ఇక బంగారు లెక్కలు కక్కాల్సిందే, టాక్స్ కట్టాల్సిందే…మోదీ కొత్త నిర్ణయం?

ఇంతవరకు బంగారాన్ని దాచుకోవడమే తప్ప వెల్లడించడం అనేది భారతీయులకు అలవాటు లేదు. ఎపుడో శుభకార్యాలపుడు ఉన్న బంగారాన్నంతా ప్రదర్శించడమే కాని, బంగారు ఎంత ఉందన్నది ప్రతి కుటుంబానికి చిదంబర రహస్యమే.
ఇపుడా పప్పులేమీ ఉడకవు. వొంటి మీద ఉన్న బంగారు, బీరువా, లాకర్లలో ఉన్నబంగారం, తాకట్టులో ఉన్న బంగారు… ఇంకా ఎక్కడెక్కడ బంగారాన్ని దాచారో ఆలెక్కలన్నీ ప్రతి పౌరుడు కక్కాల్సిందేనని కేంద్రం అనబోతున్నది.  మీ బంగారానికి బిల్లులన్నీ ఇపుడే రెడీ చేసుకోండి.
ఏ కుటుంబం ఎంత బంగారు  నిల్వచేసుకోవచ్చో నిర్ణయించి మిగతా బంగారానికి ఇప్పటి రేటుననుసరించి టాక్స్ కట్టించుకునేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది.
నిజానికి ఇది ఇప్పటికే అమలు కావలసి ఉండింది. అయితే, మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీ ఎన్నికల కారణంగావాయిదా పడింది. మహా అంటే మరొక నెలా రెన్నెళ్లు…  మీ దగ్గిరున్న బంగారం అక్షరాల ఎంతవుందో ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకి చెప్పాల్సి రావచ్చు… కాచుకోండి.
వివరాలివిగో…
ఈ సారి బంగారంగా మారిపోతున్న నల్లధనాన్ని పట్టుకోవాలని,  మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా బంగారు లెక్కలు బయటపెట్టాలని తొందర్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయవచ్చన్న వార్త లీకయింది. అంతే దేశమంతా గగ్గోలు.
 ఈ మధ్య అంతర్జాతీయంగా అందరి కళ్లు బంగారు మీద పడుతున్నాయి. డబ్బు దాచుకునేందుకు బంగారు సురక్షితమయిన మార్గంగా అంతా గుర్తించారు.బ్యాంకులలో దాచుకోవడం మానేసి బంగారు కొంటున్నారు. అందువల్ల నల్లధనం బంగారుగా మారిపోయి తప్పించుకోవాలనుకుంటున్నట్లు కేంద్రం పసిగట్టింది.
అందుకే దాచుకునే బంగారానికి కూడా ఒక పరిమితి విధించి, మిగిలిన బంగారాన్నంత స్వచ్ఛందగా వెళ్లడించే ఆమ్మెస్టీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది.
పరిమితికి మించి ఉన్న బంగారం మీద మొత్తం బంగారు విలువ ప్రకారం ఇన్ కమ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ప్రజలు స్వచ్ఛందగా తాము నల్లదనం ఉపయోగించి కొన్నబంగారమెంతో వెల్లడించాల్సి ఉంటుంది. అదే విధంగా దానికి టాక్స్ కట్టాల్సి ఉంటుంది.
దీనికోసం స్వచ్ఛంద ప్రకటన (ఆమ్నెస్టీ ) పథకం ప్రకటిస్తున్నారు. వెల్లడించేందుకు కొంత గడువు ఇస్తారు.
ఈ పథకం కింద  బిల్లులేని  బంగారం మీద ఎంత టాక్స్ విధిస్తారో ఇక స్పష్టత లేకపోయినా, ఎజుకేషన్ సెస్ తో కలిపి ఇది 30 నుంచి 30 శాతం దాకా ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.
రెండుసంవత్సారాల కిందట నీతి ఆయోగ్ చేసిన సూచనల మేరకు ఈ గోల్డ్ ఆమ్నెస్టీ పథకం ప్రవేశపెడుతున్నారు.
2016 నవంబర్‌ 8వ తేదీ రాత్రి రూ.1,000, 500 నోట్లు ఇక చెల్లబోవని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసింది. ఇది నల్లదనం నిర్మూలనకోసమని ఆయన చెప్పారు.
అయితే, ఈ ఆశయం నెరవేరలేదని తెలిసిపోయింది. ఇపుడు నల్లదనం బంగారు రూపంలోకి మారుతూ ఉందని ప్రభుత్వం దగ్గిర సమాచారం ఉంది.
అందుకని ఈ బంగారం లెక్కలు బయటపెట్టాలని ప్రభుత్వం ఒక నెలరోజులలో ప్రకటించవచ్చని చెబుతున్నారు.
ఒక గడువు తర్వాత , అధికారులు అనుమానితుల ఇళ్ల మీద దాడులు జరిపి ఎంత బంగారం ఉందో కనుక్కుని దానికి సరైన బిల్లులు లేకపోతే అది నల్లధనంగా ప్రకటించి చట్టపరమయిన క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. దాడుల్లో దొరికిన బంగారానికి లెక్కలుచూపాల్సి ఉంటుంది.
ఒక సారి తమ దగ్గిర ఉన్న బంగారం ఎంతో వెల్లడించాక ఇక అధికారల వేధింపులు మొదలవుతాయనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది.
బంగారాన్ని వెల్లడించడం చాలా కష్టం. చాలా ఇళ్లలో బంగారం వంశపారంపర్యంగా వస్తూఉంటుంది.దీనికి ఎలాంటి లెక్కలు ఉండవు. కాయితాలూ ఉండవు. ఇలాంటపుడు ఒక కుటుంబం ఎంత బంగారు నిల్వ వుంచుకోవచ్చో చెప్పి, ఆపైదానికి టాక్స్ కట్టాలనడం సబబా.
ఎందుకంటే,  చాలా సందర్బాలలో బంగారం   నల్లదనం తో కొన్నది కాదు, పూర్వీకులనుంచి వచ్చినది.
ఇలా పూర్వీకుల నుంచి వచ్చిన బంగారు నిజంగా దాచుకున్నవారు ఇబ్బందుల పాలవుతారు.  నాడు బంగారు చౌకగా లభించేది. దానికి ఇప్పటి వెల కట్టి టాక్స్ కట్టమంటే ఎలా అని చాలా మంది ప్రశ్నించడం మొదలుపెట్టారు.
ప్రస్తుతం భారతీయుల వద్ద దాదాపు 20 వేల టన్నుల దాకా బంగారు నిల్వలున్నాయి. ఇక లెక్కలేని బంగారును కూడా తీసుకుంటే ఇది 25 వేల నుంచి 30 వేల టన్నుల దాకా ఉంటుందని అంచనా. దీని విలువ ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్లనుంచి 1.5 ట్రిలియన్ డాలర్లు దాకా ఉండవచ్చని చెబుతున్నారు.
.