Home Breaking తెలంగాణలో అటవీ రక్షణ కోసం కఠినమైన కొత్త చట్టం వస్తోంది

తెలంగాణలో అటవీ రక్షణ కోసం కఠినమైన కొత్త చట్టం వస్తోంది

210
0
అన్ని జిల్లాల అటవీ అధికారులతో ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణ అధికారి వీడియో కాన్ఫరెన్స్. 
కొట్టిన చెట్టును పట్టుకోవటం కాదు, అడవిలో ఒక్క చెట్టూ కూలకుండా చూడాలి.
కాలినడకన పర్యవేక్షణ, ప్రతీ అటవీ బీట్ తనిఖీ, సిబ్బంది నైట్ హాల్ట్ తప్పనిసరి.
వ్యవస్థీకృత అటవీ నేరస్థులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దు, నిబంధనలు పాటించేవారికి ఇబ్బందిలేదు.
అటవీ రక్షణ కోసం కఠినమైన కొత్త చట్టం వస్తోంది, సమర్థవంతంగా అమలు చేయాలి.  

 

తెలంగాణ అడవుల్లో జీరో ఫెల్లింగ్ రేట్  (ఒక్క చెట్టూ కొట్టకుండా చూడటం) ఉండాలనేది ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆశయమని ఆ దిశగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీకే ఝా తెలిపారు. అడవులు, వన్యప్రాణుల రక్షణ కోసం పటిష్టమైన నిబంధనలతో కొత్త చట్టం వస్తోందని, దానిని సమర్థవంతంగా అమలు చేయాలని అన్ని జిల్లాల అటవీ అధికారులతో సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు.

అటవీ నేరాలను అలవాటుగా చేసుకుని, వ్యవస్థీకృత నేరగాళ్లుగా ముద్ర పడ్డ వాళ్ల భరతం పట్టాలనేది ముఖ్యమంత్రి ఆదేశమన్నారు. కొత్తగా అటవీ శాఖలో చేరుతున్న రెండు వేలకు పైగా సిబ్బందిని అటవీ రక్షణ కోసం తీర్చిదిద్దాలని ఆదేశించారు. ప్రతీ అటవీ బీట్ లో బేస్ క్యాంపు ఏర్పాటు చేయటం, సిబ్బంది కాలినడకన పర్యవేక్షించటం, ప్రతీ బీట్ తనిఖీ, సిబ్బంది నైట్ హాల్ట్ తప్పనిసరని చెప్పారు. చట్ట ప్రకారం పర్మిట్లు, లైసెన్స్ లతో కలప వ్యాపారం చేసేవారు, వడ్రంగులకు ఎలాంటి ఇబ్బందిలేదని, అదే సమయంలో అక్రమంగా వ్యాపారం చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు.

ఇంకా కొన్ని జిల్లాల్లో లైసెన్స్ లు లేకుండా సా మిల్లులు నడుస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, తక్షణం మూసివేయకపోతే సంబంధిత అధికారే కఠిన చర్యలకు బాధ్యుడు అవుతాడని తెలిపారు. ప్రతీ సా మిల్లు కూడా అన్ని వివరాలు రికార్డు బుక్ లో నమోదు చేయాలని, అలా జరగని పక్షంలో కూడా సంబంధిత అటవీ అధికారే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.

నెల రోజులుగా జరుగుతున్న దాడుల్లో 659 క్యూబిక్  మెట్రిక్ టన్నుల, కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయల విలువైన కలప స్వాధీనం చేసుకున్నట్లు, 701 కేసులు పెట్టి, 486 మందిని అరెస్ట్ చేయటంతో పాటు 11 మందిపై పీడీ యాక్టు మోపేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు  విజిలెన్స్ పీసీసీఎఫ్ రఘువీర్ తెలిపారు. అటవీ నేరాల అదుపు ఒక్క రోజుతో తేలేదు కాదని, నిరంతరం దాడులు, తనిఖీలు కొనసాగించాలన్నారు.

పోలీసుల సహకారంతో  కలప దొంగల తీగలాగి వారి వెనుకున్న నిజమైన దొంగలను పట్టుకోవాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు, ఇతర శాఖల సిబ్బంది, ప్రజలను అటవీ నేరాల అదుపుపై స్పందించే  చైతన్య వంతులుగా ప్రేరేపించాలని కోరారు. తాజాగా బదిలీ చేసిన అధికారులు, సిబ్బంది కొత్త ప్రదేశాల్లో విధుల్లో చేరిన విషయాన్ని ఉన్నతాధికారులు ఆరా తీశారు. తక్షణం అటవీ సంరక్షణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పీసీసీఎఫ్  పీకే ఝా, రఘువీర్ (విజిలెన్స్), ప్రధ్వీరాజ్ (ప్రొడక్షన్), అదనపు పీసీసీఎఫ్ లు లోకేశ్ జైస్వాల్, శోభ, స్వర్గం శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here