బిజెపి, జనసేనలు అధికారంలోకి రావాలి: చిరంజీవి కొత్త ఆకాంక్ష

హైదరాబాద్: కలయికలకు, శుభాకాంక్షలకు  చాలా అర్థాలుంటాయి.   మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఆంధ్రప్రదేశ్  బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు ను కలివడం, శుభకాంక్షలు చెప్పడం లో ఏదో రాజకీయార్థముందే మో అని పిస్తుంది.
ఎపి బిజెపి అధ్యక్షులు గా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కు చిరంజీవి అభినందనలు చెబుతూ  పుష్పమల, శాలువాతో సత్కరించారు. ఈ సమావేశం చిరంజీవి నివాసంలో జరిగింది.

తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.  ఇంతవరకు బాగానే ఉంది. కాని 2024 లో బిజెపి, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని కూడా ఆకాంక్షించారు. ఇది కచ్చితంగా ఆయన అభిమానులకు, పవన్ కల్యాణ్ అభిమానులకు ఒక రాజకీయ సందేశమే.
చిరంజీవి రాజకీయాల్లో క్రియాశీలంగా లేరు.  కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం పోవడం, నరేంద్రమోదీ అధికారంలోకి రావడంతో ఆయన రాజకీయాలనుంచి తప్పుకున్నారు. బిజెపి లో చేరవచ్చని అని వార్తలొచ్చినా  అవి నిజం కాలేదు. ఎందుకంటే ఆయన తాను కాంగ్రెస్ నుంచి తప్పుకున్నట్లు ఆయనఎపుడు ప్రకటించలేదు. అలాగే చిరంజీవి కాంగ్రెస్ లో లేరని కాంగ్రెస్ చెప్పలేదు. అయితే, చిరంజీవి బిజెపి శ్రేయోభిలాషిగా మారిపోయారు. ఆయన 2024లో ఆంధ్రప్రదేశ్ లో సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీతో కలసి బిజెపి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.