కోరోనా వైరస్ సోకి అనంతపురం సీఐ రాజశేఖర్ మృతి

అనంతపురం:  అనంతపురం నగరంలో ఒక పోలీసు అధికారి కోవిడ్ -19 తో మృతి చెందారు. అనంతపురం పట్టణంలో ట్రాఫిక్ సీఐ గా నిధులు నిర్వర్తిస్తున్న సీఐ రాజశేఖర్ కరోనాతో మంగళవారం మృతి చెందారు. స్థానిక సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం అందింది.
అనంతపురం జిల్లాలో కోవిడ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదలచేసిన బులేటీన్ ప్రకారం జిల్లాలో గత 24 గంటలలో 10 మంది చనిపోయారు. ఈ రోజు 185 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  జిల్లాలో ఇంతవరకు 3651 కేసులు నమోదయ్యాయి.  ఇందులో  1456 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తం  ఇంతవరకు 40   మంది చనిపోయారు. మృతులకు సంబంధించి అనంతపురం జిల్లా మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానం 108 మరణాలతో కర్నూలు జిల్లాది కాగా, కృష్ణా జిల్లా 83 మరణాలతో రెండో స్థానంలో ఉంది.
రాజశేఖర్ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని ఆయన చెప్పారు.  సీఐ రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.