లేదా? ఐసోలేషన్‌లో పెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు.
కోవిడ్‌ –19 సోకిన వారిలో 5శాతం మంది క్రిటికల్‌ పరిస్థితుల్లోకి వెళ్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి.ఇలాంటి వారికోసం ఉత్తమ వైద్యం అందించడానికి నాలుగు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులను సన్నద్ధంచేశామని ఆయన చెప్పారు.
అలాగే మరో 14శాతం మంది ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో వారికి సేవలు అందించడానికి ప్రతిజిల్లాకూ ఒక ఆస్పత్రి చొప్పున 13 ఆస్పత్రులను సిద్ధంచేశామని తెలిపారు.
మిగిలిన 81 శాతం మందికిపైగా హోం ఐసోలేషన్‌ లేదా, ప్రతి జిల్లాలో 2వేల బెడ్ల చొప్పున సిద్దంచేసి, అందులో వారికి మెరుగైన సదుపాయాలు అందించి, వారికి నయంచేయడానికి చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొ్నారు.
జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రులు, అలాగే క్రిటికల్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా వైద్యసేవలు అందించే క్రమంలో రిస్కు ఉంటుందని తెలిసినప్పటికీ కూడా చాలా కష్టపడి ఈ సేవ చేస్తున్నారు.
కరోనాపై యుద్ధంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యసిబ్బంది సేవలు ప్రశంసనీయమని, ఎంతో రిస్కు ఉందని తెలిసినా అంకిత భావంతో పనిచేస్తున్నారని,  రాష్ట్రంలో వైద్యులకు, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికీ సెల్యూట్‌ చేస్తున్నానని ఆయన అన్నారు.
“వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది హృదయపూర్వకంగా సేవలు అందిస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు మిగిలిన రాష్ట్రాలు క్రమశిక్షణగా కోవిడ్‌–19 నివారణా చర్యలు చేపడుతున్నా,  మన దగ్గర వైద్యులు, సిబ్బంది చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు. అందుకనే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈ అంశమే మనల్ని విభిన్నంగా నిలబెట్టింది. లాక్‌డౌన్‌ ప్రారంభానికి ముందు, లాక్‌డౌన్‌ ప్రారంభం అయిన తర్వాతకూడా వైద్యులు, సిబ్బంది ఇదే రీతిలో పనిచేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి అభివృద్ది చెందిన నగరాల్లోని గొప్ప గొప్ప వసతులున్న ఆస్పత్రులు మన వద్ద లేకున్నా మన దగ్గర మంచి డాక్టర్లు, ఉత్తమ సిబ్బంది ఉన్నారు,” అని ముఖ్యమంత్రి అన్నారు.