సిఐ శ్రీరామ్ కు క్లీన్ చిట్; చిత్రం, అది పెద్ద వార్త కాలేదు….

అనంతపురం: సీఐ శ్రీరామ్ పేరు అనంతపురం జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆయన  నిజాయితీని ప్రజలు ప్రశంసలతో గుర్తిస్తే, ప్రభుత్వాలన్నీ మూడు పోస్టింగులు ఆరు ట్రాన్స్ఫర్ లతో సత్కరించేవి. రెగ్యులర్ ట్రాన్స్ ఫర్ ఆయన నిజాయితీకి రివార్డు.
అయితే,  ట్రాన్స్ ఫర్లకు ఆయన జడిసిపోలేదు.  ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా  ఆయన ఒకలాగే పనిచేస్తారని పేరు. ఎక్కడ నియమించినా ప్రజలకు బాగా చేరువవుతారు. పోస్టింగ్ న క్యాన్సిల్ చేయించుకునేందుకు గడప గడప తొక్కే బాపతు కాదు. ఎక్కడ  పని చేసినా నేరగాళ్ల విషయం కఠినంగా వ్యవహారిస్తారు.వాళ్లు స్టేషన్ పరిధి  వదిలి వెళ్లి పోవాల్సిందే.
ఆయన  మీద ఈ మధ్య కొత్తరకం దాడిజరిగింది. అదే క్యారెక్టర్ అశాసినేషన్.   సిఐ శ్రీరామ్ ఏకంగా గంజాయి సరఫరా చేస్తున్నారంటూ ముందు వెనుక ఆలోచించకుండా ప్రచారం మొదలయింది. ఈ వార్త పుట్టగానే  దీనిని ఆసరాగా తీసుకుని కొన్ని టీవీ చానల్స్ తమ శైలిలో అదరగొట్టాయి.ఇందులో నిజమెంతో వెరిఫై చేసుకునేందుకు ఎవరూ ప్రయత్నించలేదు.
దీని మీద విచారణ జరిగింది. ఏకంగా ఎక్సైజ్ కమిషనర్ స్థాయి అధికారులు విచారించారు.
ఆ విచారణలో సీఐ శ్రీరామ్ తప్పేమీ లేదని తేలిపోయింది. విచారణలో క్లీన్ చిట్ వచ్చింది. కాని, దురుద్దేశంతో జరిగిన ఈ క్యాంపెయిన్ వల్ల  జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆయన కుటుంబ సభ్యులు బాధ పడ్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా దీనిని ఖండిస్తున్నారు.
ఇది శ్రీరామ్ కుటుంబ సభ్యులు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి సృష్టించింది. సీఐ శ్రీరామ్ కు క్లీన్ చిట్ లభించిన విషయం పెద్ద వార్త కాకపోవడమే విచిత్రం.
శ్రీరామ్  కు ఒక కుటుంబం ఉంటుందని, తప్పు చేయకపోయినా తప్పుడు కథనాలతో పడిన నిందను వారు మోయాల్సి వస్తుందని, అది బాధకరమయిన విషయమని ఎవరు ఆలోచించలేదు. ఈ మచ్చ ఎవరు తొలగిస్తారు. వారి బాధను ఎవరు తీరుస్తారు.
అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇపుడు శ్రీరామ్ కు అండగా నిలిచారు.
నీతి నిజాయితీ అరుదైన ఈ రోజుల్లో సీఐ శ్రీరామ్ ని అకారణం శిక్షించడం తగదని ఆయనను   హిందూపురం సీఐగా తిరిగి నియమించాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తున్నది.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం ఇటీవల జరిగిన ఒక విలేకర్ల సమావేశంలో నిజాయితీ అధికారి అయిన శ్రీరామ్ పై ముందు వెనుక ఆలోచించకుండా వార్తలు రాశారని ఆవేదన చెందారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా  పని చేస్తున్నందనే  ఒక అధికార పార్టీకి  కంటగింపుగా మారడంతోనే ఈ తప్పుడు నిందలు వచ్చాయనే అనుమానాన్ని ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *