నూతన రథంతో అంతర్వేది ఉత్సవం

* నూత‌న ర‌థంలో ఉత్స‌వ‌మూర్తుల ఊరేగింపు

తూర్పు గోదావ‌రి జిల్లా అంతర్వేది  ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ర‌థోత్స‌వం ముగిసింది. మంగళవారం మద్యాహ్నం భీష్మ ఏకాదశి పర్వదినాన సఖినేటిపల్లి, అంతర్వేది గ్రామంలో నూతన రథంపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవం కన్నుల పండువ‌గా జరిగింది. కాలిపోయిన పాత  రథం స్థానంలోొ కొత్త రథం నిర్మించాక జరిగిన తొలి ఉత్సవం ఇదే.  ఈ నెల 19 వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త రథాన్ని ప్రారంభించారు.

ఈ రోజు తొలుత ప్రధానాలయం నుండి అర్చకులు, వేదపండితుల మంత్రోఛ్చారణ న‌డుమ లక్ష్మీ నరశింహస్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో మోసుకొచ్చి రథంపైకి చేర్చారు.

ఆలయ వ్యవస్థాపకుల కుటుంబ సభ్యులు రాజా కలిదిండి కుమార రామ గోపాలరాజా బహద్దూర్, రాజోలు శాసన సభ్యులు రాపాక వరప్రసాదరావు, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్, ఇతర ప్రముఖులు 3-30 గం.ల ప్రాంతంలో కొబ్బరికాయలు కొట్టి, సాంప్రదాయ పూజలతో రథయాత్రను ప్రారంభించారు.

వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్త సందోహం పెద్ద ఎత్తున చేసిన గోవింద నామస్మరణ మధ్య స్వామివారి దివ్య రథయాత్ర మాడ వీధులలో అత్యంత వైభవోపేతంగా సాగింది. రథ యాత్ర సందర్భంగా అంతర్వేది వీధులు జన సంద్రంగా మారాయి.

మార్గ మధ్యంలో ఇంటి ఆడపడుచు గుర్రాలక్కకు చీర, సారె పెట్టేందుకు అమ్మవారితో కలిసి రథంపై సాగుతున్న లక్ష్మీనరశింహుని చూసి ప్రజలు భక్తి పారవశ్యంతో పులకించారు. స్వామి తరపున చీర, సారెను ఆలయ ప్రథానార్చకులు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు గుర్రాలక్కకు సమర్పించారు.

41 అడుగుల ఎత్తున, ఏడు అంతస్తులతో, సప్తవర్ణ శోభితంగా, పుష్పాలంకరణతో స్వామి దివ్య రథం వడివడిగా కదులుతూ యాత్ర నయనానందకరగా సాగింది. వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించిన లక్ష్మీ నరశింహస్వామి తిరు కళ్యాణోత్సవం, రథయాత్రలు  ప్రశాంతంగా జరిగాయి.

వాహనోత్సవాలు, చక్రస్నానం తదితర వేడుక‌లు అనంతరం ఈ నెల 28న వార్షిక దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు ముగియనున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *