సుప్రీం కోర్టుకు చేరిన ఆంధ్ర ‘పంచాయతీ’

ఆంధ్రప్రదేశ్  స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తీసుకున్న  నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.
కరొనా వైరస్ వ్యాపించే ప్రమాదం ముందని దేశమంతా ఎక్కడా ఎక్కువ మంది గుమికూడ కుండా జాగ్రత్త తీసుకుంటున్నందున, పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని చెబుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేసింది.
దీనిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గిర నుంచి అధికార వైసిపి నేతల దాకా యుద్ధం ప్రకిటించారు. కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద దాడి ప్రారంభించారు. కుల పక్షపాతంతో, ప్రతిపక్ష పార్టీనేత చంద్రబాబు నాయుడికి అనుకూలంగా రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి స్వయంగా ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వాపసుతీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికూడా కమిషనర్ కు లేఖ రాశారు. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాలలో కమిషన్ నిర్ణయాన్నిసవాల్ చేస్తున్నది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు, హైకోర్టులలో రాష్ట్రప్రభుత్వం పిటిషన్లు దాఖలుచేసింది.
రాష్ట్రంలోనిపంచాయతీలకు, మునిసిపాలిటీలకు ఎన్నికల ప్రక్రియను  కమిషన్ గతంలో విడుదలచేసిన నోటిపికేషన్ ప్రకారం యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది.
ఇలాగే కొరొనావైరస్ పేరుతో  ఎన్నికలను వాయిదా వేస్తూ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలనియకూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎన్నికల కమిషన్  రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని  ప్రభుత్వం వాదించింది.
ఈ పిటిషన్‌ న్యాయస్థానం మంగళవారం విచారణకు రానుంది.  జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు రానుంది.
మరోవైపు ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ హైకోర్టు విచారణకు స్వీకరించింది.