Home Breaking రాజధాని తరలింపుకి విశాఖ ఎన్నికలకు లింకు ఉందా?

రాజధాని తరలింపుకి విశాఖ ఎన్నికలకు లింకు ఉందా?

343
0

గ్రేటర్ విశాఖ పట్టణం మునిసిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)  ఎన్నికలల్లో గెలిచేందుకు అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి.

ఇక్కడ అఖండ విజయం సాధించేందుకు రెండు పార్టీలు శక్తినంతా కూడగట్టుకుంటున్నాయి. వైసిపి తరఫున రాజ్యసభ్యుడు విజయసాయి రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు  క్యాంపెయిన్ చేస్తున్నారు.

తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు రెండు రోజుల సుడిగాలి పర్యటనలో ఉన్నారు. శుక్రవారం నాడు, స్థానికుల నాయకులతో సమావేశంతో పాటు ఒక దఫా ప్రచారం ముగిసింది.

శనివారం రెండో విడత ఆయన నగరంలోని గాజువాక జంక్షన్ నుంచి రోడ్ షోలు ప్రారంభిస్తున్నారు.  మధ్యాహ్నం టిడిపి కార్యాలయంలొనే ఉండి జివిఎంసి ఎన్నికల్లో పార్టీని గెలుపుకోసం చర్చలు సాగిస్తారు. సాయంకాలం అయిదున్నర నుంచి ప్రచారం మొదలు. సీతమ్మధార సభలో ప్రసంగిస్తారు. అనేక ప్రాంతాలలో రోడ్ షో నిర్వహించి సాయంత్రం 8 గంటలకు న పిఎం పాలెంలో మరొక సభలో ప్రసంగిస్తారు.

ఒక మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇంత ఉధృతంగా ప్రచారం చేయడం ఇదే మొదటి సారి.

ఇక రూలింగ్ పార్టీ కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్నది. అన్ని రకాల వనరులను సమకూర్చుకుని గెలిచేందుకు ప్రయతనిస్తూ ఉంది.

చంద్రబాబుని ఉత్తరాంధ్ర ద్రోహిగా, ముఖ్యంగా విశాఖ ద్రోహిగా చిత్రించేందుకు చాలా ప్రయత్నం జరుగుతున్నది.  ఇదే విధంగా ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఆప్తుడిగా చూపిస్తున్నారు. ఎందుకంటే, విశాఖ పట్టణం తొందర్లోనే కార్యనిర్వాహక రాజధాని అవుతుందని, ఈ ఎన్నికల్లో  వైసిసి మేయర్ అయితే, రాజధాని తరలింపు తొందరగా జరుగుతుందని ఆశపెడుతున్నారు

ఇంత ఉధృత ప్రచారం ఎందుకు?

ముఖ్యమంత్రి జగన్ రాజధాని తరలింపు విషయంలో పట్టింపుగా ఉన్నారు. ఉగాది నుంచి లేదా కనీసం మే మొదటి వారం నుంచి ఆయన విశాఖలోనే మకాం వేస్తారని చెబుతున్నారు.  రాజధాని తరలింపు వ్యవహారం కోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. దీనితో తన  కార్యాలయాన్ని విశాఖకు మార్చుకుని, అక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ  అధికారులంతా విశాఖలోనే మకాం వేసేలా చేసి నగరంలో రాజధాని  నీడలు కనిపించేలా చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.  ఈ  ‘తరలింపు’ వేగిరం చేసేందుకు జివిఎంసి ఎన్నికల్లో గెలవడం పనికొస్తుందని ఆయన భావిస్తున్నారని తెలిసింది.

ఈ ఎన్నికల్లో వైసిపి గెలిస్తే విశాఖ ప్రజలు రాజధాని తరలింపు కోరుతూ తీర్పు ఇచ్చారని చెప్పవచ్చు.  అందుకే ఆయన  ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులందరిని విశాఖ నుంచి కదలకుండా  ప్రచారం చేయమని చెబుతున్నారు. విజయసాయి రెడ్డితో పాటు మంత్రులు బోత్సా సత్యానారాయణ, అవంతి శ్రీనివాస్ లకు గెలిపించే బాధ్యతను అప్పగించారు. ఈ విషయం చాలా కఠినంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇది ప్రతిష్టాత్మకమయిన ఎన్నికని చెబుతూ వనరులన్నింటిని సమీకరించుకుని గెలుపు వార్తతోనే తాడేపల్లి రావాలని ఆయన సూచించినట్లు కొందరు చెబుతున్నారు.

నిజానికి జివిఎంసి ఎన్నికల్లో విజయాన్ని విశాఖ ప్రజలు  వైసిపికి హారతి  పళ్లెంలో పెట్టి అందివ్వాలి. పరిస్థితి అలా లేదని అక్కడ వైసిసి ప్రచార ఉధృతి చూస్తే అర్థమవుతుంది. విశాఖకు రాజధాని తెస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. దీనితో అక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ మార్పుతో ప్రజలు వైసిపికి, జగన్ కు నీరాజనాలు పట్టే పరిస్థితి రావాలి.  రోడ్ల మీద పరిస్థితి అలా కనిపించడం లేదు.

ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, అక్కడ గెలవడం వల్ల పార్టీ నైతికంగా బలపడుతుంది.

ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ  విశాఖ రాజధానికి వ్యతిరేకమని, విశాఖ ద్రోహి అని వైసిసి విమర్శిస్తూ ఉంది కాబట్టి ఈ విమర్శనుంచి బయటపడాలి. అక్కడ గెలిచినందున, విశాఖ ను రాజధాని చేస్తానని చెప్పినా ప్రజలు ముఖ్యమంత్రి జగన్ ని నమ్మడం లేదని, జగన్ ని, ఆయన పార్టీని తిరస్కరించారని చెప్పవచ్చు.

అంతేకాదు, రాజధాని హామీని కూడా విస్మరించి  టిడిపికి వోటేస్తే, పరోక్షంగా రాజధానిని తరలించేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవచ్చు.

అందువల్ల విశాఖలో టిడిపి గెలవడం చంద్రబాబు నాయుడికి చాలా చాలా అవసరం.

విశాఖ ఎన్నికల్లో శక్తినంతా  కూడదీసుకుని స్వయంగా వీధి వీధి తిరిగి ప్రచారం చంద్రబాబు ప్రచారం చేయడం వెనక రహస్యం ఇదే. లేకుంటే  14  సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండిన వ్యక్తి, ప్రధానులను నియమించి ‘కింగ్ మేకర్’ అనిపించుకున్న చంద్రబాబు నాయుడు మునిసిపల్ ఎన్నికల్లో చెమటలు కక్కుతూ ప్రచారం చేయడమేమిటి?

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here