Home Breaking అలుపెరుగని బీహార్ భగీరథుడు అతడు…

అలుపెరుగని బీహార్ భగీరథుడు అతడు…

134
0
Lungi Bhuiyan(credits Twitter/ANI)
(చందమూరి నరసింహారెడ్డి)
గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం కచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ ఉండకూడదు అప్పుడే విజయం లభిస్తుంది. విజయానికి ఏ బలహీనత అడ్డు కాదన్నట్లు పోరాడు ఎంతటి కఠినమైనా , క్లిష్టమైనా గమ్యాన్ని చేరుకోవచ్చు అని నిరూపించారు . ఓనిరుపేద 30 ఏళ్లు గా అలుపెరగని కృషి చేసి 3 కిలోమీటర్ల కాలువ తవ్వి పాలకులకు కళ్ళు తెరిపించారు లంగీభుయాన్ (Lungi Bhuiyan). బీహార్ రాష్ట్రంలోని గయా  జిల్లా కొతిలావా గ్రామ వాసి అయన.
అతను కొండను జయించాడు
గతంలో బీహార్ కే చెందిన మరొక కూలీ గెహ్లోర్ గ్రామానికి రోడ్ నిర్మించి చరిత్ర సృష్టించారు. 22 ఏళ్ల పాటు శ్ర‌మించి ఓ సామాన్య భూమిలేని నిరుపేద కూలి 360 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడ‌ల్పుతో కొండ‌ను నిట్ట నిలువుగా చీల్చాడు. అతని పేరు ద‌శ‌ర‌థ్ మాంఝీ. ఆయన ఉపయోగించిందంతా ఒకసుత్తి, ఒక ఉలిమాత్రమే.
ఇప్పుడు వ‌జీర్ గంజ్‌లో ఉన్న హాస్పిట‌ల్స్‌కు, స్కూల్స్ కు చేరాలంటే కేవ‌లం ఐదు కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తే స‌రిపోతుంది. ఆ చుట్టుప‌క్క‌ల‌ ఉన్న 60 గ్రామాల ప్ర‌జలు ఆ మార్గాన్ని ఉప‌యోగించుకుంటున్నారు. రోడ్డు వేసేందుకు కొండను తవ్వడం మొదలుపెట్టినపుడు అంతా ఆయన్ను పిచ్చోడిలా చూసి నవ్వారు. మాంఝీ కి కూడా రోడ్డు ఆలోచన వ్యక్తిగత విషాదం నుంచేవచ్చింది. మాంఝీ భార్య ఫల్గుణీ దేవి  1959లో జబ్బుపడింది. ఆమెను 70 కిమీ దూరాన ఉన్నపట్టణానికి తీసుకువెళ్లాలంటే రోడ్డు లేదు. సకాలంలో వైద్యం అందక ఆమె మరణించింది. ఈ వేదన నుంచే వూరికొక రోడ్డు అవసరమనే ఆలోచన పుట్టింది.1960  నుంచి 1982 దాకా పగలు రాత్రి శ్రమించి కొండను చీల్చి మాంజీ దారి వేశాడు.2007 ఆగస్టు 17న మాంఝీ చనిపోయాడు.

 ఇతను అడవిని జయించాడు
నాడు మాంజీ రహదారి నిర్మిస్తే నేడు పంట పొలాలకు నీటి తరలించడానికి కాలువ తొవ్వాడు మరొక కూలీ. తన గ్రామంలో ఉన్న పంట పొలాలు బీడు భూమి కాకుండా పచ్చని పంటలతో కళకళలాడుతూ అందరూ అనందంగా జీవనం సాగించాలని తలచాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం సాగించాడు విజయం సాధించాడు.
బీహార్‌లోని గయాకు 80 కిమీ దూరానా లాథువా ప్రాంతంలో కొతిలావా గ్రామం ఉంటుంది. పర్వతాలు, అడవుల ల్లో ఉండే ఈ గ్రామం మావోయిస్టుల స్థావరం. వ్యవసాయం తప్ప మరొక జీవనాధారం లేని గ్రామం. ఇక్కడి ప్రజలు క్రమంగా ఉపాధి వెదుక్కుంటూ పట్టణాలు వలసపోయినా లుంగీ భూయాన్ మాత్రం గ్రామంలో ఉండే తన మహాసంకల్పం మొదలుపెట్టాడు.

ఆలోచన ఎలా వచ్చింది
భూయాన్ పశువులను కాసుకుంటూ రోజు అడవుల్లోకి, కొండల్లోకి వెళ్లాడు. వర్షాకాలంలో వర్షపునీరు కొండల నుంచి దూకి దూరాన ఉన్ననదిలోకి పారడం చూశాడు. అపుడు ఈయన, ఈ నీళ్లని గ్రామం వైపు మళ్లిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అంతే,  30 ఏళ్లు కష్టపడి, కొండను తవ్వి కాలువను ఏర్పాటు చేశాడు. తన గ్రామంలోని పంట పొలాలకు నీటిని మళ్లించటం కోసం 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు. ఈ కాలువ నుంచి నీటిని గ్రామంలోని కుంటలోకి వెళ్లేలా ఏర్పాటు చేశాడు. కుంట నుంచి నీరు పంటపొలాలకు చేరుతోంది.
తనకున్న పశువులను నిత్యం మేతకు తీసుకెళ్లే భుయాన్‌ అవి మేసే సమయంలో కాలువను తవ్వడం ప్రారంభించారు. ఓక్కడే అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించారు .  ఆయన ఎవరీ సాయం తీసుకోలేదు, ఎవరూ ఆయనతో భజం భుజం కలపలేదు.
ఈ కాలువ పూర్తయ్యాక వందలాది పశువులకు తాగునీరు, పొలాలకు సాగునీరు అందేలా చేశారు. తను కన్న కలలన్నీ సహకారం చేసుకున్నారు ఈయన పట్టుదలను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటివారిని గుర్తించి ప్రభుత్వం సత్కరించాల్సిన అవసరం ఉంది.
Chandamuri Narasimhareddy

చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు గ్రామీణ జర్నలిజం అవార్డు గ్రహీత)