25 జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం, నిజమౌతున్న జగన్ ఇచ్ఛాపురం వాగ్దానం

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్‌వ్యవస్థీకరించాలని రాష్ట్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా అమోదించింది. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయిన క్యాబినెట్ రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అయితే, ముందుగా ఈ ప్రతిపాదనను క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ ని ఏర్పాటుచేయాలని క్యాబినెట్ తీర్మానించింది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలున్నాయి. వీటినుంచి మరొక 12 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారు.
జగన్ ఇచ్ఛాపురం వాగ్దానం
పరిపాలనను మెరగుపర్చడం, ప్రజలకు మరింత చేరువ చేయడంకోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను 15 జిల్లాలు పునర్వ్యవస్థీకరిస్తాను, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన  పాదయాత్ర లో ప్రకటించారు (పై ఫోటో).  2019 జనవరి 9 వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాఫురంలో ప్రకటించారు. ఆరోజు  ఇచ్చాపురంలో ఆయన 3,648 కిమీ,  341 రోజుల పాదయాత్ర ‘ప్రజాసంకల్పయాత్ర’ ముగిసింది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన చేసిన రెండు వాగ్ధాలలో కొత్త జిల్లాల ఏర్పాటు ఒకటి. రెండోది నవరత్నాలను అమలు చేయడం.
‘ప్రజల ఆశీస్సులతో  మా పార్టీ అధికారంలోకి వస్తే  పరిపాలన వికేంద్రీకరణకు, పాలనాయంత్రాంగ వికేంద్రీకరణకు చాలా ప్రాముఖ్యం ఇవ్వడం జరగుతుంది. దీని వల్ల ప్రభుత్వం  చేపట్టే సంక్షేమపథకాలు  అన్ని వర్గాలకు సకాలంలో సరిగ్గా అందుబాటవుతాయి,’అని జగన్ చెప్పారు.
‘ఇపుడున్న 13 జిల్లాలు 25 జిల్లాలయితే,పరిపాలన పారదర్శకంగా ఉంటుంది.సులభతరమవుతుంది. గ్రామ సెక్రెటేరియట్ ల ఏర్పాటయ్యాక, వాటిని కేంద్రంగా చేసుకునే నవరత్నాలు పథకాలనుఅమలుచేయడం జరుగుతుంది. రాజకీయ, సామాజిక కారణాలు చూడకండా అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమం అందిస్తాం.’ అని జగన్ ఇచ్చాపురం లో చెప్పారు
చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ
కమిటీకి  చీఫ్‌ సెక్రటరీ నేతృత్వం  వహిస్తారు.  సభ్యులుగా సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. వీలైనంత త్వరలో కమిటీ నివేదిక ఇవ్వాలనిక్యాబినెట్ కోరింది.
జిల్లాల ఏర్పాటులో ఖర్చును నియంత్రించడంతో కొత్త జిల్లాల ఏర్పాటులో ఎదరయ్యే అన్ని రకాల సమస్యను ఈ కమిటీ  అధ్యయనం చేస్తుంది.
మానవవనరులను వీలైనంత సమర్థవంతగా వినియోగించుకోవడం, మౌళికసదుపాయాలను వినియోగించుకోవడం  జిల్లాల పునర్వ్యవస్థీకరణ  ఉద్దేశం. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు నేపథ్యంలో ఈ పునర్‌వ్యవస్థీకరణ అవసరమని  మంత్రివర్గం భావించింది.
ప్రస్తుతం జిల్లాలు పెద్దవిగా ఉండడంతోపాటు, జనాభాకూడా అధికంగా ఉండడం వల్ల సమర్థవంతమయిన పరిపాలన అందించేందుకు పునర్వ్యవస్థీకరణ ఒక మార్గమని క్యాబినెట్ భావించింది.
పాలనా సౌలభ్యంతోపాటు, ప్రజలకు వీలైనంత చేరువగా పరిపానలను తీసుకువెళ్లేంందుకు పునర్వ్యవస్థీకరణ దోహదపడుతుందని క్యాబినెట్ భావించింది.

Like this story?Please share it with a friend!