వైఎస్ వివేకా హత్య కేసుని సిబిఐ కి అప్పగించిన హైకోర్టు

ఒక నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్యకేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐ దర్యాప్తునకు అప్పగించింది.
వివేకానంద హత్య మీద  సిట్ నిర్వహించిన దర్యాప్తు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కోర్టు కు అప్పగించింది.అయితే, ఈ హత్యలో సిబిఐ దర్యాప్తు అవసరం లేదని తొలినుంచి రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ వస్తున్నది.
అయితే, ఈ వాదనను కోర్టు కొట్టి వేసింది. పిటిషనర్లు వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత వేసిన పిటిషన్ల మీద నేడు తీర్పు ఇస్తూ వారు కోరినట్లుగా సిబిఐ దర్యాప్తుకు అంగీకరిస్తూ తీర్పు చెప్పింది.
2019 మార్చి 15 అసెంబ్లీ ఎన్నికల ముందు పులివెందుల నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యు గురయ్యారు. కత్తి దాడి చేసి ఆయనను దారుణంగా హత్య చేశారు. ఇది హత్యేనని ఫోరెన్సిక్ పరీక్షలో తేలింది.
ఈ హత్య ఎవరు చేశారో కనుగొనేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్ ) ఏర్పాటు చేశారు. ఈహత్య అనుమానితులలో శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ హత్య మీద సిబిఐ దర్యాప్తు జరగాలని మాజీ మంత్రి సి అదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బిటెక్ రవి కూడా పిటిషన్లు వేశారు. అయితే, ఈ హత్య మీద సిట్ దర్యాప్తు సాగుతున్నందున సిబిఐ దర్యాప్తు అవసరంలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఈరోజు హైకోర్టు తీర్పు దీనికి భిన్నంగా సిబిఐ దర్యాప్తు అవసరమని భావించింది.