నేను కోలుకున్నా… మనోధైర్యమే మందు: కోవిడ్ నుంచి కోలుకున్న జర్నలిస్టు భరోసా

 కరోనా పాజిటివ్ అని తేలాకా తత్తరపాటు పడకుండా నిబ్బరంగా,నిదానంగా కోవిడ్ కేర్ సెంటర్ కు పోయి, అన్ని జాగ్రత్తలు పాటించి,వారంరోజుల్లోనే ‘నెగటివ్’ అయిపోయి, ఆపైన ఉల్లాసంగా తిరిగొచ్చిన  జర్నలిస్టు ఎబి భార్గవ అనుభవం ఇది. ఆయన పశ్చిమగోదావరి జిల్లా ఐ న్యూస్ ప్రతినిధి. ఇపుడుహోం  క్వారంటైన్ నుంచి బార్గవ పంచుకుంటున్న అనుభవం.

 

‘మిత్రులారా, నేను కోలుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నా.. జర్నలిస్టుగా విధి నిర్వహణలో భాగంగా ఏ సమయంలో అయినా కరోనా సోకవచ్చని తెలిసినా మనం గుండె ధైర్యంతో పని చేస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో నాకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా, పాజిటివ్ రావడంతో వెంటనే అప్రమత్తమై, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, నేరుగా స్వయంగా కోవిడ్ కేర్ కు వెళ్ళాను.
‘విషయం తెలిసిన వెంటనే మన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారు, నాని గారి పిఆర్వో, మన మీడియా ఆత్మీయులు మాణిక్యరావు గారు, మన మీడియా మిత్రులు స్పందించి, నాకు భరోసా ఇచ్చి, కోవిడ్ కేర్ కు అవసరమైన అన్ని చర్యలు తీసుకుని అనునిత్యం యోగ క్షేమాలు తెలుసుకుంటూ కొండంత అండగా నిలబడ్డారు. జడ్పి సీఈఓ గారు, కోవిడ్ నోడల్ ఆఫీసర్ గా ఉన్న హౌసింగ్ పీడి గారు, జేపీ గారు ఏ సమయంలో ఏమి అవసరం అయి కాల్ చేసినా వెంటనే స్పందించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడం, మీరంతా యోగక్షేమాలు తెలుసుకుంటూ జాగ్రత్తలు చెప్తూ ఆనందంగా ఉంచడంతో వెంటనే కోలుకున్నాను. హోమ్ క్వారంటైన్ ఇవ్వడంతో నేనే స్వయంగా ఇంటికి వచ్చాను. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాను ప్రత్యేక గదిలో. ఎలాంటి ఇబ్బంది లేదు.
‘నాకు భరోసా ఇచ్చి, ఆశీస్సులు అందించి, ప్రేమాభిమానాలు చూపిస్తూ మన తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుండి జర్నలిస్టులు, మిత్రులు, రాజకీయ నాయకులు చూపిన ప్రేమ ఎప్పటికి మరువలేను..
ఈ ధైర్యం కరోనా సోకిన ప్రతీ ఒక్కరికీ కొండంత భరోసా.. మనోధైర్యమే కరోనా కి మందు. శాస్త్రీయ పద్దతిలో ఇంటిలో జాగ్రత్తలు తీసుకుని, సెల్ఫ్ క్వారంటైన్ ఉంటే కరోనా వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఎవరూ పాజిటివ్ వస్తే కంగారు పడవద్దు. ఇంట్లో వారికి ధైర్యం చెప్పి, ఇంట్లో సెల్ఫ్ క్వారంటైన్ అవకాశం లేకపోతే కోవిడ్ కేర్ కు వెళ్లండి. లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే ఆసుపత్రులకు వెళ్ళండి. లేకపోతే ఫోనులో వైద్యుల సూచనలు, సెల్ఫ్ క్వారంటయిన్, పౌష్టికాహారం సరిపోతుంది. వైరస్ కట్టడి కోసమే క్వారంటైన్.
హోమ్ క్వారంటయిన్ తర్వాత మళ్ళీ మీతో విధి నిర్వహణలో ఉంటాను.
 Thank you
PS: మాస్క్ తో పాటు కళ్ళజోడు తప్పనిసరి
(ఎబి భార్గవ్, జిల్లా రిపోర్టర్, ఐ న్యూస్, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు)