ఆంధ్ర దిశ చట్టం అసమగ్రంగా ఉందంటున్న AIDWA రమాదేవి

(డి రమాదేవి)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం దిశ పేరుతో తీసుకొచ్చిన చట్టాన్ని
స్వాగతిస్తున్నాం. కానీ ఈ చట్టం అసమగ్రంగా ఉంది .21 రోజుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పటం అంటే  అందుకు అవసరమైన యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి.
  కానీ 100 నెంబర్ కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసే కానిస్టేబుల్ను కూడా అపాయింట్ చేసుకోలేదు.ఒక కేసు రిపోర్టు చేసిన తర్వాత విచారణకు అవసరమైన పోలీసు యంత్రాంగం లేదు.  విచారణ చేయడానికి కూడా తగినన్ని కోర్టు లులేవు. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో 22 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వార్తలు తెలియజేస్తున్నాయి.
ఇక జిల్లా తాలూకా స్థాయిలో అనేక పోస్టులు  ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు ఖాళీ ఉండటం మూలంగా కోర్టుల్లో జరగాల్సిన పని కూడా జరగక కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
దిశ చట్టం తీసుకురావడంతో పాటు కోర్టులలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు  కూడా చేయాలి.  అందుకు అవసరమైన  బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ నివేదిక ,విచారణకు అవసరమైన ఏర్పాట్లు తగినంతగా ఏర్పాటు లేకుండా 21 రోజుల్లో విచారణ పూర్తి చేయడమనేది అసాధ్యమైన పని.
ఇప్పుడున్న చట్టాల్లో ఇది కూడా మరో చట్టంగా మిగిలిపోతుంది. ’మహిళల భ ద్రతకు మేము చాలా బాగా చేస్తున్నాము అని ప్రచారం చేసుకోవడం కోసం మాత్రమే ఈ చట్టాన్ని హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నదా?  లేక వాస్తవంగా మహిళల పైన జరుగుతున్న హింసను అరికట్టడానికి చేస్తున్నాదా అనే అనుమానం కలుగుతున్నది.  మహిళలెదుర్కొంటున్న కుటుంబ హింస, ట్రాఫికింగ్ తదితర అన్ని అంశాలను ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలి.
ఈ చట్టాన్ని లైంగిక నేరాలు వరకే పరిమితం చేయడం ఒక పెద్ద లోపం. మరో ముఖ్యమైన అంశం నేరం జరిగాక శిక్షించడం గాక నేరం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం అవసరం. .ఇప్పటికే ఈ విషయం మీద అనేక సూచనలు ప్రభుత్వం ముందున్నాయి .  నిర్భయ సంఘటన తర్వాత కేంద్రం నియమించిన  వర్మ
కమిషన్ తీవ్రమైన శిక్షలు విధించడం  మాత్రమే  పరిష్కారం కాదని చెబుతూ  నేరాలు జరక్కుండా  ఉండేందుకు  అనేక సూచనలు చేసింది. ఈ సిఫార్సులను  ప్రభుత్వం  దృష్టిలో పెట్టుకొని  చట్టాన్ని రూపొందించి ఉండాల్సింది.
అన్నింటిని  గమనంలోకి తీసుకోకుండా ఈ కొత్త చట్టం తీసుకురావడం వల్ల మేమూ  కూడా ఒక చట్టం చేశాం అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ చట్టం ఉపయోగపడుతుంది.అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొనకపోవడం వల్ల మహిళలకు ఆచరణలో ఉపయోగపడకపోవచ్చు. ఉపయోగపడాలి అంటే చట్టాన్ని సమగ్రంగా రూపొందించాలి. అలాగే చట్టం  అమలు చేసేందుకుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సమగ్రంగా ఉండాలి.
అన్నింటికంటే ముఖ్యంగా చిత్తశుద్ధి అవసరం.
(డి. రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA), ఆంధ్ర ప్రదేశ్ కమిటీ, Phone : 9490098620)