ఆంధ్రా ప్రముఖుల ఇళ్లపై ఐటి దాడి, రు. 2000 కోట్ల అక్రమసొమ్ము

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పూణే నగరాల్లో ఆదాయపన్ను శాఖ ఇటీవల తెలుగురాష్ట్రాల ప్రముఖుల ఇళ్ల దాడులు జరిపింది. ఇందులో రు. 2000 కోట్ల అక్రమ డబ్బు కనిపించిందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.
ఫిబ్రవరి ఆరోతేదీన హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖ, ఢిల్లీ, పుణే వంటి నగరాలలో మొత్తం 40 ఆవరణలలో ఐటి అధికారులు దాడులు జరిపారు. ఇందులో కొంతమంది  ఒక రాజకీయ ప్రముఖుని సహచరులని, వారిలో ఒక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి కూడా ఉన్నారని ఐటి శాఖ వెల్లడించింది. తెలుగు రాజకీయాల కనీస జ్ఞానం ఉన్న వారెవరికైనా  ఇదెవరో అర్థమయ్యేలా సరళమయిన భాషలో ఇన్ కమ్ టాక్స్ డిపార్టు మెంటు బయటపెటింది.
ఇన్ కమ్ టాక్స్ శాఖజరిపిన దాడులలో మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి. బోగస్ సబ్ కాంట్రాక్టుల వ్యవస్థ , వోవర్ ఇన్వాయింసింగ్, బోగసు బిల్లింగ్ ల అక్రమాల  పుట్ట  ఈ దాడులలో తమకు కనిపించిందిన ఐటి శాఖ తెలిపింది.
అనేక అక్రమాలకు సంబంధించిన పత్రాలు,విడి కాగితాలు కూడా దొరికాయి. ఒక రాజకీయ ప్రముఖుని మాజీ పర్సనల్ సెక్రెటరీ ఇంటి మీద కూడా తాము దాడులు జరిపినట్లు ఈ ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ వ్యక్తి ఇంటి మీద జరిపిన దాడిలో కూడా అక్రమాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు దొరికాయని ఇన్ కమ్ టాక్స్ కమిషనర్ సురభి అహ్లూవాలియా పేరు మీద విడుదలయిన ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
సుమారు రు. 2000 కోట్లు లెక్కతేలని మొత్తం కనిపించిందని, ఈ డబ్బులు చేతులు మారిన వరసలో చివర్లో రు. 2 కోట్ల పెట్టుబడి మించని కంపెనీలు కూడా ఉన్నాయని, తీరాచూస్తే అవన్నీ కూడా రిజస్టర్డు అడ్రసులో లేకపోవడమో బోగస్ కంపెనీలో అని తమకు తెలిసిందని ఐటి శాఖ పేర్కొంది.
టాక్స్ తప్పించుకునేందుకు వారు ఈ విధానం అవలంభించారని ఐటి శాఖ అనుమానిస్తున్నది. ఈ దాడులలో లెక్కలు లేని మరొక రు. 85 లక్షల నగదు, రు. 71 లక్షల విలువయిన అభరణాలు ఉన్నాయని ఈ శాఖ చెప్పింది. మొత్తంగా అధికారులు 25 బ్యాంక్ లాకర్స్ స్వాదీనం చేసుకున్నారు.