చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు హంద్రీ-నీవా ఎందుకు పూర్తి చేయలేదు?: మాకిరెడ్డి

చిత్తూరు జిల్లా నీటి అవసరాలు తీరేందుకు ప్రభుత్వాలు ఇపుడు సీరియస్, నిజాయితీగా ఆలోచించాల్సిన సమయమొచ్చిందని జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి చెబుతున్నారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు  కుప్పం నియోజకవర్గానికి హంద్రీ-నీవా నీళ్లిస్తానని చేసిన హామీ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భగా మాకిరెడ్డి చంద్రబాబు కు వేస్తున్న ప్రశ్నలు:

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హంద్రీ-నీవా ఎందుకు పూర్తి చేయలేదు?

హంద్రీ-నీవా ప్రాజక్టు కాలువ  చివరి ప్రాంతం కుప్పం. కుప్పానికి నీళ్లు కావాలి.   కుప్పం దాకా వచ్చేందుకు ఈ ప్రాజక్టులో నీళ్లున్నాయా? ఈ విషయం గురించి ఎపుడైనా చంద్రబాబు  సీరియస్ గా చర్చించారా?

పట్టిసీమను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన  చంద్రబాబు సొంత నియోజకవర్గానికి నీళ్లు తెచ్చే హంద్రీ-నీవా పూర్తి చేసే విషయం ఎందుకు ఆలోచించలేదు?

హంద్రీ-నీవా రాష్ట్రానికే కాదు, చంద్రబాబుకు ప్రతిష్టాత్మకమయిందే. ఎందుకంటే దానికి శంకుస్థాపన చేసిందెవరో కాదు, టిడిపి సంస్థాపకుడు నందమూరి తారక రామారావు. మరి దీనిని ఎందుకు  పూర్తి చేయలేదో చంద్రబాబు చెప్పాలి!

నిజానికి హంద్రీ-నీవా నుంచి కుప్పందాకా నీళ్లు రావాలంటే కర్నూలు అనంతపురం జిల్లాల అవసరాలు తీరాలి. చిత్తూరు జిల్లా దాకా ఈ నీళ్లు రావాలంటే దారి పొడుగునా చాలా ఆవిరవుతాయి. అలా పోగా మిగిలిన నీళ్లు మదనపల్లె, పలమనేరు దాటుకుని కుప్పం కు రావాలి. ఇది సాధ్యమా?  అసలు చిత్తూరు జిల్లాదాకా వచ్చేందుకు నీళ్లుంటాయా? ఉండవు. మరి ప్రత్యామ్నాయ మేమిటి? దీనికి తుంగభద్ర జలాల వినియోగమే మార్గం. దీనిని గురించి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ఎందుకు అలోచించలేదు?

గతం మర్చిపోయి కుప్పానికి నీళ్లు ఎలా తీసుకుపోవాలనే విషయం గురించి చంద్రబాబు, ఇప్పటి ప్రభుత్వం కూడా నిజాయితీ చర్చించాలి. ఎందుకంటే, కుప్పానికి నీళ్లు తీసుకెళ్లడమంటే, చిత్తూరు జిల్లాకు  కృష్ణ లేదా తుంగ భద్ర జలాలు తీసుకురావడమే. ఇందులో సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా మాట్లాడరాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *