‘నీట్’ లో ఆల్ ఇండియా 6వ ర్యాంకుతో మెరిసిన తెనాలి ముద్దుబిడ్డ

తెనాలి చైతన్య సింధుకు జాతీయస్థాయిలో 6వ ర్యాంక్

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET) లో తెనాలి ముద్దుబిడ్డ జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించింది.
తెనాలికి చెందిన గుత్తి చైతన్యసింధు నీట్ లో జాతీయస్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. అత్యున్నత ర్యాంకు సాధన వెనుక చిరంజీవి సింధు అసాధారణ కృషి దాగివుంది.  చిన్ననాటి నుంచే చదువులో చురుకుగా ఉండేది చిన్నారి. తెనాలి పట్టణంలోని వివేకా స్కూల్లో ప్రాథమిక విద్య చదివిన సింధు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కేకేఆర్ గౌతమ్ లో చదివి పదో తరగతిలో 10కి 10 జీపీఏ పొంది ఉత్తీర్ణత సాధించింది.
ఆ తరువాత విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపులో చేరిన సింధు మొదటి నుంచి చక్కటి పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించింది. ఇంటర్లో 985 మార్కులు (10 జీపీఏ) సాధించి చక్కటి ప్రతిభను చాటింది.
వైద్య విద్య చదవాలనే కోర్కె..
చేనేత కుటుంబానికి చెందిన చైతన్య సింధు తాతగారు డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం శస్త్రచికిత్స నిపుణులు. ఆయన ప్రభుత్వ సర్వీసులో కొంతకాలం సుమారు మూడు దశాబ్దాల క్రితం మంగళగిరి ప్రభుత్వాస్పత్రిలో చిరస్మరణీయమైన సేవలు అందించారు.
మంగళగిరి ప్రాంతంలో చేనేత సంఘీయులు అధికసంఖ్యలోనూ, అలాగే చేతివృత్తుల వారు ఎక్కువ. ఈ ప్రాంతవాసులు ఆయన హస్తవాసి మంచిదనే నమ్మకంతో ఆ తర్వాత కాలంలో కూడా ఆయన వద్దనే శస్త్రచికిత్సలు చేయించుకునేవారు. చిన్నారి సింధు తల్లి డాక్టర్ సుధారాణి గైనకాలజిస్టు, తండ్రి డాక్టర్ కోటేశ్వరప్రసాద్ ఈఎన్ టీ వైద్యనిపుణులు.
అలా ఇంట్లోనే ముగ్గురు వైద్యులు ఉండడంతో చిన్నప్పుడే తాను కూడా డాక్టర్ కావాలనే ఆకాంక్ష కలిగిందంటోంది చిన్నారి సింధు. ఆరో తరగతికి వచ్చేవరకు అమ్మ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేసేవారు.
తల్లితండ్రులతో సింధు
“పని ఒత్తిడితో మా (నేను, చెల్లి గౌతమి)తో గడపడానికి సమయం లేకపోవడంతో ఉద్యోగాన్ని వదులుకొని ఇంటి వద్దనే సొంత క్లినిక్ పెట్టారు. 8వ తరగతి చదివేటప్పుడే సైన్స్ పట్ల ఆసక్తి పెరగడంతో మెడిసిన్ చదవాలనే కోర్కెను ఇంట్లో చెప్పినప్పుడూ పెద్దలు కూడా ఆ దిశగా ప్రోత్సహించారు. విజయవాడలో ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉండి చదివాను. నేను ఇంటిమీద బెంగ పెట్టుకోకుండా ప్రతి ఆదివారం అమ్మానాన్న వచ్చేవారు. ఏమైనా సందేహాలు ఉన్నా నివృత్తి చేసేవారు,: అని సింధు తెలిపింది.
సింధు ప్రిపేరయిన పద్ధతి
ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తవ్వగానే ఇంటికి వచ్చేసిన సింధు… ఇంటర్తోపాటే ఓ ప్రణాళిక ప్రకారం ప్రతిరోజూ ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు నీట్ ప్రిపరేషన్ కే ప్రాధాన్యమిచ్చేది. కరోనా నేపథ్యంలోనూ తన లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. ఏపీ ఎంసెట్ ( అగ్రికల్చర్, ఫార్యసీ)లోనూ సింధు తన ప్రతిభను చాటి స్టేట్ టాపర్ గా నిలవడం విశేషం. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నట్లు సింధు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భవిష్యత్తులో సైంటిస్టు కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. సింధుకు మ్యూజిక్ అంటే అమితమైన ఇష్టం. బుక్ రీడింగ్ కూడా. సైన్స్ పుస్తకాలు ఎక్కువగా చదువుతుంది. అలాగే పేదవర్గాలకు ఉచితంగా సేవలందించాలని అనుకుంటున్నచైతన్య సింధు లక్ష్యాలు నెరవేరాలని ఆశిద్దాం.
అభినందనల వెల్లువ
చైతన్యసింధు నీట్ లో జాతీయస్థాయిలో 6వ ర్యాంక్ సాధించడంపై తెనాలి ప్రాంతం మురిసిపోయింది. గంగానమ్మపేటలోని కల్యాణమంటపంలో రోటరీక్లబ్, చైతన్య, వివేకా విద్యాసంస్థల ప్రతినిధులు సింధుతోపాటు తాత డాక్టర్ సుబ్రహ్మణ్యం, తల్లిదండ్రులు డాక్టర్ సుధారాణి, డాక్టర్ కోటేశ్వరప్రసాద్ లను పెద్దఎత్తున సత్కరించి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిరుపమాన ర్యాంక్ సాధించిన  చైతన్యసింధును అమరావతి దేవాంగ సంక్షేమసంఘం ప్రత్యేకంగా అభినందించింది. విజయవాడలోని సింధు మేనత్త నివాసంలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ ప్రతినిధులు కొసనం కోటనాగశ్యామలరావు, మొతికి వీరవెంకట సత్యనారాయణ, అల్లక తాతారావు, ఆనెం మల్లేశ్వరరావు, కొండక వెంకటేశ్వరరావు, అల్లక నమశ్శివాయ, మాన్యం అచ్చియ్య తదితరులు సింధుతోపాటు ఆమె తల్లిదండ్రులను సత్కరించారు. సింధు ప్రతిభను సంఘ ప్రతినిధులు కొనియాడి తమ అభిమానాన్ని చాటుకున్నారు.