ఆంధ్రలో దొడ్డిదారిన కరెంటు భారం మోపుతున్నారు, ఇది దారుణం!: కన్నా

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చార్జీ లు పెంచకుండా స్లాబులు మార్చి  పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు వసూలు చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
తాము బిల్లు పెంచలేని బుకాయించడాన్ని ఖండిస్తూ ఈ సాకుతో దొడ్డి దారిన స్లాబులు పెంచి ప్రజల మీద మోపడు కరెంటు బిల్లు భారం మోపారని, దీనిని బిజెపి వ్యతిరేకిస్తుందని, పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వెల్లడించారు.
 ప్రజలంతా కరోనావైరస్ లాక్ డౌన్ లో ఇళ్లకే పరిమితమయి బయట తిరగలేని పరిస్థితి ఉంటే గుట్టు చప్పుడుకాకుండా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమని  కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు.
ఈ రోజు ఒక నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమత్రి జగన్ పై  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూరెండు, మూడు రెట్లు అధికంగా బిల్లులు ఎలా  పంపిస్తారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కరోనా కారణంగా ప్రజలందరూ ఎంతో ఇబ్బందిపడుతున్నారని మీకు తెలియదా?  ఇలాంటి సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడం దారుణంకాదా, అని  ఆయన ప్రశ్నించారు.
ప్రజల పట్ల జగన్ ప్రభుత్వానకి  చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.
‘ప్రజలు ఇళ్లలో ఉంటే సహజంగానే  విద్యుత్ వాడకం కొద్దిగా పెరుగుతుంది.  కానీ గతంలో కంటే రెండు, మూడు రెట్లు అధికంగా బిల్లులు రావడం ఏమిటి? ఈ విధానం బిజెపికి ఆమోదయోగ్యం కాదు.  మార్చి నెలలో నేను రూ.11 వేల మేర విద్యుత్ బిల్లు చెల్లించాను. ఈ నెలలో బిల్లు రూ.20 వేలు దాటింది, ’ అని కన్నా అన్నారు.
ఇది విద్యుత్ చార్జీలు పెంచడం కాక మరేమిటి? ఎంతో తెలివిగా విద్యుత్ స్లాబులు మార్చిన, అధిక మొత్తాలు వసూలు చేసి, చార్జీలు మాత్రం పెంచలేదని చెప్పుకోవడం పట్ల ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు.