కరోనాతో నష్టపోయిన ప్రజలపై భారమా, ఎల్ఆర్ఎస్ రద్దుకు పోరాటం: బండి సంజయ్ పిలుపు

 

కరోనా విలయంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో… ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టడం అత్యంత దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి కొందరు, వ్యాపారాలు నడవక మరికొందరు తీవ్ర అవస్థల మధ్య జీవనాన్ని నెట్టుకొస్తున్నారని ప్రభుత్వానికి తెలియదా అని ఆయనప్రశ్నించారు.
కేవలం కనీన అవసరాలు తీర్చుకుంటూ బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని,  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ ను తెరపైకి తీసుకురావడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
ఎల్ఆర్ఎస్ ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట చేపట్టిన ఆందోళనలు విజయవంతమయ్యాయని తెలిపారు.
ప్రభుత్వం పోలీసుల్ని ఉపయోగించి నిర్బంధాలు, అరెస్టులకు పాల్పడినా బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆందోళనలు చేపట్టారని తెలిపారు.
నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజలు ఎల్ఆర్ఎస్ పట్ల తమ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరిచారని బండి సంజయ్ అన్నారు. కరోనా కష్టకాలంలో బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం, పేద ప్రజల నడ్డి విరిచేలా ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టడం సరికాదని మండిపడ్డారు.
జనంపై భారం మోపుతూ ఖజానా నింపుకోవాలన్న ప్రభుత్వ ఆలోచన దారుణమని ఆయన విమర్శించారు.
 ఇంత ఘోరమా?

ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ లో ప్రభుత్వం పెట్టిన నిబంధనలు చూస్తే ఇంత ఘోరమా అనిపిస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు.

గతంలో పదిసార్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా… మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే అని నిబంధన పెట్టడం అర్థరహితమని విమర్శలు గుప్పించారు.
పాలనా వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న కేసీఆర్ సర్కారు… ఎలాగైనా ఖజానా నింపుకోవాలన్న ఆలోచనతోనే ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టిందని అన్నారు.
ప్రభుత్వం పెట్టిన అర్థరహిత నిబంధనలే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. నిజాం పాలనలోనూ కొత్తకొత్త పన్నులు విధిస్తూ ప్రజల్ని పీడించారని బండి సంజయ్ గుర్తుచేశారు.
ఆనాడు ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో.కేసీఆర్ సర్కారుపైనా ప్రజలు అదే విధంగా తిరుగుబాటు చేసే పరిస్థితులు వస్తాయని సంజయ్ హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ పై వ్యక్తమవుతున్న ఆందోళనల తీవ్రత చూస్తుంటే… మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారనే విషయం స్పష్టమవుతోందని ఓ ప్రకటనలో అన్నారు.
ఎల్ఆర్ఎస్ పేరిట జేబులు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఎల్ఆర్ఎస్ ను ఉపసంహరించుకునే వరకు బీజేపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.