’ఆంధ్రభూమి‘ మూసేయ వద్దు, 8న ఉద్యోగుల ఛలో హైదరాబాద్

తెలుగు రాష్ట్రాల నుంచి తరలిరానున్నబాధితులు

 

ఏడాది కాలంగా ప్రచురణలు నిలిచిన ఆంధ్రభూమి దినపత్రికను పునరుద్ధరించాలని, ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించాలని, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు చట్టపరంగా చెల్లించాల్సిన బకాయిలు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను పునరుద్ధరించాలని ఆంధ్రభూమి దినపత్రిక ఉద్యోగులు  డిమాండ్ చేస్తూన్నారు.

ఈ డిామాండ్ మీద ఈనెల  8న చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రభూమి ఉద్యోగుల అసోసియేషన్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పిలుపునిచ్చింది.

కోవిడ్ సాకుతో ఏడాది కాలంగా ఆంధ్రభూమి  ప్రచురణ నిలిపివేసిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డిసిహెచ్ఎల్)  యాజమాన్యం  ప్రస్తుతం ఉద్యోగులను బజారున  పడేయడం  సహించరానిదని అసోసియేషన్  కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు.

డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ గొడుగు కింద కొనసాగుతున్నఆంధ్ర భూమి పత్రికపై యాజమాన్యం వివక్ష చూపుతూ పత్రికను మూసివేసే కుట్రలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నాలుగువేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంస్థపై ఆధారపడి జీవిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. జీతాలు లేక తోటి ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నాడెక్కన్ క్రానికల్  ఎంప్లాయిస్ యూనియన్ యాజమాన్యానికి కొమ్ము కాయడం విచారకరమన్నారు. క్రానికల్, ఆంధ్ర భూమి ఉద్యోగులను యాజమాన్యం విభజించి పాలించే ధోరణిని అనుసరించడం సిగ్గుచేటన్నారు.

ఈ పరిస్థితుల్లోనే ఆంధ్రభూమి ఉద్యోగులు ఐక్యమై హక్కుల సాధనకు పోరుబాట పట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. ఓ వైపు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూనే మరో వైపు ప్రత్యక్ష పోరాటానికి  పూనుకున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 8 న తాము నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ష్ట్రాల నుంచి ఆంధ్ర భూమి ఉద్యోగులు తరలివస్తున్నట్టు పేర్కొన్నారు.

తమ ఆందోళనకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు) , తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజె),  తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజె-149), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్ ), తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్, తెలంగాణ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్,  ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజె) జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్) తదితర ప్రధాన జర్నలిస్టుల సంఘాలు తమ ఆందోళనకు సంఘీభావాన్ని ప్రకటించినట్టు చంద్రశేఖర్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *